పొలిటికల్‌ సరోగసీతో పవన్-చంద్రబాబుల సరికొత్త చరిత్ర | Sakshi
Sakshi News home page

పొలిటికల్‌ సరోగసీతో పవన్-చంద్రబాబుల సరికొత్త చరిత్ర

Published Sun, Apr 7 2024 3:01 PM

Pawan Kalyan And Chandrababu New History With Political Surrogacy - Sakshi

పొలిటికల్ సరోగసీ అనే వినూత్న ప్రక్రియతో దేశ రాజకీయ చరిత్రలోనే సరికొత్త చరిత్ర సృష్టించారు జనసేన నాయకుడు పవన్ కల్యాణ్. అద్దెకు గర్భాలు ఇవ్వగా లేనిది రాజకీయ పార్టీలు అద్దెకు ఇవ్వకూడదా అన్న ఆలోచనలోంచి ఆయన పొలిటికల్ సరోగసీకి శ్రీకారం చుట్టారు. టీడీపీ తాను మోయలేని తన అండాన్ని జనసేన గర్భంలో  ప్రవేశ పెట్టి పిల్లల్ని కనాలని చూస్తోంది. దానికి  అద్దె కింద ఎంత చెల్లిస్తున్నారన్నది బయటకు రావడం లేదు కానీ పవన్ కల్యాణ్ మాత్రం సరోగేట్ ఫాదరే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

అద్దెకు ఇళ్లు దొరకడం పాత వార్త. అద్దెకు  గర్భాలు దొరకడం కూడా కొత్తది కాదు. ప్రపంచ మంతటా అద్దె గర్భాల వ్యాపారం సజావుగా సాగిపోతోంది. ఆరోగ్య సమస్యలు కానీ ఇంకేమన్నా ఇబ్బందులు కానీ ఉన్నప్పుడు ఒక మహిళ గర్భం దాల్చే పరిస్థితులు లేక..పిల్లలు కావాలన్న కోరిక ఉంటే ఆమె అండాన్ని..ఆమె భర్త వీర్యంతో ఫలదీకరణ చెందించి ఆ అండాన్ని వేరొక మహిళ గర్భంలో ఉంచి ఆ గర్భంలో ఆ అండం పెరిగి ఆ మహిళ పిల్లల్ని కనేలా చేస్తారు.

ఇలా గర్భాన్ని అద్దెకు ఇచ్చి.. తనది కాని పిండాన్ని తన గర్భంలో పెంచి పెద్ద చేసి జన్మనిచ్చి.. ఒరిజినల్ పిండం ఓనర్ అయిన మహిళకు బిడ్డను అప్పగిస్తారు. ఇంత సేవ చేసిపెట్టినందుకు.. గర్భాన్ని   అద్దెకు ఇచ్చినందుకు అద్దె గర్భం కోరుకునే వారి స్థోమతను బట్టి కిరాయి కింద డీల్ కుదుర్చుకుంటారు. షారుక్ ఖాన్ దంపతులు ఇలానే  బిడ్డను కన్నారు. . తమిళ అందాల నటి నయనతార-విఘ్నేష్ దంపతులు కూడా ఇలానే పిల్లల్ని కనిపించుకున్నారు. ఇలా గర్భాన్ని అద్దెకు ఇవ్వడాన్ని సరోగసీ అంటారు.

ఏపీ రాజకీయాల్లో ఓ కొత్త ప్రక్రియకు శ్రీకారం చుట్టాయి ఇక్కడి రాజకీయ పార్టీలు. ఈ ప్రక్రియను పొలిటికల్ సరోగసీ అనొచ్చంటున్నారు  రాజకీయ వైద్యులు. ఈ సరికొత్త విధానానికి తలుపులు తెరవడం ద్వారా భారత రాజకీయ చరిత్రలో సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టిన ఘనత జనసేన పార్టీ నాయకుడు పవన్ కల్యాణ్ దే అంటున్నారు రాజకీయ పండితులు.

అద్దెకు గర్భాలు ఇచ్చినట్లే పవన్ కల్యాణ్‌ అద్దెకు పార్టీ ఇవ్వచ్చని నిరూపించారు. చాలా మంది తాము నివసించడానికి ఇళ్లు కట్టుకుంటారు. ఓ ఇల్లు ఉంటే అద్దెకు ఇచ్చుకోడానికి వేరే ఇళ్లు కట్టుకుంటారు. పవన్ కల్యాణ్  అద్దెకు ఇవ్వడం కోసమే 2014లో జనసేన పార్టీని నిర్మించారు. నిజానికి  ఆ పార్టీకోసం చంద్రబాబు నాయుడు ముందుగానే అడ్వాన్స్ ఇచ్చారని..ఆయనే నువ్వు పార్టీ పెట్టు నేను అద్దెకు తీసుకుంటాను అని భరోసా ఇచ్చారని కర్ణపిశాచుల భోగట్టా.

ప్రస్తుత ఎన్నికల్లో  తాను అద్దెకు తీసుకున్న జనసేనతో  పొత్తు పెట్టుకున్నారు చంద్రబాబు నాయుడు. పొత్తులో భాగంగా జనసేనకు 21 అసెంబ్లీ రెండు లోక్ సభ స్థానాలు కేటాయించారు. జనసేనకు కేటాయించిన సీట్లలోనూ 90 శాతం స్థానాల్లో  టిడిపి అభ్యర్ధులనే నిలబెట్టగలిగారు చంద్రబాబు నాయుడు. ఫలదీకరణ చెందిన అండాన్ని  సరోగసీకి సిద్ధపడే మహిళ గర్భంలో ప్రవేశ పెట్టినట్లు.. తన పార్టీ తరపున టికెట్లు ఇవ్వలేని వారిని జనసేన గర్భంలో  ప్రవేశ పెట్టి అక్కడ వారికి టికెట్లు ఇప్పించారు చంద్రబాబు నాయుడు. రేపు అందులో ఒకరో ఇద్దరో గెలిచినా వారు జనసేన ఎమ్మెల్యేలు కారు. టిడిపి  ప్రాపర్టీయే అవుతారు వారు. ఎందుకంటే అద్దె గర్భం ఇచ్చిన మహిళ బిడ్డని కన్నా ఆమె తల్లి కాలేదు. కిరాయి తల్లే అవుతుంది. ఎవరి అండాన్ని అయితే ఆమె మోసిందో ఆ అండం తాలూకు యజమానే ఆ బిడ్డకు అమ్మ అవుతుంది. సో అదే లాజిక్ రాజకీయాల్లోనూ వర్తిస్తుంది.

గర్భాన్ని అద్దె కిచ్చి బిడ్డను కన్న  మహిళను సరోగేట్ మదర్ అంటారు. ఈ లెక్కన జనసేన నాయకుడు పవన్  కల్యాణ్ ని సరోగేట్ ఫాదర్ అనొచ్చంటున్నారు పొలిటికల్ గైనకాలజిస్టులు. బిడ్డని కన్నందుకు అమెరికాలో సరోగేట్ మదర్ కి వేల డాలర్ల కిరాయి దక్కుతోంది. 30 వేల డాలర్ల నుండి 68 వేల డాలర్ల వరకు ఛార్జ్ చేస్తున్నట్లు  సమాచారం. అంటే గరిష్ఠంగా 51 లక్షల రూపాయలు అద్దె గర్భానికి చెల్లిస్తున్నారు అగ్రరాజ్యం అమెరికాలో.

జనసేన పార్టీలో టీడీపీ తరపున  పోటీ చేసే అభ్యర్ధుల సంఖ్యను బట్టి అభ్యర్ధికి ఇంత అని పేమెంట్ చేయాల్సి వస్తుందంటున్నారు ఆర్ధిక రంగ నిపుణులు. సరోగసీ అనేది ఒక్కో సారి సరోగేట్ మదర్స్ కి ప్రమాదకరం కూడా. ఏమైనా తేడా జరిగితే ప్రాణాలకు కూడా ముప్పు ఉండచ్చు. పొలిటికల్ సరోగసీలో ప్రాణహాని ఉండకపోవచ్చు కానీ.. పరువు పోవచ్చు. అయితే అది పవన్ కల్యాణ్‌కి పెద్ద సమస్య కాబోదంటున్నారు రాజకీయ పండితులు.

తాను అద్దెకు తీసుకున్న జనసేనలో ఏం జరిగినా తనకు ఎప్పటికప్పుడు సమాచారం తెలియజేసేందుకే నాదెండ్ల మనోహర్ ను జనసేనలోకి  పంపారు చంద్రబాబు. నాదెండ్లను రిమోట్‌తో నడిపిస్తూ జనసేనలో ఎవరు చేరాలి ఎవరికి తలుపులు మూసివేయాలి అన్నది చంద్రబాబే శాసిస్తూ వస్తున్నారు. 2019 ఎన్నికల్లో  అద్దె పార్టీతో కమ్యూనిస్టులను, బిఎస్పీని ముడి పెట్టి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చి మళ్లీ సిఎం కావాలనుకున్నారు చంద్రబాబు.

అయితే సరోగేట్ పార్టీ కూటమిని జనం తిరస్కరించారు. ఈ సారి కామ్రేడ్ల స్థానంలో తానే పొత్తు పెట్టుకున్నారు చంద్రబాబు. అయితే ఈ సారి కూడా ఒరిగేదేమీ ఉండదని సర్వేలు చెబుతున్నాయి. ఈ ఎన్నికల్లోనూ సత్తా చాటలేకపోతే వచ్చే ఎన్నికల వరకు జనసేనకు చంద్రబాబు అద్దె చెల్లిస్తారా లేక ఆ పార్టీని ఇక అద్దెకు తీసుకోవలసిన అవసరం లేదనుకుంటారా అన్నది చూడాలి. అపుడు ఏ బిజెపియో  జనసేనను కిరాయికి తీసుకునే అవకాశాలు ఉండచ్చేమో అంటున్నారు. సో సరోగేట్ ఫాదర్ భవిష్యత్తు జూన్ 4న తేలిపోతుందని అంచనా వేస్తున్నారు.
-సి.ఎన్.ఎస్.యాజులు, సీనియర్ జర్నలిస్ట్
 

ఇదీ చదవండి: పాపం జన సైనికులు.. సినిమా ట్విస్ట్‌ ఇచ్చిన పవన్‌!

Advertisement
Advertisement