తిరంగా మార్చ్‌: అభిజీత్‌ దీప్కే సంచలన ఆరోపణలు | Delhi Tiranga March: CJPs Abhijeet Dipke Makes Strong Remarks | Sakshi
Sakshi News home page

తిరంగా మార్చ్‌: అభిజీత్‌ దీప్కే సంచలన ఆరోపణలు

Oct 16 2026 6:52 AM | Updated on Oct 16 2026 6:56 AM

Delhi Tiranga March: CJPs Abhijeet Dipke Makes Strong Remarks

దేశ రాజధాని ఢిల్లీలో తిరంగా మార్చ్‌ నిర్వహణకు కాక్రోచ్‌ జనతా పార్టీ (సీజేపీ) సిద్ధమవుతున్న వేళ ఆ పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్‌ దీప్కే సంచలన ఆరోపణలు చేశారు. తనపై ఇంటెలిజెన్స్‌ బ్యూరో (ఐబీ) నిఘా పెట్టిందన్నారు. నంబర్‌ ప్లేట్లు లేని వాహనాలు తనను ఫాలో అవుతున్నాయని.. తనను ఏదైనా చేయొచ్చని పేర్కొన్నారు. ఢిల్లీ పోలీసులు  ఏ క్షణమైనా తనను అదుపులోకి తీసుకోవచ్చని.. అయినా తాము వెనక్కి తగ్గబోమని స్పష్టం చేశారు.

శుక్రవారం కన్నాట్‌ ప్లేస్‌లోని సెంట్రల్‌ పార్క్‌లో జాతీయ జెండా ఎగురవేసేందుకు సీజేపీ తిరంగా మార్చ్‌కు పిలుపునిచ్చింది. సర్‌ ప్రక్రియకు వ్యతిరేకంగా.. ప్రధాన ఎన్నికల కమిషనర్‌ (సీఈసీ) జ్ఞానేశ్‌ కుమార్‌ను పదవి నుంచి తొలగించాలన్న డిమాండ్‌తో ఆ పార్టీ ఈ కార్యక్రమాన్ని చేపడుతోంది. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR)లో అక్రమాలు జరిగాయన్న విపక్షాల ఆరోపణలకు సీజేపీ కూడా మద్దతు ప్రకటిస్తోంది.

జెండా ఎగురవేయడం నేరమా?
తిరంగా మార్చ్‌కు ముందు గురువారం మీడియాతో మాట్లాడిన దీప్కే.. జాతీయ జెండాను ఎగురవేయడం నేరమైతే జైలుకు వెళ్లడానికి కూడా సిద్ధమేనని ప్రకటించారు. ‘‘మేం ప్రశాంతంగా వెళ్లి తిరంగాను ఎగురవేస్తాం. దీన్ని నేరంగా పరిగణిస్తే.. అంతకంటే దేశద్రోహం మరొకటి ఉండదు. ఈ దేశంలో జాతీయ జెండాను ఎగురవేయడానికి జైలుకు వెళ్లాల్సి వస్తే అందుకు సిద్ధంగా ఉన్నాం’’ అని వ్యాఖ్యానించారు.

సెంట్రల్‌ పార్క్‌ మూసివేతపై నిలదీత
తిరంగా మార్చ్‌ నిర్వహించ తలపెట్టిన సెంట్రల్‌ పార్క్‌ను అక్టోబర్‌ 16, 17 తేదీల్లో మూసివేస్తున్నట్లు న్యూఢిల్లీ మున్సిపల్‌ కౌన్సిల్‌ (ఎన్‌డీఎంసీ) ప్రకటించింది. ఈ నిర్ణయంపై దీప్కే ప్రశ్నలు లేవనెత్తారు. తాము వంద ప్రాంతాల్లో జాతీయ జెండాను ఎగురవేస్తామని ప్రకటిస్తే.. ఆ వంద ప్రాంతాలనూ మూసివేస్తారా అని నిలదీశారు. ప్రధాని నరేంద్ర మోదీ ర్యాలీలో జాతీయ జెండాను ఎగురవేస్తామని చెబితే ఆ ర్యాలీని కూడా రద్దు చేస్తారా అని ప్రశ్నించారు.

‘భయపడేది లేదు’
తన ఇంటి వద్ద ఉన్న వాచ్‌మన్‌ను ఐబీ సిబ్బంది వివరాలు అడుగుతున్నారని, నంబర్‌ ప్లేట్లు లేని వాహనాలు తనను అనుసరిస్తున్నాయని దీప్కే ఆరోపించారు. ఢిల్లీ పోలీసులు తనను అదుపులోకి తీసుకునే అవకాశం ఉందని చెబుతూ.. ఇలాంటి చర్యలతో తాము భయపడబోమని ప్రధాని మోదీకి స్పష్టం చేశారు. ఇప్పటికే తన పార్టీ సహచరులు సౌరవ్‌ దాస్‌, ఆశుతోష్‌ రంకాలను అరెస్టు చేసిన విషయాన్ని ప్రస్తావించారు. జాతీయ జెండాను ఎగురవేసినందుకు ప్రజలను జైలుకు పంపుతున్నారని ఆరోపించారు. జాతీయ జెండాపై ప్రధానికి ఎందుకంత వ్యతిరేకత ఉందని ప్రశ్నించారు.

సీఈసీని తొలగించాలన్నదే డిమాండ్‌
ప్రభుత్వాన్ని మార్చాలన్నది తమ ఉద్దేశం కాదని దీప్కే స్పష్టం చేశారు. సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ను తొలగించి, స్వతంత్రంగా, నిష్పక్షపాతంగా వ్యవహరించే వ్యక్తిని ఆ పదవిలో నియమించాలని మాత్రమే కోరుతున్నామని చెప్పారు. ఇతర ఎన్నికల కమిషనర్ల అభిప్రాయాలను కూడా జ్ఞానేశ్‌ కుమార్‌ పట్టించుకోవడం లేదని ఆరోపించారు.

దేశంలో ఎమర్జెన్సీ తరహా పరిస్థితులు ఉన్నాయని వ్యాఖ్యానించిన దీప్కే.. ఎమర్జెన్సీ ప్రకటిస్తే తన ప్రతిష్ట దెబ్బతింటుందనే భయంతోనే ప్రధాని మోదీ ఆ నిర్ణయం తీసుకోవడం లేదని ఆరోపించారు. అయితే, తనపై ఐబీ నిఘా ఉందని, పోలీసులు అదుపులోకి తీసుకునే అవకాశం ఉందని దీప్కే చేసిన వ్యాఖ్యలపై సంబంధిత అధికారుల స్పందన తెలియాల్సి ఉంది.

ఇదీ చదవండి: న్యాయవ్యవస్థను భయపెట్టలేరు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement