ఎప్పుడో నా కెరీర్ ముగిసింద‌న్నారు.. కానీ ప‌దేళ్లు పూర్తి చేసుకున్నాను: బుమ్రా | Jasprit Bumrah Hits Back At Critics After 5-Wicket Haul Against England | Sakshi
Sakshi News home page

ఎప్పుడో నా కెరీర్ ముగిసింద‌న్నారు.. కానీ ప‌దేళ్లు పూర్తి చేసుకున్నాను: బుమ్రా

Jun 23 2025 11:32 AM | Updated on Jun 23 2025 12:27 PM

Jasprit Bumrah Hits Back At Critics After 5-Wicket Haul Against England

లీడ్స్ వేదిక‌గా ఇంగ్లండ్‌తో జ‌రుగుతున్న తొలి టెస్టులో టీమిండియా స్టార్ ఫాస్ట్ బౌల‌ర్ అద్బుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచాడు. మొద‌టి ఇన్నింగ్స్‌లో ఫైవ్ వికెట్ల హాల్‌తో మెరిశాడు. రెండో రోజు ఆట‌లో మూడు వికెట్లు ప‌డ‌గొట్టిన బుమ్రా.. రెండో రోజు ఆట‌లో మ‌రో రెండు వికెట్లను సాధించాడు.

దీంతో విదేశీగ‌డ్డ‌పై టెస్టుల్లో అత్య‌ధిక సార్లు ఫైవ్ వికెట్ హాల్ సాధించిన భార‌త బౌల‌ర్‌గా క‌పిల్‌దేవ్ స‌ర‌స‌న బుమ్రా(12) నిలిచాడు. అయితే మూడో రోజు ఆట‌ అనంత‌రం విలేక‌రుల స‌మావేశంలో మాట్లాడిన బుమ్రా.. త‌న ఫిట్‌నెస్‌పై విమ‌ర్శ‌లు చేసే వారికి గ‌ట్టి కౌంటరిచ్చాడు. త‌న శ‌రీరం స‌హ‌క‌రించేంత‌వ‌ర‌కు భార‌త్ త‌ర‌పున క్రికెట్ ఆడాల‌ని అనుకుంటున్నాన‌ని అత‌డు తెలిపాడు.

కాగా గ‌త క్యాలెండర్ ఈయ‌ర్‌లో భార‌త్ త‌ర‌పున అత్య‌ధిక మ్యాచ్‌లు ఆడిన బౌల‌ర్‌గా నిలిచిన బుమ్రా.. ఆస్ట్రేలియాతో జరిగిన 5వ టెస్ట్ సందర్భంగా వెన్ను గాయం బారిన ప‌డ్డాడు. ఈ గాయం కారణంగా బుమ్రా దాదాపు నాలుగు నెలలు ఆటకు దూరమ‌య్యాడు. ఈ క్ర‌మంలో కీల‌క‌మైన ఛాంపియ‌న్స్ ట్రోఫీ-2025లోనూ జ‌స్ప్రీత్ భాగం కాలేదు. ఐపీఎల్‌-2025తో తిరిగి మైదానంలో అడుగుపెట్టాడు. ఆ త‌ర్వాత ఇంగ్లండ్ టూర్‌కు వ‌చ్చిన‌ప్ప‌టికి వ‌ర్క్‌లోడ్‌, ఫిట్‌నెస్ కారణంగా మొత్తం అన్ని మ్యాచ్‌లు ఆడుతాడ‌న్న గ్యారెంటీ లేదు.

రిపోర్టర్‌:  గాయం బారిన ప్రతీసారీ మీపై వచ్చే విమర్శలకు బాధపడతారా?

బమ్రా: "నా ఫిట్‌నెస్‌పై వచ్చే నెగిటివ్ కామెం‍ట్లను పట్టించుకోను. అరంగేట్రం నుంచి నా ఫిట్‌నెస్‌పై ఏదో ఒకటి అంటూనే ఉన్నారు. మొదటిలో కొంతమంది నేను ఎనిమిదినెలలు మాత్రమే ఆడగలనని అన్నారు. మరికొంతమంది 10 నెలల మాత్రమే అన్నారు. కానీ ఇప్పుడు నేను అంతర్జాతీయ క్రికెట్‌లో పదేళ్ల కెరీర్‌ను పూర్తి చేసుకున్నాను. 12-13 సంవత్సరాలపాటు ఐపీఎల్ ఆడాను.

ప్రతీ గాయం తర్వాత నా కెరీర్ ముగిసిపోయిందని, అతడు మరి తిరిగి రాడని కామెంట్స్ చేస్తుంటారు. వారి అలానే అనుకోనివ్వండి. నా పని నేను చేసుకుపోతాను. ప్రతి నాలుగు నెలలకు ఇలాంటి మాటలు వింటూనే ఉంటాము. నేను దాని గురించి ఎక్కువగా ఆలోచించను.

దేవుడు రాసిపెట్టినంత కాలం భారత తరపున క్రికెట్ ఆడుతాను. అందుకు తగ్గట్టు నా శరీరాన్ని కూడా సిద్దం చేసుకుంటాను. నేను అలిసి పోయాను అనుకున్నప్పుడు క్రికెట్‌ను వదిలేస్తాను. భారత క్రికెట్ జట్టును మరింత ముందుకు తీసుకువెళ్లడమే నా లక్ష్యమంటూ" సమాధనమిచ్చాడు

Advertisement
 
Advertisement
Advertisement