ఎవరీ నేహా బోరా? దేశవ్యాప్తంగా వైరల్‌.. | Who is Neha Bora Know about the education family background | Sakshi
Sakshi News home page

ఎవరీ నేహా బోరా? దేశవ్యాప్తంగా వైరల్‌..

Oct 13 2026 3:19 PM | Updated on Oct 13 2026 3:43 PM

Who is Neha Bora Know about the education family background

ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌) ప్రక్రియలో ఓటర్ల పేర్లను తొలగించారనే ఆరోపణలపై ఢిల్లీలో జరుగుతున్న నిరసనల్లో అఖిల భారత విద్యార్థి సంఘం జాతీయ అధ్యక్షురాలు నేహా బోరా కీలకంగా మారారు. జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయంలో పరిశోధన చేస్తున్న ఆమె.. విద్యార్థి ఉద్యమాల్లోనూ చురుగ్గా పాల్గొన్నారు. ప్రధాన ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తూ జరుగుతున్న ‘జంతర్‌ మంతర్‌ 2.0’ ఆందోళనల్లో ఆమె పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.

ఎవరీ నేహా బోరా?
నేహా బోరా వయసు 29 ఏళ్లు. ఆమె భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు–లెనినిస్టు) లిబరేషన్‌కు అనుబంధంగా ఉన్న అఖిల భారత విద్యార్థి సంఘం జాతీయ అధ్యక్షురాలిగా ఉన్నారు. ఈ ఏడాది జులైలో అప్పటి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తూ సామాజిక ఉద్యమకారుడు సోనమ్‌ వాంగ్‌చుక్‌, ఇతరులతో కలిసి 23 రోజుల పాటు నిరాహార దీక్ష చేపట్టడంతో ఆమె వార్తల్లో నిలిచారు.

విద్యాభ్యాసం, కుటుంబ నేపథ్యం
నేహా బోరా ఢిల్లీ విశ్వవిద్యాలయం నుంచి బ్యాచిలర్‌ డిగ్రీ, అంబేడ్కర్‌ విశ్వవిద్యాలయం నుంచి మాస్టర్స్‌ డిగ్రీ పూర్తి చేశారు. ప్రస్తుతం జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయంలోని కళలు, సౌందర్యశాస్త్ర విభాగంలో పీహెచ్‌డీ పరిశోధకురాలిగా కొనసాగుతున్నారు. ఉత్తరాఖండ్‌లోని ఖతిమాలో నేహా బోరా జన్మించారు. ఆమె తండ్రి భారత సైన్యంలో పనిచేశారు. తల్లి గృహిణి. తన కుటుంబం భారతీయ జనతా పార్టీకి గట్టి మద్దతుదారుగా ఉంటుందని నేహా పలు ఇంటర్వ్యూల్లో వెల్లడించారు. తన రాజకీయ భావజాలం కుటుంబ సభ్యుల అభిప్రాయాలకు భిన్నంగా ఉండటంతో ఇంట్లో సిద్ధాంతపరమైన విభేదాలు ఏర్పడ్డాయని ఆమె పేర్కొన్నారు.

విద్యార్థి ఉద్యమాల నుంచి నిరసనల వరకు
ఢిల్లీ విశ్వవిద్యాలయంలో అండర్‌గ్రాడ్యుయేట్‌ చదువుతున్న సమయంలో ‘సంగ్వారీ’ అనే వీధి నాటకాల బృందంతో కలిసి పనిచేయడం ద్వారా తన సామాజిక ఉద్యమ ప్రస్థానం ప్రారంభమైందని నేహా తెలిపారు. 2019-2020లో పౌరసత్వ సవరణ చట్టానికి (సీఏఏ) వ్యతిరేకంగా జరిగిన విద్యార్థుల నిరసనల్లోనూ చురుగ్గా పాల్గొన్నట్లు చెప్పారు.

జంతర్‌ మంతర్‌ 2.0లో కీలక పాత్ర
నిరసనల్లో నేహా పాత్రను అఖిల భారత విద్యార్థి సంఘం నాయకులతో పాటు ఇతర ఉద్యమకారులు కూడా గుర్తించారు. సామాజిక ఉద్యమకారుడు యోగేంద్ర యాదవ్‌ కూడా నేహాను ప్రశంసించారు. యోగేంద్ర యాదవ్‌, ప్రశాంత్‌ భూషణ్‌, కపిల్‌ సిబల్‌ను తమకు ఆదర్శంగా పేర్కొన్న నేహా.. వారి వయసుకు చేరుకున్నప్పుడు తామూ అంతే ధైర్యంగా, పట్టుదలగా ఉండాలని ఆశిస్తున్నట్లు తెలిపారు. దీనిపై యాదవ్‌ స్పందిస్తూ.. తన వయసులో ఉన్నప్పుడు నేహా ప్రదర్శించినంత ధైర్యం, దృఢ సంకల్పం తనకు లేవని, ఆమెతో కలిసి నడవడం తనకు బలాన్ని, ఆశను ఇస్తోందని పేర్కొన్నారు.

శనివారం ఢిల్లీలో కాక్రోచ్‌ జనతా పార్టీ నేతలను విమానాశ్రయంలోనే పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో పాటు మద్దతుదారులు జంతర్‌ మంతర్‌కు చేరుకోకుండా ఆంక్షలు విధించారు. దీంతో నేహా బోరా దక్షిణ ఢిల్లీలోని ఐఎన్‌ఏ ప్రాంతంలో ఉన్న ఢిల్లీ హాట్‌ను కొత్త నిరసన స్థలంగా ప్రకటించారు. పోలీసులు ఆమెతో పాటు ఇతర ఉద్యమకారులను కూడా అదుపులోకి తీసుకున్నారు. ఓటర్ల పేర్ల తొలగింపు ఆరోపణలు, ప్రధాన ఎన్నికల కమిషనర్‌ రాజీనామా డిమాండ్‌తో కొనసాగుతున్న ఈ ఆందోళనల్లో నేహా బోరా పాత్ర ఎలా మారుతుందన్నది, నిరసనలకు మరింత మద్దతు లభిస్తుందా అన్నది తదుపరి పరిణామాల్లో కీలకం కానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement