Presidential Elections 2022: రాష్ట్రపతి భవన్‌ వైపు ముర్ము అడుగులు | Presidential Elections 2022: Droupadi Murmu steps towards Rashtrapati Bhavan | Sakshi
Sakshi News home page

Presidential Elections 2022: రాష్ట్రపతి భవన్‌ వైపు ముర్ము అడుగులు

Published Sun, Jul 17 2022 4:25 AM | Last Updated on Sun, Jul 17 2022 8:46 AM

Presidential Elections 2022: Droupadi Murmu steps towards Rashtrapati Bhavan - Sakshi

దేశ ప్రథమ పౌరుడు, జాతి సమైక్యతకు, సమగ్రతలకు ప్రతీకగా నిలిచే రాష్ట్రపతి ఎన్నికకు సర్వం సిద్ధమైంది. దేశానికి 16వ రాష్ట్రపతి ఎన్నుకోవడానికి జూలై 18న ఓటింగ్‌ జరగనుంది. ప్రస్తుత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ పదవీకాలం జూలై 24తో ముగిసిపోతుంది. రాష్ట్రపతి ఎన్నికలకి ముందు అధికార, ప్రతిపక్షాల మధ్య హోరాహోరి పోరు ఉన్నప్పటికీ ఎన్డీయే.. ఆదివాసీ మహిళ ద్రౌపది ముర్ము అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయడంతో పరిస్థితులు మారిపోయాయి.

ప్రాంతీయ పార్టీల్లో అత్యధికులు ముర్ముకే జై కొట్టడంతో ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థి యశ్వంత్‌ సిన్హాతో పోరు ఏకపక్షంగా సాగుతుందన్న అంచనాలున్నాయి. ద్రౌపది వెంట 44 పార్టీలు ఉంటే, సిన్హాకు మద్దతుగా 34 పార్టీలున్నాయి. బీజేడీ, వైఎస్సార్‌సీపీలతో పాటు శివసేన, జేఎంఎం, టీడీపీ, అన్నాడీఎంకే, బీఎస్పీ వంటి పార్టీలు ద్రౌపదికి మద్దతు ప్రకటించాయి. దీంతో ఒక ఆదివాసీ మహిళ దేశ అత్యున్నత పీఠంపైకెక్కడం లాంఛనమనే చెప్పాలి. ముర్ము గెలిస్తే దేశానికి రెండో మహిళ రాష్ట్రపతి అవుతారు.  

ఎన్నిక ప్రక్రియ..
పార్లమెంటు ఉభయ సభల సభ్యులు, అన్ని రాష్ట్రాల అసెంబ్లీ సభ్యులు రాష్ట్రపతిని ఎన్నుకుంటారు. రాజ్యసభకు నామినేట్‌ అయిన ఎంపీలు, ఎమ్మెల్సీలకు ఓటింగ్‌లో పాల్గొనే అర్హత లేదు. ఓటింగ్‌ రహస్య పద్ధతిలో జరుగుతుంది. దీంతో క్రాస్‌ ఓటింగ్‌కు అవకాశాలుంటాయి. ఎంపీలకు ఆకుపచ్చ రంగు బ్యాలెట్, ఎమ్మెల్యేలకు గులాబీ రంగు బ్యాలెట్‌ పత్రాలను ఇవ్వనున్నారు. బ్యాలెట్‌ పత్రాల్లో రెండు కాలమ్‌లు ఉంటాయి. అవే అభ్యర్థి పేరు, ఆర్డర్‌ ఆఫ్‌ ప్రిఫరెన్స్‌. పోటీపడుతున్న అభ్యర్థుల్లో మొదటి ప్రాధాన్యం ఓటు ఎవరికో తప్పనిసరిగా వేయాలి. అప్పుడే ఓటు చెల్లుతుంది. రెండో ప్రాధాన్యం ఓటు ఐచ్ఛికం.  

విజేతని నిర్ణయించేది ఇలా ..
రాష్ట్రపతి ఎన్నిక జూలై 18న జరిగితే, ఓట్ల లెక్కింపు జూలై 21న జరుగుతుంది. ప్రతీ ఎంపీకి, ఎమ్మెల్యేకి ఓటు విలువ ఉంటుంది. రాష్ట్రాల ఎమ్మెల్యేల ఓటు విలువని వారు ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్ర జనాభా ఆధారంగా పరిగణిస్తారు. దీంతో రాష్ట్రానికి రాష్ట్రానికి మధ్య ఓటు విలువ మారిపోతుంది. అన్ని రాష్ట్రాల ఎమ్మెల్యేల మొత్తం ఓటు విలువని పార్లమెంటు సభ్యుల సంఖ్యతో భాగిస్తే వచ్చే దానిని ఎంపీ ఓటు విలువగా నిర్ధారిస్తారు.

ఈ సారి జమ్ము కశ్మీర్‌ రాష్ట్రంగా లేకపోవడంతో 708గా ఉండాల్సిన ఎంపీ ఓటు విలువ 700కి తగ్గింది. ఎమ్మెల్యేలు, ఎంపీలందరినీ ఎలక్టోరల్‌ కాలేజీగా వ్యవహరిస్తారు. 776 మంది లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు, 4,120 మంది ఎమ్మెల్యేలు మొత్తంగా 4,896 మంది ప్రజాప్రతినిధులు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

మొత్తం ఎలక్టోరల్‌ కాలేజీ ఓట్ల విలువ 10,86,431 కాగా అందులో కనీసం 50% కంటే ఎక్కువ ఓట్లు పోలయిన అభ్యర్థిని విజేతగా నిర్ణయిస్తారు. అంటే 5,49,442కి పైగా ఓట్ల విలువ వచ్చిన వారు అత్యున్నత పీఠాన్ని అధిరోహిస్తారు. ఇప్పటికే 44 పార్టీలు ద్రౌపది ముర్ముకు మద్దతునివ్వడంతో ఆమెకు 6 లక్షలకుపైగా విలువైన ఓట్లు పోలవతాయని అంచనా. ఇంచుమించుగా మూడింట రెండు వంతుల మెజార్టీతో విజయం సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి.  

జీతభత్యాలు, జీవనం  
దేశంలో రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్న వారి అందరికంటే రాష్ట్రపతి జీతం ఎక్కువ. ప్రస్తుతం రాష్ట్రపతికి నెలకి రూ.5 లక్షల వేతనం చెల్లిస్తున్నారు. 2018లో రూ.లక్షన్నర ఉన్న జీతాన్ని రూ.5లక్షలకు పెంచారు. న్యూఢిల్లీలోని 340 గదులు, హాళ్లు ఉన్న రాష్ట్రపతి భవన్‌ అధికారిక నివాసం. అందులోనే బసచేస్తారు. వేసవి కాలం, శీతాకాలం గడపడానికి రెండు విడిదిలు ఉన్నాయి. వేసవి విడిది సిమ్లాలో ఉంటే, శీతాకాలం విడిది హైదరాబాద్‌లో ఉంది.

ప్రెసిడెంట్స్‌ బాడీగార్డ్‌(పీబీజీ) భద్రత ఉంటుంది. భారత ఆర్మీలో ఇదొక విభాగం. ఇక ఎక్కడికైనా ఉచిత ప్రయాణాలు, కావాల్సినంత మంది సిబ్బంది ఉంటారు. అత్యంత ఆధునిక భద్రతా వ్యవస్థ ఉన్న కారులో ప్రయాణిస్తారు. రిటైర్‌ అయిన తర్వాత రూ.లక్షన్నర పెన్షన్, ఉచిత నివాసం, ఫోన్, అయిదుగురు సిబ్బంది, ఉచిత ప్రయాణ సదుపాయాలు ఉంటాయి.    – సాక్షి, నేషనల్‌ డెస్క్‌

రాష్ట్రపతి అధికారాలు–విధులు
► రాష్ట్రపతి దేశ ప్రథమ పౌరుడు. ప్రధాన కార్యనిర్వాహణాధికారి. దేశ పరిపాలన, కార్యనిర్వహణ రాష్టపతి పేరు మీదే నిర్వహించాలి
► దేశ కార్యనిర్వాహణ అధికారిగా రాష్ట్రాల గవర్నర్లు, సుప్రీం కోర్టు, హైకోర్టుల జడ్జీలు, ఆడిటర్‌ జనరల్‌ ఆర్థిక సంఘాలను నియమిస్తారు. ప్రధానమంత్రిని, ఆయన సలహా మేరకు మంత్రిమండలిని రాష్ట్రపతి నియమిస్తారు.  
► పార్లమెంటు ఆమోదించిన ఏ బిల్లయినా రాష్ట్రపతి సంతకం తర్వాతే చట్టరూపం దాల్చుతుంది. బిల్లులో తనకి నచ్చని అంశాలు ఉంటే రాష్ట్రపతి వెనక్కి తిరిగి పంపే అధికారం ఉంది. రాష్ట్రపతి సిఫారసు లేనిదే ఆర్థిక బిల్లులేవీ సభలో ప్రవేశపెట్టకూడదు.  
► దేశంలో త్రివిధ బలగాలకు అధిపతి రాష్ట్రపతి.  
► దేశంలో అంతర్యుద్ధం చెలరేగి భద్రత అదుపు తప్పినా, సైనిక తిరుగుబాటు జరిగినా, విదేశాలు దండయాత్రకు దిగినా అత్యవసర పరిస్థితి విధించే అధికారం రాష్ట్రపతిదే.  
► సుప్రీం కోర్టు విధించిన మరణ శిక్షలపైన క్షమాభిక్ష ప్రసాదించే అధికారం రాష్ట్రపతికి
ఉంటుంది.
► ప్రధాని, మంత్రిమండలి లేకుండా రాష్ట్రపతి ఏమీ చేయలేరు. కానీ దేశ నిర్ణయాలను తెలియజెప్పే ఒక అధికారిక హోదా, గౌరవం ఈ పదవికి ఉన్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement