విధ్వంసం సృష్టించిన విండీస్‌ బ్యాటర్లు.. బెంబేలెత్తిపోయిన ప్రత్యర్ధి బౌలర్లు | West Indies Beat Ireland By 62 Runs In 3rd T20I | Sakshi
Sakshi News home page

విధ్వంసం సృష్టించిన విండీస్‌ బ్యాటర్లు.. బెంబేలెత్తిపోయిన ప్రత్యర్ధి బౌలర్లు

Jun 16 2025 11:32 AM | Updated on Jun 16 2025 11:40 AM

West Indies Beat Ireland By 62 Runs In 3rd T20I

ఐర్లాండ్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను పర్యాటక వెస్టిండీస్‌ 1-0 తేడాతో కైవసం​ చేసుకుంది. నిన్న (జూన్‌ 15) జరిగిన మూడో టీ20లో విండీస్‌ 62 పరుగుల తేడాతో ఐర్లాండ్‌ను చిత్తు చేసింది. ఈ సిరీస్‌లో మొదటి రెండు మ్యాచ్‌లు వర్షం కారణంగా టాస్‌ కూడా పడకుండానే రద్దు కాగా.. చివరి మ్యాచ్‌లో విండీస్‌ బ్యాటర్లు చెలరేగిపోయారు.

ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన విండీస్‌.. ఓపెనర్లు ఎవిన్‌ లెవిస్‌ (44 బంతుల్లో 91; 7 ఫోర్లు, 8 సిక్సర్లు), షాయ్‌ హోప్‌ (27 బంతుల్లో 51; 4 ఫోర్లు, 4 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 256 పరుగులు చేసింది.

లెవిస్‌, హోప్‌ తొలి వికెట్‌కు 122 పరుగులు జోడించి ఔటయ్యాక, హెట్‌మైర్‌ (7 బంతుల్లో 15; 3 ఫోర్లు), కీసి కార్టీ (22 బంతుల్లో 49 నాటౌట్‌; 4 ఫోర్లు, 4 సిక్సర్లు) తమదైన శైలిలో విరుచుకుపడ్డారు. ఆఖర్లో జేసన్‌ హోల్డర్‌ (13 బంతుల్లో 18; 2 ఫోర్లు, సిక్స్‌), రొమారియో షెపర్డ్‌ (6 బంతుల్లో 19 నాటౌట్‌; 3 సిక్సర్లు) కూడా బ్యాట్‌ ఝులిపించడంతో విండీస్‌ అతి భారీ స్కోర్‌ చేసింది.

ఐర్లాండ్‌ బౌలర్లలో మాథ్యూ హంఫ్రేస్‌ (4-0-16-2) ఒక్కడే విండీస్‌ బ్యాటర్ల ఊచకోతను తప్పించుకున్నాడు. మిగతా బౌలర్లంతా 12కు పైగా సగటుతో పరుగులు సమర్పించుకున్నారు. లియామ్‌ మెక్‌కార్టీకి (4-0-81-0) విండీస్‌ బ్యాటర్లు చెడుగుడు ఆడుకున్నారు. 

ఫలితంగా అతను ఓ టీ20 ఇన్నింగ్స్‌లో రెండో అత్యధిక పరుగులు సమర్పించుకున్న బౌలర్‌గా చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. ఓ టీ20 ఇన్నింగ్స్‌లో అత్యధిక పరుగులు సమర్పించుకున్న చెత్త రికార్డు గాంబియా బౌలర్‌ మూసా జోబార్తే (4-0-93-0) పేరిట ఉంది.

అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన ఐర్లాండ్‌.. ఎక్కడా విజయం దిశగా సాగుతున్నట్లు కనిపించలేదు. ఆ జట్టు నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది. ఓపెనర్‌ రాస్‌ అడైర్‌ (48) ఆ జట్టు ఇన్నింగ్స్‌లో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. హ్యారీ టెక్టార్‌ (38), మార్క్‌ అడైర్‌ (31 నాటౌట్‌) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. వీరి తర్వాత అత్యధిక పరుగులు ఎక్స్‌ట్రాల రూపంలో (23) వచ్చాయి.  విండీస్‌ బౌలర్లలో అకీల్‌ హొసేన్‌ 3, జేసన్‌ హోల్డర్‌ 2, రొమారియో షెపర్డ్‌, రోస్టన్‌ ఛేజ్‌ తలో వికెట్‌ తీశారు. 

Advertisement
 
Advertisement
Advertisement