వలస కార్మికుల విషాదాంతం | Sakshi
Sakshi News home page

వలస కార్మికుల విషాదాంతం

Published Thu, May 9 2024 10:30 AM

వలస కార్మికుల విషాదాంతం

నాలాలో పడి ఇద్దరు మృతి

వరద ఉధృతికి కొట్టుకువచ్చిన మృతదేహాలు

బేగంపేట ఓల్డ్‌కస్టమ్స్‌ బస్తీ వద్ద నాలాలో వెలికితీత..

రైలు పట్టాలు దాటుతూ నాలాలో పడి ఉంటారని అనుమానం

సనత్‌నగర్‌: పొట్టకూటి కోసం ఒడిశా నుంచి నగరానికి వలస వచ్చిన ఇద్దరు కార్మికులు ప్రమాదవశాత్తు నాలాలో పడి మృతి చెందడం స్థానికంగా విషాదం నింపింది. మంగళవారం రాత్రి కుండపోతగా కురిసిన వర్షానికి అమీర్‌పేట నుంచి బేగంపేట వైపు వచ్చే నాలాలో వరదనీరు చేరి ఉధృతంగా ప్రవహించగా..ఇరువురు కార్మికులు కొట్టుకువచ్చినట్లు తెలుస్తోంది. బుధవారం తెల్లవారుజామున వరద తీవ్రత తగ్గడంతో బేగంపేట ఓల్డ్‌ కస్టమ్స్‌ బస్తీ వద్ద నాలాలో వీరి మృతదేహాలు బయటపడ్డాయి. బేగంపేట పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగిన ఈ సంఘటన వివరాలు పోలీసులు తెలిపిన ప్రకారం ఇలా ఉన్నాయి. ఒడిశా రాష్ట్రానికి చెందిన చంద్రపాండా (38), మనోజ్‌దాస్‌ (45) బతుకుదెరువు కోసం నగరానికి వలస వచ్చారు. వివిధ చోట్ల తిరుగుతూ దొరికిన కూలి పనులను చేస్తుంటారు. ఈ క్రమంలో నెల రోజుల క్రితం వీరు బేగంపేట ఓల్డ్‌కస్టమ్స్‌ బస్తీలో ఉండే తమ సహచరుడి గదిలోకి మకాం మార్చారు. ముగ్గురూ అమీర్‌పేటలోని ఓ హోటల్‌లో కార్మికులుగా పనిచేస్తూ పొట్టపోసుకుంటున్నారు. రోజుమాదిరిగా మంగళవారం సాయంత్రం విధులు ముగించుకున్న ముగ్గురు స్నేహితులు..గ్రీన్స్‌ల్యాండ్స్‌ సమీపంలో ఉన్న ఓ బార్‌కు వెళ్లారు. ముగ్గురూ కలిసి మద్యం తాగారు. అయితే ఒకవైపు భారీ వర్షం కురుస్తుండడంతో భోజనం పార్శిల్‌ తీసుకువెళ్ళాల్సిందిగా తోటి స్నేహితులు పురమాయించడంతో ప్రభాకర్‌ అక్కడి నుంచి వెళ్లి పోయాడు. భోజనం తీసుకుని ఇంటికి వెళ్ళిన ప్రభాకర్‌ రాత్రి పొద్దుపోయేవరకు రూమ్‌మేట్స్‌ కోసం వేచి చూసి నిద్రపోయాడు. ఇదిలా ఉండగా బుధవారం తెల్లవారుజామున చంద్రపాండా, మనోజ్‌దాస్‌ల మృతదేహాలు కొట్టుకురావడాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా హుటాహుటిన అక్కడికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను నాలాలో నుంచి బయటకు తీయించారు. పోస్టుమార్టం నిమిత్తం గాంధీ మార్చురీకి తరలించారు.

రైలు పట్టాల వద్దనే నాలాలో పడ్డారా..?

అమీర్‌పేట లీలానగర్‌ నుంచి రైలు పట్టాల కిందుగా నాలా బేగంపేట వైపు సాగుతోంది. పాదచారులు పట్టాలను నేరుగా దాటకుండా ఓల్డ్‌కస్టమ్స్‌ బస్తీ వద్ద రైల్వే అండర్‌ బ్రిడ్జి ఉంది. అయితే భారీ వర్షంతో మంగళవారం రాత్రి నీరు భారీగా వచ్చి చేరింది. మద్యం సేవించి ఇంటికి పయనయమైన చంద్రపాండా, మనోజ్‌దాస్‌లు రైల్వే అండర్‌ బ్రిడ్జి వద్ద వరదనీటిని చూసి రైలు పట్టాల పైనుంచి వెళ్ళే ప్రయత్నం చేశారు. పట్టాల కింద నుంచి నాలా వెళ్తుండగా వీరు పట్టాలు దాటే క్రమంలో ప్రమాదవశాత్తూ జారి నాలాలో పడి కొట్టుకువచ్చినట్లుగా భావిస్తున్నారు. ఈ మేరకు మనోజ్‌దాస్‌ సోదరుడు సుక్రదాస్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.

Advertisement
Advertisement