అందని వడీ్డ డబు్బలు | Sakshi
Sakshi News home page

అందని వడీ్డ డబు్బలు

Published Sat, Mar 23 2024 1:15 AM

- - Sakshi

మహిళా సంఘాలకు బకాయి రూ.123.63 కోట్లు

నాలుగేళ్లుగా విడుదల చేయని

రాష్ట్ర ప్రభుత్వం

ఎదురుచూపుల్లో మహిళలు

కొత్త ప్రభుత్వంపైనే ఆశలు

దురాజ్‌పల్లి (సూర్యాపేట): క్రమం తప్పకుండా పొదుపుతోపాటు రుణ బకాయిలు, వడ్డీ చెల్లించే మహిళా సంఘాల సభ్యులకు ప్రభుత్వం ఇస్తామన్న వడ్డీ నిధులు అందడం లేదు. ప్రభుత్వం వడ్డీ బకాయిలు ఇస్తే కుటుంబ, వ్యాపార అవసరాలకు వినియోగించుకోవచ్చని మహిళలు భావిస్తున్నా వారి ఆశలు అడియాసలుగా మారాయి. నాలుగు సంవత్సరాలుగా వడ్డీ బకాయిలు రాకపోవడంతో గ్రామీణ ప్రాంతాల్లోని స్వయం సహాయక మహిళా సంఘాల సభ్యులు ఆందోళన చెందుతున్నారు. తాజాగా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సైతం వడ్డీలేని రుణాలను మంజూరు చేస్తామని ప్రకటించడంతో పాత బకాయిలను కూడా చెల్లిస్తారని మహిళలు ఆశగా ఎదురుచూస్తున్నారు.

రూ.123.63 కోట్లు బకాయి

స్వయం సహాయక సంఘాల మహిళలను ఆర్థికంగా ఆదుకునేందుకు ప్రభుత్వం బ్యాంకుల ద్వారా రుణాలు మంజూరు చేస్తోంది. అయితే ఈ రుణాలను సభ్యులు వడ్డీతో సహా చెల్లిస్తుండగా.. తిరిగి వడ్డీ మొత్తాన్ని ప్రభుత్వం సభ్యుల ఖాతాల్లో జమ చేయాలి. కానీ నాలుగేళ్లుగా ఈ ప్రక్రియ జరగడం లేదు. జిల్లాలో 475 పంచాయతీల్లో 27,773 స్వయం సహాయక సంఘాలు ఉండగా, వీటిలో 2.80 లక్షల మంది సభ్యులు కొనసాగుతున్నారు. జిల్లాలోని సభ్యులకు రూ.123.63 కోట్ల మేర వడ్డీ బకాయిలు అందాల్సిఉంది.

2013 నుంచి వడ్డీలేని రుణాలు

మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాలు అందించాలని 2013లో అప్పటి ప్రభుత్వం నిర్ణయించింది. అప్పటి వరకు ఉన్న పాత గ్రూపులతో పాటు కొత్తగా ఏర్పడిన గ్రూపులకు సైతం వడ్డీలేని రుణాల మంజూరు మొదలైంది. గ్రూపు సభ్యులు తొలుత వడ్డీతో రుణాన్ని బ్యాంకుల్లో జమ చేయగానే.. ఆ వడ్డీ తిరిగి గ్రూపు ఖాతాకు మళ్లిస్తారు. ఈ మొత్తాన్ని సభ్యులు తీసుకున్న రుణం ఆధారంగా పంచుకుంటారు. కానీ ప్రభుత్వం నుంచి వడ్డీ రాకపోవడంతో సభ్యులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

నాలుగేళ్లుగా బకాయిలు

స్వయం సహాయక సంఘాల మహిళలకు గతంలో కొంత ఆలస్యంగానైనా వారి ఖాతాల్లో వడ్డీ డబ్బులు జమ చేసేవారు. ప్రతి ఆరు నెలలకోసారి మహిళా సంఘాలు చెల్లించిన రుణం, వడ్డీని లెక్కించి అర్హులైన సంఘాలకు వడ్డీ తిరిగి చెల్లించేవారు. అయితే నాలుగైదేళ్లుగా వడ్డీ సమయానికి చెల్లించడంలేదు. 2016–17, 2017–18 ఏడాదికి సంబంధించిన వడ్డీ నగదు 2022లో విడుదలవగా.. 2018–19, 2019–20కి కొంత మేరకు వడ్డీ బకాయిలు 2023 ఏడాదిలో విడుదలయ్యాయి. ఇక, 2019–20 కొంత మేరకు 2020–21 ఏడాది నుంచి ఇప్పటి వరకు బకాయిలు అసలే రావడం లేదు. ఇదిలా ఉంటే 2023–24 ఏడాదికి వడ్డీ బకాయి లెక్కించలేదు.

రావాల్సిన వడ్డీ బకాయిలు సంవత్సరం వారీగా..

సంవత్సరం సంఘాలు అందాల్సిన వడ్డీ

(రూ.కోట్లలో.)

2019–20 14,055 30.66

2020–21 14,214 30.64

2021–22 14,623 31.99

2022–23 14,573 30.34

Advertisement
Advertisement