కేసీఆర్‌.. నిన్ను వదిలిపెట్టం

Telangana: Bandi Sanjay Slams On CM KCR - Sakshi

గడీల పాలనను తరిమికొట్టేందుకే పాదయాత్ర

రెండో విడత ప్రజాసంగ్రామ యాత్రలో బండి సంజయ్‌

రేపటి నుంచి కేసీఆర్‌ బాగోతాలన్నీ బయటపెడతా..

బీజేపీ అధికారంలోకి వస్తే ఆలయాల్లో అధికారికంగా ఉత్సవాలు నిర్వహిస్తాం... ఉచిత నాణ్యమైన విద్య, వైద్యం అందించి తీరుతామని వెల్లడి 

గురువారం రాత్రి అలంపూర్‌లో పాదయాత్ర చేస్తున్న బండి సంజయ్‌

రెండో విడత ప్రజాసంగ్రామ యాత్రలో బండి సంజయ్‌ 

సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌: రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ కుటుంబ పాలనను తరిమికొట్టే లక్ష్యంతోనే ప్రజాసంగ్రామ యాత్ర చేపట్టామని, సీఎం కేసీఆర్‌ను వదలబోమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌ పేర్కొన్నారు. రాష్ట్రంలో గడపగడపకూ వెళ్లి ప్రజా సమస్యలను తెలుసుకుంటామని.. కేసీఆర్‌ పాలనలో పడుతున్న ఇబ్బందులను వివరించి చైతన్యవంతం చేస్తామని చెప్పారు.

గడీల పాలన తీరు, కేసీఆర్‌ బాగోతాలన్నీ బయటపెడతామన్నారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రాగానే.. హిందూ పండగలకు వెసులుబాట్లు కల్పిస్తామన్నారు. గురువారం అలంపూర్‌ జోగుళాంబ అమ్మవారిని బండి సంజయ్, ఇతర బీజేపీ నేతలు దర్శించుకున్నారు. తర్వాత హరిత హోటల్‌ వెనుక మైదానంలో బహిరంగ సభ నిర్వహించి.. రెండో విడత ప్రజాసంగ్రామ యాత్రను చేపట్టారు. సభలో బండి సంజయ్‌ ప్రసంగం ఆయన మాటల్లోనే.. 

రైతులను అరిగోస పెట్టిండు. 
‘‘వడ్లు కొనేది, పైసలిచ్చేది కేంద్రమేనని మేం ముందు నుంచే చెప్తున్నం. అయినా సీఎం కేసీఆర్‌ వడ్లు కొనబోమంటూ రైతులను అరిగోస పెట్టిండు. వరి వేస్తే ఉరే అన్నడు. మేం పోరాడినం. కేసీఆర్‌ మెడలు వంచి వడ్లు కొనేలా చేసినం. కేసీఆర్‌.. వడ్ల పేరుతో ఢిల్లీలో దొంగ దీక్ష చేసినవ్‌.. పైసల సంచులు పట్టుకుని వేరే రాష్ట్రాలకు తిరగడం కాదు.. జనంలోకి రా.. నువ్వు ప్రగతిభవన్‌లో, ఫామ్‌హౌస్‌లో ఉంటవ్‌.. నేను జనం మధ్య ఉంటా. కేసీఆర్‌ ఆ వర్గాన్ని ఈ వర్గాన్ని కాదు. అందరినీ మోసం చేసిండు. ఇకముందు కేసీఆర్‌ పతనాన్ని బ్రహ్మదేవుడు కూడా ఆపలేడు. నిన్ను, నీ పార్టీని జనం కట్టకట్టి తుంగభద్రలో పడేయడం ఖాయం.

మైనారిటీలంటే భయం.. 
కేసీఆర్‌కు మైనారిటీలంటే భయం. 15 నిమిషాలు టైమిస్తే దేశంలో హిందువులందరినీ చంపుతానన్న ఎంఐఎం నేతపై ప్రభుత్వం సాక్ష్యాధారాలను సమర్పించకపోవడం వల్లే కోర్టు కేసు కొట్టేసింది. అయినా మేం వదిలిపెట్టం. కేసులు తిరగదోడుతాం. శివాజీ మహారాజ్‌ హిందూ ద్రోహుల తలలు ఎలా నరుక్కుంటూ పోయిండో.. అలా అవినీతి, నియంత, కుటుంబ పాలనను అంతం చేసేందుకు బయలుదేరుతున్నం.

