Brendan Taylor: మ్యాచ్‌ ఫిక్సింగ్‌ వ్యవహారంలో జింబాబ్వే మాజీ కెప్టెన్‌ సంచలన వ్యాఖ్యలు

Zimbabwe Cricketer Brendan Taylor Makes Explosive Claim Against Indian Business Man For Match Fixing - Sakshi

జింబాబ్వే తరఫున అత్యధిక శతకాలు(17) బాదిన క్రికెటర్‌గా రికార్డుల్లో నిలిచిన ఆ దేశ మాజీ కెప్టెన్‌ బ్రెండన్ టేలర్, మ్యాచ్‌ ఫిక్సింగ్‌కు సంబంధించి సంచలన విషయాలను వెల్లడించాడు. 2019లో ఓ భారత వ్యాపారవేత్త, తనను మ్యాచ్ ఫిక్సింగ్ చేయమని బెదిరించాడని, అందుకు అతను 15000 అమెరికన్‌ డాలర్లు ఆఫర్‌ చేశాడని ట్విటర్‌ వేదికగా ఆరోపణలు చేశాడు. నాటి ఆర్ధిక పరిస్థితుల దృష్ట్యా తాను ఆ వ్యక్తి నుంచి కొంత నగదు కూడా తీసుకున్నట్లు అంగీకరించాడు.

గతేడాది సెప్టెంబర్‌లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన టేలర్‌.. 2019లో ఓ ప్రముఖ భారత వ్యాపారవేత్త ఆహ్వానం మేరకు భారత్‌కు వచ్చానని, ఆ సందర్భంగా ఓ పార్టీలో కొందరు నాకు కొకైన్‌ ఆఫర్‌ చేశారని, తాను కొకైన్‌ సేవిస్తుండగా వీడియోలు తీసి బెదిరించడం మొదలుపెట్టారని, ఈ క్రమంలోనే మ్యాచ్‌ ఫిక్సింగ్‌ కూడా చేయమన్నారని సంచలన స్టేట్‌మెంట్‌ను విడుదల చేశాడు. 

ఆ వ్యాపారవేత్త జింబాబ్వేలో టీ20 లీగ్‌ను లాంచ్‌ చేస్తామని తనను సంప్రదించాడని, అప్పటికే తమ దేశ క్రికెట్ బోర్డు నుంచి ఆరు నెలలుగా జీతాలు లేవని, తన ఆర్ధిక అవసరాలను ఆసరాగా తీసుకుని సదరు వ్యక్తి తనను ప్రలోభ పెట్టాడని, తాను అంగీకరించకపోయే సరికి బ్లాక్‌ మెయిలింగ్‌కు దిగాడని స్టేట్‌మెంట్‌ ఇచ్చాడు. గత రెండేళ్లుగా ఈ భారాన్ని మోయలేక మానసికంగా, శారీరకంగా కృంగిపోయానని, అందుకే ఈ స్టేట్‌మెంట్‌ను విడుదల చేస్తున్నాని పేర్కొన్నాడు.

జింబాబ్వే తరఫున 34 టెస్ట్‌లు, 205 వన్డేలు, 45 టీ20లు ఆడిన టేలర్.. టెస్ట్‌ల్లో 6 సెంచరీలు, వన్డేల్లో 11 సెంచరీలు సహా దాదాపు పది వేల పరుగులు చేశాడు. 35 ఏళ్ల ఈ ఆల్‌రౌండర్‌.. 2014 ఐపీఎల్‌ సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడాడు. కాగా, తనను ఫిక్సింగ్‌ చేయమన్న ఆ వ్యాపారవేత్త ఎవరనే విషయాన్ని మాత్రం టేలర్‌ వెల్లడించలేదు.
చదవండి: ICC Awards 2021: వన్డే క్రికెటర్‌ ఆఫ్‌ ద ఇయర్‌ ఎవరంటే..!

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top