
పెళ్లి వేడుకకు వచ్చి బాలుడు మృతి
వరి కోత మిషన్ వెనక్కి తీస్తుండగా ఢీకొట్టడంతో ప్రమాదం
లారీ ఢీకొని జీఎంఆర్ కూలీ
చేగుంట(తూప్రాన్): లారీ ఢీకొని జీఎంఆర్ సంస్థలో రోడ్డు పనులు చేస్తున్న కూలీ మృతి చెందాడు. ఈ ఘటన మండల కేంద్రమైన మాసాయిపేట శివారులోని బంగారమ్మ గుడి సమీపంలో ఆదివారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. పోతాన్‌పల్లి గ్రామానికి చెందిన తలారి అశోక్(30) జీఎంఆర్ సంస్థలో జాతీయ రహదారిపై కూలీ పనులు చేస్తుంటాడు. ఆదివారం అశోక్ పని చేసేందుకు వచ్చి మాసాయిపేట శివారులో బంగారమ్మ గుడి వద్ద రోడ్డు పనులు చేస్తుండగా లారీ ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోతాన్‌పల్లి గ్రామస్తులు మృతుడి బంధువులు ఘటనా స్థలం వద్ద రాస్తారోకో నిర్వహించారు. జీఎంఆర్ ప్రతినిధులు పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. రాస్తారోకోతో సుమారు మూడు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. తూప్రాన్, వెల్దుర్తి, చేగుంట పోలీసులు అక్కడికి చేరుకొని నిరసన కారులను శాంతింపజేసి ట్రాఫిక్ క్లియర్ చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ చైతన్యకుమార్‌రెడ్డి తెలిపారు.
చేగుంట(తూప్రాన్): పెళ్లి వేడుకల కోసం వరి కోత యంత్రం కిందపడి బాలుడు మృతి చెందిన ఘటన మండలంలోని ఇబ్రహీంపూర్ గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. చిన్నశంకరంపేట మండలం శాలిపేట గ్రామానికి చెందిన హర్షిత్(6) తల్లిదండ్రులతో కలిసి చేగుంట మండలం ఇబ్రహీంపూర్‌కు తన మేనమామ రాజు వివాహానికి వచ్చారు. మూడు రోజుల కిందట వివాహ వేడుకలు పూర్తి కాగా హర్షిత్ ఆడుకుంటున్న క్రమంలో వరి కోత యంత్రం వెనుకకు తీస్తున్న క్రమంలో హర్షిత్‌ను ఢీకొనగా అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు బాలుడి బంధువులు ఆగ్రహించి హర్షిత్ మృతదేహాన్ని వరికోత యంత్రం యజమాని ఇంటి ఎదుట వేసి నిరసన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతుడి బంధువులను సముదాయించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రామాయంపేట ప్రభుత్వాస్పత్రికి తరలించినట్లు ఎస్‌ఐ చైతన్యకుమార్‌రెడ్డి తెలిపారు.
అదుపుతప్పి బైక్‌పై నుంచి పడి
హవేళిఘణాపూర్(మెదక్): బైక్‌పై నుంచి కిందపడి తీవ్ర గాయాలతో చికిత్స పొందుతూ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన మండల పరిధిలోని గాజిరెడ్డిపల్లి మలుపు వద్ద చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం నతిమితండాకు చెందిన రమేశ్(40) భార్య స్వరూపతో కలిసి మెదక్ మండలం శివ్వాయిపల్లి తండా బంధువుల వద్దకు వెళ్లి తిరిగి వస్తున్నారు. శనివారం సాయంత్రం గాజిరెడ్డిపల్లి మలుపు వద్దకు రాగానే ఎదురుగా వస్తున్న ఆటోను గమనించి తప్పించబోయి అదుపుతప్పి కిందపడిపోయారు. రమేశ్‌కు తీవ్ర గాయాలు కాగా మెదక్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. భార్య స్వరూపకు ఎలాంటి గాయాలు కాలేదు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
రేకులు వేసేందుకు వెళ్లి కిందపడటంతో..
చేగుంట(తూప్రాన్): రేకులు వేసేందుకు వెళ్లిన వ్యక్తి ప్రమాదవశాత్తు కిందపడి మృతి చెందాడు. ఈ ఘట న వడియారం గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. వడియారం గ్రామానికి చెందిన గూని నాగరాజు(28) రేకుల షెడ్‌లను నిర్మిస్తుంటాడు. చేగుంటలోని శంకర్‌గౌడ్ ఇంటి దాబాపై రేకులు వేస్తున్నాడు. పాత రేకులను తీస్తున్న క్రమంలో గోడపై నుంచి కిందపడి నాగరాజు తలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే మేడ్చల్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా అప్పటికే నాగరాజు మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతుడి భార్య లావణ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ చైతన్యకుమార్‌రెడ్డి తెలిపారు.
విద్యుదాఘాతంతో మహిళ
న్యాల్‌కల్(జహీరాబాద్): విద్యుదాఘాతంతో మహిళ మృతి చెందిన ఘటన మండల పరిధిలోని హుస్సేన్ నగర్ గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది. హద్నూర్ ఎస్‌ఐ చల్లా రాజశేఖర్ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన వడగావ్ సిద్దమ్మ రోజు మాదిరిగానే ఉదయం స్నానం ముగించుకొని బయటికొచ్చి రేకుల షెడ్డు వద్ద గల ఇనుప రాడును పట్టుకుంది. అప్పటికే రాడుకు విద్యుత్ తీగ తగిలి కరెంట్ సరఫరా అవుతుండటంతో సిద్దమ్మ విద్యుదాఘాతానికి గురైంది. ఇది గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం సమీపంలో గల బీదర్ ప్రభుత్వాస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతురాలి కుటుంబ సభ్యుల పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ వివరించారు. విషయం తెలుసుకున్న జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్‌రావు మృతురాలి కుటుంబాన్ని పరామర్శించారు.

పెళ్లి వేడుకకు వచ్చి బాలుడు మృతి

పెళ్లి వేడుకకు వచ్చి బాలుడు మృతి

పెళ్లి వేడుకకు వచ్చి బాలుడు మృతి

పెళ్లి వేడుకకు వచ్చి బాలుడు మృతి