కేసీఆర్‌ హిందూ ద్రోహి. మైనార్టీ ఓట్ల కోసం హిందూ సమాజాన్ని, హిందూ దేవాలయాలను అవమానిస్తున్నడు. రంజాన్, బక్రీద్‌కు నమాజ్‌ కోసం, ఇఫ్తార్‌ కోసం ముస్లింలకు ప్రత్యేక అనుమతులిస్తూ జీవోలు జారీ చేస్తరు. మరి అయ్యప్ప, శివ, హనుమాన్‌ భక్తులు ఏం చేశారు? వారి భిక్షకు టైం ఇవ్వరు. పైగా మాల వేసుకున్నవాళ్లు డ్యూటీకి రావొద్దంటరు. మేం అధికారంలోకి వచ్చాక అయ్యప్ప, హనుమాన్, శివమాల ధరించే భక్తులకూ ప్రత్యేక జీవోలిచ్చి స్వేచ్ఛగా పూజలు, భిక్ష చేసుకునేలా వెసులుబాటు కల్పిస్తాం. అష్టాదశ శక్తి పీఠమైన జోగుళాంబ అమ్మవారి దగ్గర, ఇతర ఆలయాల్లో అధికారికంగా దసరా ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తాం. మేం ముస్లింలుసహా ఎవరికీ వ్యతిరేకంకాదు. అలా అని హిందువులపట్ల చిన్నచూపును సహించం’’ అని సంజయ్‌ పేర్కొన్నారు. 

తొలిరోజు 4 కిలోమీటర్లు.. 
పాదయాత్ర తొలిరోజు అలంపూర్‌ నుంచి 4 కిలోమీటర్లు సాగి రాత్రి 11.30కి ఇమాంపురంలో ముగిసింది. శుక్రవారం అక్కడి నుంచి బయల్దేరి.. లింగనవాయి, డి–బూడ్దిపాడు, ఉండవెల్లి, కంచుపాడు  మీదుగా 13 కిలోమీటర్లు్ల యాత్ర సాగనుంది. 

ఈ పాలన అంతం చేద్దాం: తరుణ్‌చుగ్‌ 
టీఆర్‌ఎస్‌ కుటుంబ పాలన అంతం చేద్దామ ని బీజేపీ రాష్ట్ర ఇన్‌చార్జి తరుణ్‌చుగ్‌ పిలుపునిచ్చారు. కేసీఆర్‌ బంగారు తెలంగాణ పేరుతో దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో ప్రజల గొంతుకగా మారి.. నియంత పాలనపై పోరాడుతామన్నారు. 

♦రాష్ట్రంలో బీజేపీకి పెరుగుతున్న ఆదరణను చూసి కేసీఆర్‌ ముందస్తు ఎన్నికలకు వెళ్లే ప్రయత్నం చేస్తున్నారని ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ పేర్కొన్నారు. 

♦పాలమూరు, కాళేశ్వరం ప్రాజెక్టుల పేరిట కేసీఆర్‌ మోసం చేస్తున్నారని.. ముందే ఉన్న రిజర్వాయర్లతో నీళ్లు వస్తున్నాయే తప్ప కేసీఆర్‌ చేసిందేమీ లేదని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ చెప్పారు. 

♦రాష్ట్రంలో భవిష్యత్‌ బీజేపీదేనని.. బీజేపీని అడ్డుకునే శక్తి కేసీఆర్‌ డబ్బు సంచులకు, మద్యం సీసాలకు లేదని హుజూరాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ విమర్శించారు. 

♦అన్ని వర్గాలను మోసం చేసిన సీఎం కేసీఆర్‌ను ప్రజలు క్షమించబోరని మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి మండిపడ్డారు. ∙కేసీఆర్‌ మెదడు బూజుపట్టిందని.. అందుకే ఏ సీఎం చెప్పని విధంగా రాజ్యాంగాన్ని మారుస్తానని అంటున్నారని విజయశాంతి విమర్శించారు.

ప్రతి ఒక్కరూ అంబేడ్కర్‌ను స్ఫూర్తిగా తీసుకోవాలి 
సాక్షి, హైదరాబాద్‌: రాజ్యాంగ నిర్మాత బీఆర్‌ అంబేడ్కర్‌ను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. గురువారం అంబేడ్కర్‌ జయంతిని పురస్కరించుకుని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top