అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్న అధికారులు | Sakshi
Sakshi News home page

అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్న అధికారులు

Published Wed, Mar 27 2024 12:10 AM

- - Sakshi

ఈవీఎంలపై గ్రామాల్లో ఓటర్లకు అవగాహన కల్పిస్తున్న అధికారులు (ఫైల్‌)

నెల్లూరు(దర్గామిట్ట): ఓటరుగా నమోదైన ప్రతి ఒక్కరూ ఎలాంటి ప్రలోభాలకు లోను కాకుండా ఓటు హక్కును వినియోగించుకోవడమే ప్రధాన లక్ష్యంగా జిల్లాలో సిస్టమేటిక్‌ ఓటర్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ ఎలక్టోరల్‌ పార్టిసిపేషన్‌ (స్వీప్‌) కమిటీ విస్తృతంగా ఓటరు చైతన్య కార్యక్రమాలను చేపట్టింది. 2024 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో గతంలో కన్నా ఓటింగ్‌ శాతాన్ని పెంచడం, ఓటర్లందరూ స్వచ్ఛందంగా ఓటు హక్కును వినియోగించుకునేలా వారిలో చైతన్యం తీసుకువచ్చేందుకు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ ఎం.హరినారాయణన్‌ పర్యవేక్షణలో స్వీప్‌ బృందాలు ఓటరు అవగాహన కార్యక్రమాలను ముమ్మరంగా నిర్వహిస్తున్నాయి. జిల్లాస్థాయిలో కలెక్టర్‌ హరినారాయణన్‌ చైర్మన్‌గా, డీఆర్‌డీఏ పీడీ సాంబశివారెడ్డి కన్వీనర్‌గా, నుడా వైస్‌ చైర్మన్‌ బాపిరెడ్డి నోడల్‌ అధికారిగా, వివిధ శాఖల అధికారులు సభ్యులుగా జిల్లాలో ఓటరు చైతన్య అవగాహన కార్యక్రమాలను చేపడుతున్నారు.

అందరి భాగస్వామ్యంతో..

ప్రతి నియోజకవర్గంలో ఒక స్వీప్‌ నోడల్‌ అధికారిగా ఎంఈఓ, డీఈ, ఇద్దరు ఏపీఎంలు, 8 మంది నోడల్‌ అధికారులతో కమిటీని ఏర్పాటు చేశారు. వీరికి ఇప్పటికే శిక్షణ కార్యక్రమాలు పూర్తి చేశారు. ప్రతి నియోజకవర్గంలో ఎలక్టోరల్‌ లిటరసీ క్లబ్స్‌, ప్రతి పోలింగ్‌ కేంద్రం పరిధిలో బూత్‌ లెవెల్‌ క్లబ్‌లను ఏర్పాటు చేసి యూత్‌ ఓటర్లు, సీనియర్‌ సిటిజన్లు, స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులను భాగస్వామ్యం చేస్తూ ఓటర్‌ అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరినీ ఓటరుగా నమోదు చేయడమే ఈ క్లబ్‌ల ప్రధాన ఉద్దేశం.

సోషల్‌ మీడియా ద్వారా ప్రచారం

ఓటు ప్రాధాన్యం, వినియోగించుకోవాల్సిన ఆవశ్యకతను తెలుపుతూ సోషల్‌ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌, ఇన్‌స్ట్రాగామ్‌, యూట్యూబ్‌ తదితర సోషల్‌ మీడియా మాధ్యమాల ద్వారా ఓటర్లను చైతన్యవంతులను చేసే కార్యక్రమాలను చేపడుతున్నారు. క్యూఆర్‌ కోడ్‌ డిస్‌ప్లే చేస్తూ దాన్ని స్కాన్‌ చేయగానే ఓటరు చైతన్య కార్యక్రమాలు ప్రసారమయ్యేలా రూపొందించారు. పోలింగ్‌ తేదీ మే 13ను తప్పకుండా గుర్తుంచుకోవాలని, తమ అభ్యర్థి గురించి తెలుసుకోవాలని పోస్టులు పెడుతూ ఓటర్లను చైతన్య పరుస్తున్నారు. జిల్లాలో ప్రముఖ వెయిట్‌ లిఫ్టర్‌ కె.తులసి, సామాజిక కార్యకర్త అరుణకుమారి, ఇంటర్నేషనల్‌ కబడ్డీ ప్లేయర్‌ మహేష్‌బాబును జిల్లా ఐకాన్లుగా గుర్తించి వారి ద్వారా ఓటు విలువను తెలుపుతూ వీడియోలను ప్రసార మాధ్యమాల్లో ప్రసారం చేస్తున్నారు.

దూర ప్రాంత ఓటర్లకు ఫోన్‌ ద్వారా సమాచారం

ఓటింగ్‌ శాతం పెంచేందుకు 100 శాతం ఓటరు స్లిప్పులను డోర్‌ టు డోర్‌ అందించేలా చర్యలు చేపడుతున్నాం. ఉద్యోగరీత్యా దూర ప్రాంతాల్లో ఉన్న వారికి కూడా ‘ఓటర్లకు వందనం’ పేరుతో ఫోన్‌ ద్వారా వారి ఓటు ఏ పోలింగ్‌ కేంద్రంలో ఉందో సమాచారం అందించి ఓటు హక్కు వినియోగించుకోవాలని చెబుతాం. కియోస్కోలను ఏర్పాటు చేసి తమ ఓటు ఎక్కడ ఉందో ఓటరు తెలుసుకునేలా చర్యలు తీసుకుంటున్నాం. జిల్లావ్యాప్తంగా బైక్‌ ర్యాలీలు, పోస్టర్‌ క్యాంపెయిన్‌, మానవహారాలు ఏర్పాటు చేసి ఓటు హక్కుపై విస్తృత అవగాహన కార్యక్రమాలు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నాం. నెల్లూరు నగరంలో ఎంజీ మాల్‌లో సెల్ఫీ బూత్‌ ఏర్పాటు చేసి అవగాహన కల్పించాం.

– సాంబశివారెడ్డి, పీడీ, డీఆర్‌డీఏ

ప్రతి ఒక్కరూ ఓటు

వినియోగించుకునేలా చర్యలు

స్వీప్‌ ఆధ్వర్యంలో ముమ్మర ప్రచారం

ఓటింగ్‌ శాతం పెంచడమే

ప్రధాన లక్ష్యం

ర్యాలీ ద్వారా ఓటు ప్రాముఖ్యతను 
తెలియజేస్తున్న అధికారులు
1/1

ర్యాలీ ద్వారా ఓటు ప్రాముఖ్యతను తెలియజేస్తున్న అధికారులు

Advertisement
Advertisement