మహిళా భద్రతపై భరోసా కల్పించాల్సిన ఓ మహిళా మంత్రి.. తన భర్త నుంచే ప్రాణహాని ఉందంటూ కన్నీటిపర్యంతమయ్యారు. తనను హత్య చేసేందుకు కుట్ర పన్నారని, కులం పేరుతో దూషిస్తూ వేధించారంటూ పోలీసులను ఆశ్రయించారు. అంతేకాదు.. తన భర్తకు గతంలోనే పెళ్లయినా ఆ విషయాన్ని దాచిపెట్టి తనను వివాహం చేసుకున్నారని ఆరోపించారు. సోషల్ మీడియాలో ఆమె ఒక వీడియోను పోస్ట్ చేశారు. అందులో భర్త వేధింపులను వివరిస్తూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆ వీడియో పోస్ట్ చేసిన కొద్ది గంటలకే ఆమె ఆస్పత్రిలో చేరడం కలకలం రేపుతోంది.
తన ప్రభుత్వ నివాసంలో సిబ్బంది ఎదుట తన భర్త కులం పేరుతో అవమానకరమైన పదజాలంతో దూషించారని రేఖా ఆర్య ఆరోపించారు. కొన్ని కంపెనీల డైరెక్టర్ పదవి నుంచి తనను తొలగించినట్లు చూపించేందుకు తన సంతకాన్ని ఫోర్జరీ చేసి నకిలీ పత్రాలు సృష్టించారని కూడా ఆమె ఆరోపించారు. రేఖా ఆర్య.. రెండు ఆడియో క్లిప్లను కూడా విడుదల చేశారు. అందులో తన భర్త ఓ మహిళతో మాట్లాడుతూ తనను హత్య చేసేందుకు కుట్ర పన్నుతున్నట్లు వినిపిస్తోందని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు.
అల్మోరా జిల్లాలోని సోమేశ్వర్ నియోజకవర్గం నుంచి బీజేపీ ఎమ్మెల్యేగా ఎన్నికైన రేఖా ఆర్య.. మంత్రిగా కొనసాగుతున్నారు. వివాహ సమయంలో తాను అవివాహితుడినని సాహు చెప్పారని రేఖా ఆర్య తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే.. కొన్నేళ్ల తర్వాత ఆయనకు అప్పటికే వివాహమైందని.. ఆ వివాహం ద్వారా పిల్లలు కూడా ఉన్నారని తెలిసిందన్నారు. అప్పటికే తనకూ పిల్లలు ఉన్నారని, కుటుంబ సభ్యుల సలహా మేరకు.. పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఈ విషయంపై మౌనంగా ఉన్నానని తెలిపారు.
ఇటీవల తన భర్త ప్రవర్తనలో మార్పు వచ్చిందని.. ఇతర మహిళలతో ఆయనకు అక్రమ సంబంధాలు ఉన్నట్లు తెలిసిందని రేఖా ఆర్య అన్నారు. తాను అభ్యంతరం చెప్పినప్పుడు మొదట తన తప్పును అంగీకరించి.. క్షమాపణ చెప్పారని, కానీ ఆ తర్వాత కూడా తన ప్రవర్తనను మార్చుకోలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ సంబంధాలను వ్యతిరేకించినప్పుడు తనపై దాడి చేయడంతో పాటు చంపేస్తానని బెదిరించారంటూ ఆమె ఫిర్యాదు చేశారు. తన సంతకాన్ని ఫోర్జరీ చేసి, నకిలీ పత్రాల సాయంతో సంబంధిత కంపెనీల డైరెక్టర్ పదవి నుంచి తాను తొలగించబడినట్లు చూపించారని కూడా రేఖా ఆర్య ఆరోపించారు. తాను అలాంటి పత్రాలపై సంతకం చేయలేదని.. రాజీనామా కూడా సమర్పించలేదని ఫిర్యాదులో స్పష్టం చేశారు.
తన వీడియోలో రేఖా ఆర్య మాట్లాడుతూ.. ఆడియో రికార్డింగ్ తనను తీవ్రంగా కలచివేసిందని.. తన బంధంపై ప్రశ్నలు తలెత్తేలా చేసిందని అన్నారు. నిజాయతీగా, నిబద్ధతతో జీవించినందుకు దక్కే ఫలితం ఇదేనా? అంటూ ఆమె ప్రశ్నించారు. ఇంతటి బాధలోనూ నా బాధ్యతను నేను మర్చిపోలేదు.. ఇకపై చెప్పడానికి నా దగ్గర మాటలు లేవంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై కాంగ్రెస్ పార్టీ స్పందిస్తూ.. బీజేపీ ప్రభుత్వానికి ఇది తీవ్ర అవమానం అంటూ వ్యాఖ్యానించింది. ఒక రాష్ట్ర మంత్రి స్వయంగా తన భర్త నుంచి తన ప్రాణాలకు ముప్పు ఉందని చెబుతూ.. ఆయనపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే.. అది ప్రభుత్వానికి సిగ్గుచేట్టు అంటూ కాంగ్రెస్ అధికార ప్రతినిధి గరిమా మెహ్రా దసౌని అన్నారు.
उत्तराखंड की कैबिनेट मंत्री रेखा आर्य का एक वीडियो सोशल मीडिया पर वायरल हो रहा है,जिसमें वह रोते हुए अपनी पीड़ा जाहिर कर रही हैं। मामला उनके फैमिली से जुड़ा है, उन्होंने अपने पति के खिलाफ कैण्ट थाने में fir कराई है,उन्होंने अपने पति से अपनी और बच्चों की जान को खतरा बताया है। https://t.co/yRNhmAL2Qm
— Naseem Ahmad (@NaseemNdtv) October 15, 2026
ఇదీ చదవండి: Viral Video: మహిళా అధికారిణిపై రెచ్చిపోయిన ఐఏఎస్


