తెలంగాణ కల్చరల్ సొసైటీ సింగపూర్(TCSS) ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలు స్థానిక Our Tampinesలో అక్టోబర్ 17, శనివారం రోజున అత్యంత కోలాహలంగా కన్నుల పండుగగా జరిగాయి. ప్రతి ఏడాది TCSS బతుకమ్మ వేడుకలను సెంబవాంగ్ పార్క్‌లో నిర్వహించడం జరిగేది. ఈసారి వేదికను Our Tampines Hubకు మార్చడం జరిగింది. Our Tampines Hubలోని సౌకర్యాలు, ముఖ్యంగా భారీ LED స్క్రీన్, రిబ్బన్ LEDలు బతుకమ్మ వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
కొత్త వేదిక పట్ల అందరూ ఎంతో ప్రశంసలు కురిపించారు. బతుకమ్మ వేడుకలు అంగరంగ వైభవంగా ఘనంగా జరిగాయి. ప్రత్యేక బతుకమ్మ సాంప్రదాయ పాటలతో చిన్న పెద్ద తేడా లేకుండా అందరు ఆటపాటలతో ఎంతో హుషారుగా ఈ వేడుకలు అంబరాన్నంటాయి.
తెలంగాణ మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు గారు బతుకమ్మ వేడుకలను నిర్వహించినందుకు తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) – TCSSను భారీ LED స్క్రీన్ పై వీడియో సందేశం ద్వారా అభినందించారు. అలాగే తెలంగాణ, తెలుగు ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సంబరాల్లో సింగపూర్ స్థానికులతో పాటు ఎంతో మంది అతిథులు, ఎన్నారైలు సుమారు సుమారు రెండు వేలమందికి పైగా పాల్గొని బతుకమ్మ ఆడారు. ఈ వేడుకలలో పాల్గొన్న రిటైర్డ్ ఇండియన్ ఆర్మీ మేజర్ ఎస్.పి.ఎస్. ఒబెరాయ్, మృత్యుంజయ్ శ్రీకాంతన్, ప్రథమ కార్యదర్శి (వాణిజ్యం) – భారత హైకమిషన్ గారికి TCSS సొసైటీ అధ్యక్షులు నల్ల భాస్కర్ గుప్త, ప్రధాన కార్యదర్శి బొందుగుల రాము, కోశాధికారి శశిధర్ రెడ్డి ఎర్రమరెడ్డి, కమిటీ సభ్యులు శాలువా కప్పి సత్కరించి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసారు.
ఈ సంబరాలు విజయవంతంగా జరుగుటకు సహాయ సహకారాలు అందించిన దాతలకు పేరు పేరున ప్రతి ఒక్కరికి టీసీఎస్‌ఎస్ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేస్తు ప్లాటినం, గోల్డ్, సిల్వర్, బ్రాన్జ్, బ్రాస్ కేటగిరీ కార్పొరేట్ వ్యక్తిగత దాతలను శాలువాలతో సన్మానించుకోవడం సంతోషంగా ఉందని అన్నారు.
గతేడాది పొలిస్తే ఈ ఏడాది ఆడపడుచులు బతుకమ్మలని పోటా పోటీగా చాలా అందంగా అలంకరించి వివిధ రూపాలలో 150 కి పైగా బతుకమ్మలని పేర్చి తీసుకొచ్చారు. వాటిలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన 10 బతుకమ్మలకు మరియు ప్రత్యేక సాంప్రదాయ ఉత్తమ వస్త్రధారణలో ముస్తాబైన ఐదుగురు ఆడపడుచులకు, ప్రతిరోజు బతుకమ్మ పేర్చిన పిల్లలకి TCSS సొసైటీ (నగదు వోచర్లు), భీమా జ్యువెలర్స్ (బంగారు వస్తువులు), సౌజన్య డెకార్స్ (వెండి వస్తువులు), BSK కలెక్షన్స్ (సారీస్), ఎస్ ఎస్ క్రియేషన్స్ (సారీస్) వారు ప్రత్యేక బహుమతులు అందజేశారు.
ప్రతి ఏడాది లాగే ఈసారి కూడా విడుదల చేసిన TCSS బతుకమ్మ పాట "జాజిరి జాజిరి ఉయ్యాలా మా పూల పండుగ జంపాల" యూట్యూట్‌లో విడుదల చేసినప్పటి నుంచి వేల వీక్షణాలతో దూసుకుపోతుందని తెలిపారు. అలాగే ఈ వేడుకల్లో TCSS ప్రత్యేకంగా తయారు చేయించిన ఫోటోబూత్ కృత్రిమ బతుకమ్మలు ఆకర్షణగ నిలిచాయి.
ఈ పండుగను నిర్వహించడానికి సింగపూర్‌లోని బూన్ లే, జూరాంగ్ ఈస్ట్, బుకిత్ పంజాంగ్, సెంగ్ కాంగ్, పుంగ్గోల్, జలాన్ పపన్, పెంజురు ప్రాంతాల నచిడి బస్సులను నామ మాత్రపు రుసుముతో సమకూర్చి పండుగను విజయవంతగా నిర్వహించడం జరిగింది. ఈ వేడుకలను సొసైటీ ఫేస్ బుక్, యూట్యూబ్ లో ప్రత్యక్ష ప్రసారం చేశారు కూడా.
ఇదీ చదవండి: దృష్టి కోసం సంగీత, నృత్య మహోత్సవం


