Mrinank Singh: మాజీ క్రికెటర్‌ అరెస్ట్‌.. కారణం ఇదే.. | Sakshi
Sakshi News home page

Mrinank Singh: మాజీ క్రికెటర్‌ అరెస్ట్‌.. కారణం ఇదే..

Published Thu, Dec 28 2023 10:53 AM

Haryana Ex Cricketer Mrinank Singh Arrested For Cheating Case - Sakshi

ఢిల్లీ: హర్యానా మాజీ క్రికెటర్‌ మృణాక్‌ సింగ్‌(25)ను ఢిల్లీ పోలీసులు అరెస్ట్‌ చేశారు. తాను స్టార్‌ క్రికెటర్‌, ఐపీఎస్‌ అధికారిని అంటూ లగ్జరీ హెటల్స్‌లో ఉండి.. బిల్లులను ఎగ్గొట్టిన కేసులో మృణాక్‌ సింగ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక, మృణాక్‌ సింగ్‌ హర్యానాలో అండర్‌-19 స్థాయిలో జట్టుకు ప్రాతినిధ్యం వహించగా, ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌ టీమ్‌లో కొనసాగాడు. 

అయితే, మృణాక్‌ సింగ్‌ 2022 జూలైలో ఢిల్లీలో ఫైవ్‌ స్టార్‌ హోటల్‌ తాజ్‌ కృష్ణాలో బస చేశాడు. ఈ క్రమంలో హోటల్‌ బిల్లు రూ.5లక్షలపైగా చేరింది. తీరా హోటల్‌ ఖాళీ చేస్తూ బిల్లు చెల్లించలేదు. ఈ సందర్బంగా తాను ఓ ప్రముఖ స్పోర్ట్స్‌ సంస్థకు అంబాసిడర్‌గా ఉన్నానని వారితో గొడవకు దిగారు. సదరు సంస్థనే తన బిల్లులను చెల్లిస్తుందని చెప్పుకొచ్చాడు. అనంతరం, అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అయితే, ఇప్పటికే వరకు రూ.5,53,362లకు గానూ.. మృణాక్‌ కేవలం రూ.2 లక్షలను చెల్లించాడు. దీంతో, పలుమార్లు హోటల్‌ యాజమాన్యం మృణాక్‌ను సంప్రదించినప్పటికీ అతడు ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకుంటున్నాడు.

ఈ క్రమంలో విసిగిపోయిన హోటల్‌ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు కేసు నమోదు చేశారు. అనంతరం, మృణాక్‌కు నోటీసులు పంపించారు. పోలీసుల నోటీసులకు మృణాక్‌ స్పందించకపోవడంతో అతడి ఇంటికి వెళ్లి తన తండ్రికి జరిగిన విషయాలను వెల్లడించారు. ఈ సందర్బంగా మృణాల్‌ అజ్ఞాతంలోకి వెళ్లడంతో పోలీసులు నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ చేశారు. అతను దేశం విడిచి పారిపోవడానికి ప్రయత్నించినట్లయితే అతన్ని అరెస్టు చేయడానికి లుక్‌ అవుట్‌ సర్క్యులర్‌ను కూడా జారీ చేశారు. కాగా, డిసెంబర్‌ 25వ తేదీన మృణాక్‌ హాంకాంగ్‌ వెళ్లే ప్రయత్నం చేయగా ఢిల్లీ విమానాశ్రయంలో ఇమ్మిగ్రేషన్‌ అధికారులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. 

ఇదిలా ఉండగా..  మృణాక్ సింగ్ గతంలో కూడా పలువురిని మోసం చేశాడు. అతడి బాధితుల్లో క్రికెటర్‌ రిషబ్‌ పంత్‌ కూడా ఉన్నాడు. లగ్జరీ వస్తువుల కొనుగోలు విషయంతో రూ.1.63కోట్లకు పంత్‌ను సింగ్‌ మోసం చేశాడు. దీంతో, పంత్‌ లీగల్‌ ప్రొసీడ్‌ కావాల్సి వచ్చింది. ఇక, రూ.6 ల‌క్ష‌ల‌కు బిజినెస్ మ్యాన్‌ను మోసం చేసినందుకు ముంబై ఆర్టూర్ రోడ్ జైల్లో ఉన్నాడు. ఒక సినిమా డైరెక్ట‌ర్‌ను మోస‌గించిన‌ట్లు విమ‌ర్శ‌లు ఉన్నాయి. ఈ కేసుపై ఏడాదికి పైగా విచారణ జరగగా గత వారం కోర్టులో హాజరుపరచాల్సిందిగా న్యాయస్థానం పోలీసులను ఆదేశించింది. అతన్ని అరెస్టు చేసిన జుహు పోలీసులు, అతని దగ్గర నుంచి రూ.6 లక్షల నగదు రికవరీ చేశారు. 

మరోవైపు.. మృణాక్‌ సింగ్‌ ఫైవ్ స్టార్ హోటల్స్‌లో బస చేయడం, మోడల్స్‌తో పార్టీలు చేసుకోవడం, వారితో ఫొటోలు దిగడం, తన గర్ల్‌ఫ్రెండ్స్‌తో కలిసి విదేశాలకు వెళ్లడం వంటి విలాసవంతమైన జీవనశైలిని గడుపుతున్నట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. అంతేకాకుండా మృణాల్‌ డ్రగ్స్‌ కూడా తీసుకుంటున్నట్టు పోలీసులు గుర్తించారు. 

Advertisement
 
Advertisement