నేను పార్టీ మారడం లేదు | Sakshi
Sakshi News home page

నేను పార్టీ మారడం లేదు

Published Wed, Mar 27 2024 7:35 AM

కౌడిపల్లి: మదన్‌రెడ్డిని ఆయన స్వగృహంలో కలిసిన ఎమ్మెల్యేలు హరీశ్‌రావు, సునీతారెడ్డి  - Sakshi

కౌడిపల్లి(నర్సాపూర్‌)/నర్సాపూర్‌: నేను పార్టీ మారటం లేదని బీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి తెలిపారు. మంగళవారం కౌడిపల్లికి వచ్చిన సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. తాను కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు ప్రచారం జరుగుతోందని, సీఎంఆర్‌ఎఫ్‌ ఇతర అభివృద్ధి పనుల కోసం మైనంపల్లి హన్మంతరావును ఓ ఫంక్షన్‌లో కలిశానన్నారు. అయితే మైనంపల్లిని ఆయన ఇంటి వద్ద కలిసి కాంగ్రెస్‌లో చేరేందుకు చర్చలు జరిగినట్లు ప్రచారం జరుగుతుందని విలేకరులు ప్రశ్నించగా.. అభివృద్ధి పనుల కోసమే ఆయన్ను కలిసినట్లు వెల్లడించారు. మాజీ ఎమ్మెల్యే వెంట ఎంపీపీ ఉపాధ్యక్షుడు ననీన్‌గుప్తా, డీసీసీబీ డైరెక్టర్‌ గోవర్దన్‌రెడ్డి, మాజీ సీడీసీ చైర్మన్‌ దుర్గారెడ్డి, రాజుయాదవ్‌, శ్రీనివాసరావ్‌ తదితరులు ఉన్నారు.

మైనంపల్లితో మదన్‌రెడ్డి భేటీ

కాంగ్రెస్‌ నాయకుడు మైనంపల్లి హన్మంతరావుతో బీఆర్‌ఎస్‌ నర్సాపూర్‌ మాజీ ఎమ్మెల్యే చిలుముల మదన్‌రెడ్డి భేటీ అయ్యారు. మంగళవారం సాక్షి ప్రచురించిన ‘కాంగ్రెస్‌ వైపు మదన్‌రెడ్డి చూపు’ కథనం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. కాగా కాంగ్రెస్‌లో చేరేందుకు గాను సీఎం రేవంత్‌రెడ్డి ముఖ్య అనుచరుల వద్ద ఇటీవల ఆయన చర్చలు జరిపారని తెలిసింది. ఆ మేరకు కాంగ్రెస్‌ అధిష్టానం సూచనల మేరకు మంగళవారం మైనంపల్లి హన్మంతరావు అనుచరుడు కొంపల్లి ఏరియాలో నివాసం ఉండే మెదక్‌కు చెందిన ఉప్పల రాజేశానికి చెందిన ఇంట్లో వారు కలుసుకొని చర్చలు జరిపారు. ఇందులో త్వరలో జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో మెదక్‌ లోక్‌సభ కాంగ్రెస్‌ టికెట్‌ ఇప్పించాలని మదన్‌రెడ్డి హన్మంతరావును అడిగారని సమాచారం. మైనంపల్లి కూడా ముఖ్యమంత్రితో అపాయింట్‌మెంట్‌ తీసుకుని అక్కడికి తీసుకుపోతానని, ఈ విషయాన్ని సీఎంతోపాటు పార్టీ ఢిల్లీ నాయకత్వం నిర్ణయిస్తుందని, అప్పటివరకు ఎలాంటి హామీ ఇవ్వలేనని హన్మంతరావు అన్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. మదన్‌రెడ్డి వెంట శివ్వంపేట పీఏసీఎస్‌ చైర్మన్‌ వెంకట్రాంరెడ్డి, డీసీఎంఎస్‌ ఉపాధ్యక్షుడు గోవర్దన్‌రెడ్డి, మరో బీఆర్‌ఎస్‌ నాయకుడు శ్రీనివాస్‌రావులు ఉన్నారని సమాచారం. కాగా మెదక్‌ లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్‌ టికెట్‌ ఇచ్చినా ఇవ్వక పోయినా బీఆర్‌ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరడానికి మదన్‌రెడ్డి నిర్ణయించుకున్నారని ఆయన అనుచరులు తెలిపారు.

బీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి

బుజ్జగించిన హరీశ్‌రావు

మదన్‌రెడ్డి బీఆర్‌ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు ప్రచారం కావడంతో మాజీ మంత్రి హరీశ్‌రావు ఆయన్ను కలిసి రహస్య మంతనాలు జరిపారు. మంగళవారం కౌడిపల్లిలోని మదన్‌రెడ్డి స్వగృహంలో ఎమ్మెల్యే సునీతారెడ్డి, బీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థి వెంకట్రాంరెడ్డి, ఎమ్మెల్సీ ఫారూక్‌ హుస్సేన్‌లతో కలిసి ఆయన ప్రత్యేకంగా ఒక గదిలో చర్చించారు. బీఆర్‌ఎస్‌ను వీడవద్దని బుజ్జగింపులు చేసినట్లు సమాచారం. పెద్దాయన బాగోగులు తాము చూసుకుంటామని హరీశ్‌ అక్కడ ఉన్నవారితో చెప్పారు. అయినప్పటికీ మదన్‌రెడ్డి మాత్రం ప్రతికూలంగానే మాట్లాడినట్లు సమాచారం. కొద్దిసేపు తర్వాత అక్కడి నుంచి వెంకట్రాంరెడ్డితో కలిసి హరీశ్‌ మెదక్‌ వెళ్లిపోయారు. అలాగే మదన్‌రెడ్డి వైద్యపరీక్షల కోసం హైదరాబాద్‌ వెళ్తున్నట్లు చెప్పి వెళ్లిపోయారు.

Advertisement
Advertisement