కావసాకీ వారి కీలుగుర్రం | Corleo created by Kawasaki company | Sakshi
Sakshi News home page

కావసాకీ వారి కీలుగుర్రం

May 1 2025 3:59 AM | Updated on May 1 2025 4:01 AM

Corleo created by Kawasaki company

నడిచే, ఎగిరే, దూకే 4 కాళ్ల రోబో వాహనం 

మనిషి ఆలోచన, యంత్ర మేధల సమన్వయం.. కావసాకీ కంపెనీ సృష్టించిన ‘కోర్లియో’ 

2050 నాటికి ఆవిష్కృతమయ్యే అవకాశం 

1949లో విడుదలైన శోభనాచల పిక్చర్స్‌ వారి ‘కీలుగుర్రం’ఆకాశంలో ఎగురుతుంది!  మూడు సముద్రాలు దాటి రాకుమారి ఉన్న దీవికి చేరుకుంటుంది!  రాజ్యాన్ని కాపలా కాస్తుంది. విక్రమసేనుణ్ని అంగరాజ్య సేనాధిపతిని చేస్తుంది.  76 ఏళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు అలాంటి కీలుగుర్రమే సోషల్‌ మీడియాలో స్వారీ చేస్తోంది! కొండలపైకి ఎక్కుతోంది. వాగుల్ని వంకల్ని దాటుతోంది. లోయల పైనుంచి గెంతుతోంది. చిరుతపులిలా ఒళ్లు సాగతీసుకుంటూ గాల్లోకి లేస్తోంది. అరణ్యాలలో పరుగులు పెడుతోంది. ఇవన్నీ కూడా పైన ఒక మనిషిని మోస్తూనే చేస్తోంది.  ఈ కీలుగుర్రాన్ని ‘సృష్టించింది’‘కావసాకీ’వారు. గుర్రం పేరు ‘కోర్లియో’.  – (సాక్షి, స్పెషల్‌ డెస్క్) 

కంప్యూటర్‌ జనరేటెడ్‌ కాన్సెప్ట్‌ 
‘కోర్లియో’అనే ఈ కీలుగుర్రం. నిజానికింకా జీవం పోసుకోనే లేదు. ఇదొక కంప్యూటర్‌ జనరేటెడ్‌ కాన్సెప్‌్ట. రోబో కీలు గుర్రాన్ని సృష్టిస్తే అదెలా పని చేస్తుంది? ఎన్ని విధాలుగా మానవ జీవితాన్ని సౌకర్యవంతం చేస్తుంది? అని ఊహిస్తూ కావసాకీ విడుదల చేసిన వీడియోనే ఇప్పుడు వైరల్‌ అవుతోంది. 

జపాన్‌లోని ఒసాకాలో ప్రస్తుతం జరుగుతున్న ‘కాన్సాయ్‌ ఎక్స్‌పో 2025’లో కావసాకీ ఈ ‘కోర్లియో’కీలుగుర్రం కాన్సెప్ట్‌ను ప్రదర్శించింది. కోర్లియో కాన్ఫిగరేషన్‌లలో ప్రధానమైనది దృఢమైన నాలుగు రోబో కాళ్లు. అవి స్థిరంగా ఉండి, పరుగెత్తటానికి, దుమకటానికి; ముందుకు, వెనక్కు కదలటానికి అనువైన సాంకేతిక నైపుణ్యాన్ని కలిగి ఉంటాయి.  

విప్లవాత్మకమైన చలనశీలత! 
రోబోలు ముందు వెనుకలకు కదలటం, వివిధ రంగాలలో సేవలు అందించటం, సైన్యంలో వ్యూహాలకు అనుగుణంగా టాస్క్ లను చక్కబెట్టటం వంటివి మామూలే. కానీ ‘కోర్లియో’ప్రత్యేకమైనది. సాఫీగా లేని మార్గాలలో అది సొంత తెలివితో ప్రయాణిస్తుంది. అనువు కాని చోట కూడా ముందుకు సాగుతుంది. రోబోల సృష్టిలో మునుపెన్నడూ లేని విప్లవాత్మకమైన చలనశీలత ఇది. వాహనాలు వెళ్లలేని మార్గాలలో సైతం కోర్లి యో మనిషిని సురక్షితంగా మోసుకెళుతుంది.  

