టీ20 ప్రపంచకప్-2021 తర్వాత విరాట్ కోహ్లి పొట్టి ఫార్మాట్లో టీమిండియా పగ్గాలు వదిలేయడంతో రోహిత్ శర్మ అతడి స్థానంలో సారథిగా బాధ్యతలు చేపట్టాడు. ఆ తర్వాత అనూహ్య రీతిలో కోహ్లి వన్డే కెప్టెన్సీ కోల్పోవడం, అర్ధంతరంగా టెస్టు సారథ్యానికి కూడా గుడ్‌బై చెప్పడంతో.. మూడు ఫార్మాట్లకు హిట్‌మ్యానే నాయకుడిగా ఎంపికయ్యాడు.
ద్వైపాక్షిక సిరీస్‌లలో సత్తా చాటడమే గాకుండా.. ఏకకాలంలో టీ20, వన్డే, టెస్టుల్లో భారత జట్టును అగ్రస్థానంలో నిలిపాడు రోహిత్ శర్మ. అతడి కెప్టెన్సీలో టీమిండియా ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్, వన్డే వరల్డ్‌కప్-2023 ఫైనల్ చేరింది.
కానీ ఆఖరి గండాన్ని దాటలేక చేతులెత్తి రన్నరప్‌గా మిగిలిపోయింది. అయితే, టీ20 ప్రపంచకప్-2024 రూపంలో ఆ అపఖ్యాతిని చెరిపివేసుకునేందుకు రోహిత్ శర్మకు మరో అవకాశం వచ్చింది. ఈ టోర్నీలో ఏకంగా తొమ్మిదోసారి ఆడబోతున్న రోహిత్.. ఈసారి కెప్టెన్ హోదాలో బరిలోకి దిగబోతున్నాడు.
కాగా 37 ఏళ్ల రోహిత్ శర్మకు ఇదే ఆఖరి టీ20 ప్రపంచకప్ కాబోతుందన్న వార్తల నేపథ్యంలో కప్పు గెలిస్తే మాత్రం అతడి కెరీర్‌లో చిరస్మరణీయ విజయంగా నిలిచిపోతుంది.
ఇదిలా ఉంటే.. తన కెరీర్‌లో ఇంత దూరం వస్తానని.. టీమిండియా కెప్టెన్ స్థాయికి ఎదుగుతానని అస్సలు ఊహించలేదనంటున్నాడు రోహిత్ శర్మ. ఇది తనకు దక్కిన గొప్ప అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపాడు.
దుబాయ్ ఐ 103.8 యూట్యూబ్ చానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చిన క్రమంలో.. ‘‘విరాట్ లాంటి వ్యక్తి స్థానంలో టీమిండియా కెప్టెన్సీ పగ్గాలు చేపట్టడం అంటే మామూలు విషయం కాదు. అదొక అతిపెద్ద బాధ్యత. మీరెలా ఫీలయ్యారు’’ అనే ప్రశ్న ఎదురైంది.
ఇందుకు బదులిస్తూ.. ‘‘జాతీయ జట్టుకు కెప్టెన్‌గా పనిచేయడం కంటే గొప్ప గౌరవం మరొకటి ఉండదు. అయినా.. నా జీవితంలో అలాంటి ఒకరోజు వస్తుందని ఊహించలేదు.
మంచి వాళ్లకు మంచి జరుగుతుందని అందరూ అంటూ ఉంటారు. అయితే, ఇది మాత్రం నాకు దక్కిన అదృష్టం. భారత క్రికెట్ మీద గత కెప్టెన్లు ఎలాంటి ప్రభావం చూపారో నాకు తెలుసు. వారి వారసత్వాన్ని నిలబెడుతూ సరైన దిశలో జట్టును ముందుకు నడిపించడమే నా పని’’ అని రోహిత్ శర్మ పేర్కొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment