జల జగడాలేనా! | Sakshi
Sakshi News home page

జల జగడాలేనా!

Published Tue, Mar 26 2024 1:45 AM

నీరు లేక వెలవెలబోతున్న శ్రీరాంసాగర్‌ ప్రాజెక్ట్‌ - Sakshi

మిగిలింది 5.5 టీఎంసీలే..

ప్రస్తుతం ప్రాజెక్ట్‌లో 17.5 టీఎంసీల నీరు నిల్వ ఉంది. అందులో తాగు నీరు, డెడ్‌స్టోరేజీ, ఆవిరి అన్ని కలుపుకుని 12 టీఎంసీల నీటిని నిల్వ ఉంచుతామని ప్రాజెక్ట్‌ అధికారులు తేల్చి చెప్పారు. అవి పోగా మిగిలేది 5.5 టీఎంసీలు మాత్రమే. ప్రస్తుతం కాకతీయ కాలువ ద్వారా నిత్యం 7500 క్యూసెక్కులు జోన్‌–2కు వదులుతున్నారు. అన్ని కాలువలు, లిఫ్ట్‌లు కలుపుకుని రోజు 0.8 టీఎంసీల నీరుఖాళీ అవుతోంది. వారం రోజులు నీటి విడుదల కొనసాగితే 5.6 టీఎంసీల నీరు అయిపోతుంది. ఏప్రిల్‌ మధ్య వరకు పంటలు చేతికి వచ్చే అవకాశం లేదు. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.

బాల్కొండ: శ్రీరాంసాగర్‌ ప్రాజెక్ట్‌ ఆయకట్టు పరిధిలో ఈ సీజన్‌లో రైతుల మధ్య నీటి కోసం గొడవలు తప్పేలా కనిపించడం లేదు. ప్రాజెక్ట్‌లో నీరు లేకపోవడం, పంటలు ఇంకా చేతికి అందకపోవడంతో రైతుల మధ్య వివాదాలు తలెత్తే అవకాశం ఉంది. సోమవారం వరద కాలువలో నిల్వ ఉంచిన నీటిని దిగువకు తరలించడానికి కమ్మర్‌పల్లి మండలం ఉప్లూర్‌ వద్ద క్రాస్‌ రెగ్యులేటరీ గేట్లను ఎత్తడానికి అధికారులు యత్నించగా రైతులు అడ్డుకున్నారు. ఉన్న నీరు దిగువకు వెళ్తే తమ పరిస్థితి ఏంటాని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రాజెక్ట్‌ నీరు బోటాబోటిగా ఉండటంతో ఇలా నీటి కోసం వివాదాలు జరిగే అవకాశం ఉంది. వరద కాలువలో నీటి నిల్వ అవసరం గురించి తెలిసి కూడా అధికారులు గుట్టు చప్పుడు కాకుండా వరద కాలువ ద్వారా నీటిని తరలించారు. ఆ నీటిని కాకతీయ కాలువకు మళ్లీస్తున్నామంటూ చెప్పారు. ప్రస్తుతం నీటిమట్టం తగ్గడంతో వరద కాలువ ద్వారా నీటి విడుదల చేపట్టే అవకాశం లేదు. కాలువలో నీరు లేకపోవడంతో పంటలను కాపాడుకోడానికి రైతులు తంటాలు పడుతున్నారు. ఉన్న నీరు దిగవకు పోతే తమకు మళ్లీ విడుదల చేసే అవకాశం లేకపోవడంతో ఉప్లూర్‌ రైతులు అడ్డుకున్నారు.

నీటిని మళ్లించుకుంటున్న రైతులు

కాకతీయ కాలువ ద్వారా ప్రస్తుత సీజన్‌లో రెండు జోన్లుగా విభజించి వారబందీ ప్రకారం నీటి విడుదల చేపడుతున్నారు. జోన్‌–1లో కాకతీయ కాలువ డీ–53 వరకు, జోన్‌–2 లో డీ–54 నుంచి ఎల్‌ఎండీ వరకు ఉన్నాయి. జోన్‌–1కు నీటి విడుదల ఆదివారంతో ముగిసింది. ప్రస్తుతం జోన్‌–2కు చివరి తడి అందిస్తున్నారు. దీంతో జోన్‌–1 పరిధిలోని ఉప కాలువల తూంలను మూసి వేయాలి. కానీ జోన్‌–1లో ఇంకా పంటలు పచ్చదనంతో ఉన్నాయి. అవి చేతికి రావడానికి మరో 15 రోజులు పడుతుందని రైతులు అంటున్నారు. ప్రస్తుతం జలాశయంలో ఉన్న నీటి మట్టం ప్రకారం మళ్లీ సరఫరా చేపట్టకపోవచ్చని ప్రాజెక్ట్‌ అధికారులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పంటలను కాపాడుకోవడానికి జోన్‌–1 రైతులు జోన్‌–2కు వెళ్తున్న నీటిని మళ్లించుకుంటున్నారు. దీంతో జోన్‌–2 పరిధిలోని రైతుల పంటలకు చివరి వరకు నీరు అందే పరిస్థితి లేదు. ఇలా రైతుల మధ్య వివాదాలు తలెత్తే అవకాశం ఉంది. లక్ష్మి కాలువ హెడ్‌ రెగ్యులేటర్‌ ఎత్తిపోయే ప్రమాదం ఉందని తెలిసి కూడా ఇప్పటికీ లిఫ్ట్‌ ట్రయల్‌ రన్‌ చేపట్టలేదు. పూర్తిగా ఎత్తిపోయిన తర్వాత లిఫ్ట్‌ మొరాయిస్తే ఎలా అని రైతులు ప్రశ్నిస్తున్నారు.

శ్రీరాంసాగర్‌ ప్రాజెక్ట్‌లో తగ్గిన

నీటిమట్టం

కాకతీయ కాలువ జోన్‌–1కు ముగిసిన

నీటి విడుదల

ఇంకా చేతికందని పంటలు

నీటి కోసం రైతుల మధ్య

గొడవలు జరిగే అవకాశం

Advertisement

తప్పక చదవండి

Advertisement