‘కోర్లియో’ఫార్ములా వెనుక 
రోబో అనేది రెండు ప్రధాన భాగాలతో కూడిన సంక్లిష్టమైన యంత్రం. ఒకటి శరీరం, ఇంకొటి సమాచార ప్రాసెసింగ్‌ యూనిట్‌. వీటిని పని చేయించటానికి యాక్యుయేటర్లు (శక్తిని భౌతిక చలనంగా మార్చే పరికరాలు), సెన్సర్‌లు ఉంటాయి. అయితే చక్రాల వాహనాలతో పోల్చినప్పుడు కాళ్ల రోబోలు తమను తాము నిరంతరం సమతుల్యం చేసుకుని, తమ బరువును తామే భరించాల్సి ఉంటుంది. 

తమ పైన కూర్చున్నవారికి కుషనింగ్‌ అందించే స్థాయి సస్పెన్షన్‌ను కూడా అందించవలసి ఉంటుంది. కోర్లియోకైతే మరింత శక్తిశీలమైన, బలమైన యాక్యులేటర్‌లు అవసరం అవుతాయి. వాటిని వృద్ధి చేస్తే.. కొండలెక్కే, జలాలపై నుంచి ఎగిరి దుమికే కీలు గుర్రాన్ని తయారు చేయవచ్చునని కావసాకీ ఆలోచన. 

కోర్లియోపై ప్రస్తుత అంచనాలు – ప్రత్యేకతలు 
»  2050 నాటికి ఆవిష్కరణ, పూర్తిగా కాలుష్యరహితం  
»  ఇంటెలిజెంట్‌ డిజైన్‌  
» యంత్రంలా కంటే మనిషిలానే ఎక్కువగా పనిచేస్తుంది 
»  హైడ్రోజన్‌ పవర్‌తో నడుస్తుంది 
»  ప్రతి కాలిలోనూ హైడ్రోజన్‌ ఇంజిన్‌  
»  కొండలు, గుట్టల్లో అనువైన ప్రయాణం 
»   చిరుతపులిని పోలిన ఫ్లెక్సిబిలిటీ.. 4 పాదాలకు రబ్బరు డెక్కలు 
»    బాడీ కదలికలే హాండిల్‌బార్స్‌ 
»    రాత్రి వేళల్లో కదలికలకు గైడింగ్‌ మార్కర్స్‌ 
»    మనిషి ఆలోచన/ప్రవృత్తి, యంత్ర మేధల సమన్వయం

అనుకున్నంత తేలికేనా? 
కోర్లియో అనేది ఇప్పటికైతే ఒక భావన. అదింకా ఉనికిలో లేదు. ఒక ఉత్పత్తిగా, ఆఫ్‌–రోడ్‌ ఉపయోగం కోసం నాలుగు పెద్ద టైర్లు కలిగిన క్వాడ్‌ బైక్‌కు ఒక సమర్థవంతమైన వెర్షన్‌గా దీనిని భావించవచ్చు. ఇది మారుమూల ప్రాంతాలలో రవాణా, పర్యాటక వ్యాపారాలు, ఆర్థికంగా స్థోమత ఉన్నవారికి ఒక స్వారీ అభిరుచిగా, క్రీడలకు కూడా కొత్త అవకాశాల తలుపులు తెరుస్తుంది. అంతేకాదు, దివ్యాంగులకు సహాయక పరికరాల అభివృద్ధికి ఈ సాంకేతిక రోబో పరిజ్ఞానం తోడ్పడే అవకాశాలు ఉన్నాయి. ఇవన్నీ జరిగితే తప్పకుండా ఒక అద్భుతమే. 

అయితే ఈ పనులన్నీ చేయగల కీలుగుర్రం... కీలుగుర్రం ఆకారంలోనే నాలుగు కాళ్లతో మాత్రమే ఉండాలనేముంది అని ‘కాన్సాయ్‌ ఎక్స్‌పో 2025’కి వచ్చిన రోబోటిక్‌ నిపుణులు కొందరు సరదాగా వ్యాఖ్యానించటం విశేషం. ఇక అసలైన సవాలు ఏమిటంటే.. అడవిలో నడవడానికి, సమర్థవంతమైన లోకోమోషన్‌ అల్గారిథమ్‌లను అమలు చేయడానికి, వాహనానికి అవసరమైన భద్రతా చలన శీలతను కోర్లియోకు కలిగించటానికి ఇంకా ఎంత సమయం పడుతుందో కచ్చితంగా తెలియకపోవటం.  

Advertisement
 
Advertisement
Advertisement