మేము దంతపు కోటలో కూర్చోలేదు
ఎవరేం మాట్లాడుతున్నారో అంతా తెలుసు
సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టికరణ
ఈ నెల 12న జరిగిన విపక్షాల ర్యాలీపై విచారణ
రాహుల్ గాంధీ ప్రవర్తనపై ఆక్షేపణ
వివరణ ఇవ్వాలంటూ నోటీసులు
‘ఎస్ఐఆర్’విషయంలో ప్రతిపక్షాల పిటిషన్లపై విచారణ
ఎన్నికల సంఘం, సీఈసీకి నోటీసులు
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రవర్తనను సుప్రీంకోర్టు ధర్మాసనం తీవ్రంగా ఆక్షేపించింది. అక్టోబర్ 12న సుప్రీంకోర్టు వరకు రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో జరిగిన పాదయాత్రపై అసంతృప్తి వ్యక్తంచేసింది. దీనిపై వివరణ ఇవ్వాలని రాహుల్ గాం«దీతోపాటు ప్రతిపక్ష నాయకులను ఆదేశించింది. వారికి నోటీసులు జారీ చేసింది. ఎస్ఐఆర్లో అక్రమాలు జరుగుతున్నాయని, దీనికి బాధ్యత వహిస్తూ ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ రాహుల్ ఆధ్వర్యంలో ప్రతిపక్ష నేతలు ఈ నెల 12న సుప్రీంకోర్టు వరకు ర్యాలీ చేసిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు, హైకోర్టుల పరిసరాల్లో నిరసనలు, ర్యాలీలను నిరోధించాలని కోరుతూ నలుగురు న్యాయవాదులు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, న్యాయమూర్తి జస్టిస్ జోయ్మాల్య బాగీ్చతో కూడిన ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. న్యాయవ్యవస్థను ఎవరూ భయపెట్టలేరని జస్టిస్ సూర్యకాంత్ తేల్చిచెప్పారు. తాము దంతపు కోటలో కూర్చోలేదని, బయట ఏం జరుగుతుందో, కోర్టులో ఏం చెబుతున్నారో, ఎవరు ఎలాంటి ప్రకటనలు చేస్తున్నారో అంతా గమనిస్తున్నామని స్పష్టంచేశారు. న్యాయస్థానాలను ప్రభావితం చేయాలనే ఇలాంటి ప్రయత్నాలు బలహీనమైనవని, వాటిని ఎవరూ పట్టించుకోరని వెల్లడించారు.
ఎస్ఐఆర్పై నోటీసులు
దేశ రాజధాని ఢిల్లీలో ఇటీవల జరిగిన ఆందోళనలు, పోలీసుల ఆంక్షలు, పత్రికా స్వేచ్ఛ, కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్ఐఆర్) తదితర అంశాలపై సుప్రీంకోర్టు కీలక విచారణ జరిపింది. ధర్మాసనం ఒకేసారి 46 పిటిషన్లను పరిశీలించింది. ఒకే రకమైన పిటిషన్లను వర్గీకరించి, ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది.
ఆందోళనలకు సంబంధించిన డిజిటల్ ఆధారాలను భద్రపరచాలని దర్యాప్తు సంస్థలను ఆదేశించింది. ఎస్ఐఆర్ ప్రక్రియలో భారీ ఎత్తున ఓటర్ల తొలగింపు, అవకతవకలు జరుగుతున్నాయంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సహా విపక్ష ‘ఇండియా’కూటమి నాయకులు దాఖలు చేసిన పిటిషన్పై ధర్మాసనం విచారణ జరిపింది. ఈ వ్యవహారంపై వివరణ ఇవ్వాలంటూ ఎన్నికల సంఘంతోపాటు సీఈసీ జ్ఞానేశ్ కుమార్కు నోటీసులు జారీ చేసింది. ‘‘నోటీసు జారీ చేయడం అంటే మేము దీనిని ఖండిస్తున్నామని అర్థం కాదు’’అని రాహుల్ తరపున హాజరైన సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్తో జస్టిస్ సూర్యకాంత్ అన్నారు. ఎస్ఐఆర్పై వివిధ రాష్ట్రాల్లో పెండింగ్లో ఉన్న కేసులతోపాటు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ దాఖలు చేసిన పిటిషన్ను కూడా దీనికి జత చేశారు.
పోలీస్ కమిషనర్ బేషరతు క్షమాపణ
ఢిల్లీలో ప్రజా రవాణా విషయంలో అక్టోబర్ 9, 11 తేదీల్లో సుప్రీంకోర్టు ఇచ్చిన మధ్యంతర ఆదేశాలను పోలీసులు ఉల్లంఘించారంటూ దాఖలైన కోర్టు ధిక్కరణ పిటిషన్లను ధర్మాసనం విచారించింది. ఢిల్లీ పోలీస్ కమిషనర్ అనురాగ్ కుమార్ రెండు అఫిడవిట్లు దాఖలు చేశారు. కోర్టు ఆదేశాలను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించలేదని, ఒకవేళ పొరపాటు జరిగి ఉంటే బేషరతు క్షమాపణలు కోరుతున్నట్లు తెలిపారు.
జర్నలిస్టుల రక్షణకు ప్రత్యేక కమిటీ
ఆందోళనల ప్రాంతాల్లో విధుల్లో ఉన్న మహిళా జర్నలిస్టుల రక్షణపై నెట్వర్క్ ఆఫ్ విమెన్ ఇన్ మీడియా, ఢిల్లీ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్, ఫ్రీ స్పీచ్ కలెక్టివ్ సంస్థలు దాఖలు చేసిన పిటిషన్లను కోర్టు విచారించింది. మహిళా జర్నలిస్టుల భద్రత కోసం మాజీ మహిళా న్యాయమూర్తులు, ఐపీఎస్ అధికారులు, సామాజిక కార్యకర్తలతో కూడిన ప్యానెల్ను ఏర్పాటు చేయడానికి సుముఖత వ్యక్తం చేసింది. బాధితుల వివరాలు, కమిటీ సభ్యుల పేర్లను సీల్డ్ కవర్లో సమర్పించాలని సీనియర్ న్యాయవాది ఇందిరా జైసింగ్ను ఆదేశించింది.
ఓ పోలీస్ అధికారి వేధింపులపై ఫిర్యాదు చేసిన మహిళా జర్నలిస్టుపై కక్షసాధింపుగా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు కాగా, ఆమెపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దని స్పష్టం చేసింది. అక్టోబర్ 12న సుప్రీంకోర్టు ఆవరణలో గర్భిణిగా ఉన్న జర్నలిస్టును రాహుల్ గాంధీ నెట్టివేశారని, ఆమె ఆసుపత్రి పాలైందన్న వార్తను గౌరవ్ భాటియా ప్రస్తావించగా.. ఈ అంశంపైనా కోర్టు నోటీసులు జారీ చేసింది. జర్నలిస్టులకు ఆర్టికల్ 19(1)(ఎ) కింద భావ ప్రకటనా స్వేచ్ఛ, ఆర్టికల్ 19(1)(జి) కింద వృత్తిలో కొనసాగేందుకు హక్కు ఉంటాయని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ స్పష్టంచేశారు.


