కార్పొరేటర్‌గా ఫెయిల్‌.. మేయర్‌గా గెలుపు సాధ్యమా? | TDP Mayor Candidate Mukka Sravani Failure On Development | Sakshi
Sakshi News home page

కార్పొరేటర్‌గా ఫెయిల్‌.. మేయర్‌గా గెలుపు సాధ్యమా?

Oct 25 2026 8:15 AM | Updated on Oct 25 2026 8:17 AM

TDP Mayor Candidate Mukka Sravani Failure On Development

సాక్షి, విశాఖపట్నం: ఉట్టికి ఎగరలేనమ్మ స్వర్గానికి ఎగురుతానందంట...కార్పొరేటర్‌గా ఐదేళ్ల పాలనలో సొంత వార్డును అభివృద్ధి చేయలేనిది, 120 వార్డులను అభివృద్ధి చేస్తానని ఊకదంపుడు ప్రచారాలు చేస్తున్న కూటమి మేయర్‌ అభ్యర్థి ముక్కా శ్రావణి మాటలకు వార్డు ప్రజలు విస్తుపోతున్నారు. కార్పొరేటర్‌గా ఫెయిల్‌ అయిన శ్రావణి మేయర్‌గా గెలుపు ఎలా సాధ్యమని జనం గుసగుసలాడుతున్నారు. టీడీపీ ఆవిర్భావం నుంచి తన తండ్రి ముక్కా ముత్యాల నాయుడు టీడీపీలో క్రియాశీల నేతగా ఉన్నారు. ముత్యాల నాయుడు 2000లో  వార్డు కార్పొరేటర్‌గా ఎన్నికయ్యారు. 2021 ఎన్నికల్లో శ్రావణి కార్పొరేటర్‌గా ఎన్నికయ్యారు. ఉత్తర నియోజకవర్గంలో 26వ వార్డు టీడీపీకి కంచుకోటని గొప్పలు చెప్పుకునే శ్రావణి కుటుంబం గడిచిన 30 ఏళ్లల్లో వార్డులో చేసిన అభివృద్ధి కానీ, చెప్పుకోదగిన ల్యాండ్‌మార్క్‌ గాని ఎక్కడా కానరాదు. 

ఎన్నికల ప్రచారంలో తప్ప ఐదేళ్ల పాలనలో ఏనాడు ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి, పరిష్కారం చేయడానికి వార్డులో పర్యటించిన దాఖలాలు లేవనే చెప్పాలి. అంతా వార్డు అధ్యక్షుడు, శ్రావణి అన్నయ్య ముక్కా కిషోర్‌ కనుసన్నల్లోనే పాలన జరిగింది. కార్పొరేటర్‌గా గెలిచిన తర్వాత ఒక్కరోజు ప్రజల కోసం, వార్డు అభివృద్ధి కోసం సమయం కేటాయించని శ్రావణి 120 వార్డులకు మేయర్‌గా ఎలా న్యాయం చేస్తారని వార్డు ప్రజలు గుసగుసలాడుతున్నారు. కార్పొరేటర్‌గా శ్రావణి గెలిచినా ఐదేళ్లూ కుటుంబ పాలనే కొనసాగింది. ఇప్పుడు మేయర్‌ అయితే 120 వార్డులను అన్నదమ్ములకు పంచిపెట్టి అప్పగించడం తప్ప, ఏమి అనుభవం ఉందని మేయర్‌ పీఠం శ్రావణికి కట్టబెడతామని జనం ఆలోచనలో పడ్డారు. 

అభివృద్ధికి దూరంగా.. 
కార్పొరేటర్‌గా ఐదేళ్ల పదవీ కాలంలో వైఎస్సార్‌సీపీ హయాంలో తప్ప, కూటమి ప్రభుత్వం వచ్చిన దాదాపు మూడేళ్లలో వార్డులో ఎటువంటి అభివృద్ధి జరగలేదు. కనీసం గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో మొదలు పెట్టిన అభివృద్ధి పనులు, కూటమి పాలన వచ్చాక పూర్తిచేయకుండా నిర్లక్ష్యం చేశారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో రూ.16.30 లక్షల వ్యయంతో 26వ వార్డు శంఖువానిపాలెంలో పార్కును నిర్మించారు. పార్కు చుట్టూ ప్రహరీ నిర్మించి, వాకింగ్‌ ట్రాక్, సిమెంట్‌ బెంచీలు ఏర్పాటు చేశారు. ఎన్నికల కోడ్‌ రావడంతో విద్యుత్‌ దీపాలు, గ్రీనరీ పనులు నిలిచిపోయాయి. అనంతరం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా పెండింగ్‌ పనులపై దృష్టి పెట్టలేదు. మిగిలిన నిధులు ఏమయ్యాయో తెలియని పరిస్థితి. కార్పొరేటర్‌ నిర్లక్ష్యంతో పార్కు అధ్వానంగా మారి మందుబాబులకు అడ్డాగా మారింది. ప్రస్తుతం రజకులు తాళ్లు కట్టుకుని బట్టలు ఆరబెట్టుకుంటున్నారు. ఫలితంగా లక్షలాది రూపాయల ప్రజల సొమ్ము దురి్వనియోగం అయ్యిందని జనం మండిపడుతున్నారు. 


⇒ మద్దిలపాలెం కూడలి నుంచి ఎన్‌ఏడీ కూడలి వరకు హైవేకు ఆనుకొని ఉన్న గ్రీన్‌బెల్ట్‌ ప్రాంతం పార్కులు, ఆటస్థలాలుగా, వాకింగ్‌ ట్రాక్‌లుగా అభివృద్ధి జరిగింది. 26వ వార్డు పరిధిలోని అక్కయ్యపాలెం కూడలిలో గ్రీన్‌బెల్ట్‌ ప్రాంతం మాత్రం అభివృద్ధికి దూరంగా ఉండిపోయింది. జీవీఎంసీ చివరి కౌన్సిల్‌ సమావేశంలో వార్డులో గ్రీన్‌బెల్ట్‌ల అభివృద్ధికి ఫిబ్రవరి నెలలో రూ.50 లక్షలు మంజూరయ్యాయి. ఎనిమిది నెలలు గడిచినా కనీసం 20 శాతం పనులు కూడా పూర్తికాలేదు. 

⇒ టీడీపీకి కంచుకోటగా చెప్పుకునే 26వ వార్డులో ఏళ్ల తరబడి ఉన్న ప్రధానమైన చిన్నూరు సమస్య పరిష్కారంపై దృష్టి సారించలేదు. ఫలితంగా కనీస మౌలిక సదుపాయాలు లేక చిన్నూరు వాసులు సమస్యలతో సహవాసం చేస్తున్నారు. 

⇒ 26వ వార్డులో 80 అడుగుల రోడ్డు అభివృద్ధికి నోచుకోలేదు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో రోడ్డు విస్తరణ చేపట్టి రోడ్డు మధ్యలో వీధి దీపాలు ఏర్పాటు చేశారు. రోడ్డు మధ్యలో డివైడర్‌ నిర్మించాల్సి ఉన్నా అనంతరం వచ్చిన కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది.

⇒ జగ్గారావు బ్రిడ్జి వద్ద కూరగాయల బజార్‌లోని స్టాల్స్‌ రోడ్డుపైకి కనిపించేలా మార్పు చేస్తామని నాయకులు హామీ ఇచ్చినా కార్యరూపం దాల్చలేదు. 

⇒ వార్డులో అడుగడుగునా బడ్డీలతో రహదారులు కుచించుకుపోయి ట్రాఫిక్‌ ఇబ్బందులు తలెత్తుతున్నా సమస్య పరిష్కారానికి దృష్టి సారించలేదు. 

⇒ ఐదేళ్ల పాలనను అన్నదమ్ములకు వదిలేసి, మరల గెలిపిస్తే ఇవి చేస్తా, అవి చేస్తా అని కరపత్రాలు పంచుతున్నారు. 10 పడకల ఆసుపత్రి, స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్, జగ్గారావు బ్రిడ్జి వద్ద వ్యాపారుల కోసం కమర్షియల్‌ భవనం, పిల్లల ఆటవిడుపు కోసం బాక్స్‌ క్రికెట్, వాలీబాల్‌ కోర్టు, పికిల్‌ బాల్‌ కోర్టు, పెళ్లిళ్ల కోసం ఫంక్షన్‌ హాల్, యోగా సెంటర్, డిజిటల్‌ గ్రంథాలయం, శారీరక ఆరోగ్యం కోసం జిమ్, వాకింగ్‌ ట్రాక్, అర్కా ఆసుపత్రి ఎదుట కమ్యూనిటీ హాల్‌ నిర్మిస్తానని ఎన్నికల ప్రచారంలో కరపత్రాలు పంచడంపై జనం ఇవన్నీ జరిగేనా అని విస్తుపోతున్నారు. 

⇒ కార్పొరేటర్‌గా గడిచిన ఐదేళ్లలో ప్రజల సమస్యలపై గాని, వార్డు అభివృద్ధిపై గాని దృష్టి సారించని ముక్కా శ్రావణి, మేయర్‌గా గెలిచి 120 వార్డుల అభివృద్ధి తన వార్డు నుంచే జరుగుతుందని ప్రచారంలో గొప్పలు చెప్పడం పట్ల వార్డు ప్రజలు విస్తుపోతున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అయినా వార్డు అభివృద్ధిపై దృష్టి సారించి మోడల్‌ వార్డుగా తీర్చిదిద్ది ఉంటే మేయర్‌గా 120 వార్డులను అభివృద్ధి చేసేదని జనం నమ్మేవారేమో. కార్పొరేటర్‌గా ఫెయిల్‌ అయిన శ్రావణి మేయర్‌గా గెలుపు ఎలా సాధ్యమని జనం చర్చించుకుంటున్నారు.  

ఇదీ చదవండి: సిరి సహస్ర బీసీనా..!


 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement