తప్పులను వ్యతిరేకించడం, ఎత్తి చూపడం, గద్దెదించడం ఇదే ప్రతిపక్షం పని: కాంగ్రెస్‌ | Pawan Khera acknowledged that the opposition is seeking a change of regime | Sakshi
Sakshi News home page

తప్పులను వ్యతిరేకించడం, ఎత్తి చూపడం, గద్దెదించడం ఇదే ప్రతిపక్షం పని: కాంగ్రెస్‌

Oct 17 2026 4:55 AM | Updated on Oct 17 2026 4:55 AM

Pawan Khera acknowledged that the opposition is seeking a change of regime

న్యూఢిల్లీ: యువతను వాడుకుంటూ దేశ రాజధాని ఢిల్లీలో అరాచక పరిస్థితులను సృష్టించడం ద్వారా బంగ్లాదేశ్‌లో మాదిరిగా ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు కాంగ్రెస్, ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయంటూ రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ పార్టీ మండిపడింది. ప్రజాస్వామ్యంలో ‘ప్రభుత్వం చేసే తప్పులను వ్యతిరేకించడం, ఎత్తిచూపడం, గద్దెదించడం’ఇవే ప్రతిపక్షాలు చేయాల్సిన పని అంటూ మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ఓ సందర్భంలో పేర్కొన్న వ్యాఖ్యలను గుర్తుకు తెచ్చుకోవాలని హితవు పలికింది. 

ప్రజాస్వామ్యయుతంగా ప్రజలను సమీకరించడం, రాజ్యాంగ సంస్థలు, స్వేచ్ఛాయుత నిష్పాక్షిక ఎన్నికల విధానం, ప్రజా సార్వభౌమత్వంపై మాత్రమే తమకు విశ్వాసముందని తెలిపింది. ఆర్‌ఎస్‌ఎస్‌ సిద్ధాంతాలపై గత వందేళ్లుగా తాము పోరాటం సాగిస్తున్నామంది. రాజ్యాంగవిరుద్ధంగా అధికారం చేపట్టడాన్ని తాము నిర్ద్వంద్వంగా తిరస్కరిస్తామని చెప్పింది. మంత్రి రాజ్‌నాథ్‌ వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్, ఆ పార్టీ మీడియా ఇన్‌చార్జి పవన్‌ ఖేరా ఈ మేరకు సమాధానమిచ్చారు. 

‘ఎప్పుడైనా, ఎవ్వరైనా ప్రశ్నిస్తే.. ఆ ప్రశ్నకు సమాధానం ఇవ్వడానికి బదులుగా ప్రత్యారోపణలు చేయడం, కుట్ర సిద్ధాంతాలను తెరపైకి తేవడం మోదీ ప్రభుత్వానికి  మామూలై పోయిందన్నారు. ‘దేశంలో వరుస ఆందోళనలు కొనసాగుతున్నప్పటికీ ప్రధాన ఎన్నికల కమిషనర్‌ను ప్రభుత్వం ఎందుకు కొనసాగనిస్తోంది? ఆయన్ను విధుల నుంచి ఎందుకు తొలగించలేదు?’అని పవన్‌ ఖేరా ప్రశ్నించారు. మోదీ ప్రభుత్వం గత, భవిష్యత్తుల గురించి మాత్రమే మాట్లాడుతుందన్న విషయం ఇప్పుడు దేశంలోని ప్రజలందరికీ తెలిసిపోయిందని తెలిపారు. 

‘ఆర్‌ఎస్‌ఎస్‌ ఇప్పుడు వర్సిటీలు, ఎన్నికల సంఘం, పరిపాలన యంత్రాంగం ఇలా.. అన్ని రంగాలపైనా పట్టుసాధించింది. దీనినే ’పాలనా వ్యవస్థ’ (రెజిమ్‌) అంటారు. దీనిని మార్చాలనే మేం మాట్లాడుతున్నాం. కచ్చితంగా మారుస్తాం. ఆర్‌ఎస్‌ఎస్, రిజిస్టర్‌ కాని ఒక సంస్థ యావత్‌ వ్యవస్థపై నాగుపాములా చుట్టుకుపోయినప్పుడు, మేం తోక ఊపుతూ కేవలం ప్రతిపక్షంలా కూర్చోలేం’అని ఆయన స్పష్టం చేశారు.

 తీవ్ర అసహనంతో ఉన్న మోదీ ప్రభుత్వం ప్రజలకు ’దిమాగీ నక్సల్‌’, ’దేశద్రోహి’, ’వామపక్ష వాది’ అంటూ ము ద్రవేస్తోందన్నారు. ‘తాము పతన దశలో ఉన్నట్లు ప్రభుత్వానికి అర్థమవుతోంది. తమ బండారం ప్రజల ముందు బట్టబయలైందని తెలిసిపోయింది‘ అని ఖేరా అన్నారు. ఎన్నికల కమిషనర్‌ను ప్రశ్నించడం, సంస్కరణలను డిమాండ్‌ చేయడం ప్రజాస్వామ్యంపై దాడి కాదని తెలిపారు. ఒక ప్రభుత్వాన్ని ప్రజాస్వామ్య పద్ధతిలో మార్చాలని కోరడం తిరుగుబాటు కూడా కాదని ఖేరా స్పష్టం చేశారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement