న్యూఢిల్లీ: పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) ప్రతిపాదనలపై చర్చించేందుకు అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కోరారు. ఈ విషయమై ప్రధాని మోదీకి ఈ రోజు (శుక్రవారం) లేఖ రాశారు. దేశ రాజ్యాంగంపై ప్రభావం చూపే సవరణ బిల్లును పార్లమెంట్లో మరోసారి బలవంతంగా ఆమోదింపజేయడానికి ప్రయత్నించవద్దని ప్రధానికి సూచించారు.
ప్రధాని మోదీకి రాసిన లేఖలో ఖర్గే పలు అంశాలను ప్రస్థావించారు. ఆగస్టు 13న పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు నిరవధికంగా వాయిదా పడినప్పటి నుంచి ఇప్పటికే 64 రోజులు గడిచిపోయాయని, అయినప్పటికీ పార్లమెంట్ ఉభయ సభలను ఇంకా అధికారికంగా ప్రోరోగ్ చేయలేదని ఆయన పేర్కొన్నారు. ఈ పరిస్థితి అసాధారణమైనదని, ఇంతటి జాప్యం గతంలో చోటుచేసుకోలేదని ఖర్గే తన లేఖలో వివరించారు. డీలిమిటేషన్‌పై ఏదైనా రాజ్యాంగ సవరణ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టడానికి ముందే అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని తాను తొలిసారిగా ఏప్రిల్ 11న ప్రధానిని కోరినట్లు ఖర్గే గుర్తుచేశారు.
అయితే, ఆ విజ్ఞప్తిని ప్రధాని పట్టించుకోలేదని అనంతరం ఏప్రిల్ 14వ తేదీ రాత్రి ఆలస్యంగా సంబంధిత బిల్లులను బహిరంగపరిచారని, ఏప్రిల్ 16న ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలను ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. డీలిమిటేషన్‌కు సంబంధించిన రాజ్యాంగ సవరణ బిల్లుకు లోక్‌సభలో అవసరమైన మూడింట రెండొంతుల మెజారిటీ లభించలేదని, ఏప్రిల్ 17న నిర్ణయాత్మక తేడాతో ఆ బిల్లు విఫలమైందని ఖర్గే తన లేఖలో తెలిపారు. ఆ తర్వాత కూడా అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలన్న తమ అభ్యర్థనను పునరుద్ఘాటిస్తూ జూలై 16న, ఆగస్టు 27న ప్రధానమంత్రి మోదీకి లేఖలు రాసినట్లు ఖర్గే తెలిపారు. ఇప్పుడు నాలుగోసారి ఇదే విజ్ఞప్తి చేస్తున్నానని చెప్పారు.
కొత్తగా ప్రతిపాదిస్తున్న డీలిమిటేషన్ విధానాలను ఖరారు చేసి పార్లమెంట్ పరిశీలనకు తీసుకురావడానికి ముందే, వాటిపై సమగ్రంగా చర్చించేందుకు అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని ప్రధానిని కోరారు.డీలిమిటేషన్‌కు సంబంధించిన కొత్త ప్రతిపాదనలపై రాజకీయ పార్టీలన్నింటికీ తగినంత సమయం ఇవ్వాలని ఖర్గే సూచించారు. ఆయా పార్టీలు తమలో తాము చర్చించుకోవడంతో పాటు, ఇతర రాజకీయ పార్టీలతోనూ, ఈ అంశంతో సంబంధం ఉన్న అన్ని వర్గాలతోనూ సంప్రదింపులు జరిపేందుకు అవకాశం కల్పించాలని పేర్కొన్నారు. ఇంతటి ప్రాధాన్యం ఉన్న అంశంపై విస్తృత చర్చలు జరగాల్సిన అవసరం ఉందని ఆయన తన లేఖలో స్పష్టం చేశారు.
గతంలో ప్రయత్నించినట్లుగా, దేశ రాజ్యాంగంపై సుదూర ప్రభావం చూపే రాజ్యాంగ సవరణ బిల్లును పార్లమెంట్లో మరోసారి బలవంతంగా ఆమోదింపజేయడానికి ప్రయత్నించవద్దని ఖర్గే ప్రధానిని హెచ్చరించారు. గతంలో అలాంటి ప్రయత్నం విఫలమైందని ప్రస్తావిస్తూ, “దయచేసి మరోసారి రాజ్యాంగంపై విస్తృత ప్రభావం చూపే బిల్లును పార్లమెంట్లో బలవంతంగా ఆమోదింపజేయడానికి ప్రయత్నించవద్దు. గతంలో మీరు చేసిన ప్రయత్నం తగిన ఫలితాన్ని ఎదుర్కొంది” అని తన లేఖలో పేర్కొన్నారు.
ఇదీ చదవండి: బీజేపీ మంత్రి భర్తపై సంచలన ఆరోపణ


