12–14 ఏళ్ల వారికి వ్యాక్సినేషన్‌ రేపటి నుంచే.. | COVID-19: 12-14-year-olds to get Corbevax shots | Sakshi
Sakshi News home page

12–14 ఏళ్ల వారికి వ్యాక్సినేషన్‌ రేపటి నుంచే..

Mar 15 2022 3:36 AM | Updated on Mar 15 2022 3:36 AM

COVID-19: 12-14-year-olds to get Corbevax shots - Sakshi

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 12 నుంచి 14 ఏళ్ల పిల్లలకు కోవిడ్‌–19 వ్యాక్సినేషన్‌ బుధవారం నుంచి ప్రారంభం కానుందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ చెప్పారు. హైదరాబాద్‌లోని బయోలాజికల్‌ ఈ.లిమిటెడ్‌ సంస్థ తయారు చేసిన కోర్బివాక్స్‌ టీకా ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఆయన సోమవారం ట్వీట్‌ చేశారు. చిన్నారులు క్షేమంగా ఉంటేనే దేశం క్షేమంగా ఉంటుందని పేర్కొన్నారు. 12, 13, 14 ఏళ్ల వయసున్న వారు బుధవారం నుంచి కరోనా టీకా తీసుకోవాలని కోరారు. అలాగే రెండు కంటే ఎక్కువ వ్యాధులతో బాధపడుతూ 60 ఏళ్లు దాటిన వారు కూడా బూస్టర్‌ డోసు వేయించుకోవచ్చని సూచించారు.

సైంటిఫిక్‌ విభాగాలతో చర్చించిన అనంతరం 12, 13, 14 ఏళ్ల వారికి ఈ నెల 16 నుంచి కరోనా టీకా ఇవ్వాలని నిర్ణయించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది. 2008, 2009, 2010లో జన్మించిన ఈ వ్యాక్సినేషన్‌ ప్రక్రియలో భాగస్వాములు కావాలని కోరింది. 12 ఏళ్లు దాటినవారంతా అర్హులేనని వెల్లడించింది. 12–14 ఏళ్ల వయసు విభాగంలో దేశవ్యాప్తంగా 7.11 కోట్ల మంది పిల్లలు ఉన్నట్లు అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి. బయోలాజికల్‌ ఈ.లిమిటెడ్‌ సంస్థ 5 కోట్ల కోర్బివాక్స్‌ టీకా డోసులను ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి అందజేసింది. దేశంలో 14 ఏళ్లు దాటిన వారికి కోవిడ్‌–19 వ్యాక్సినేషన్‌ను గతంలోనే ప్రారంభించిన సంగతి తెలిసిందే. 15–18 ఏళ్ల వారికి ఈ ఏడాది జనవరి 3వ తేదీ నుంచి కరోనా టీకాలు ఇస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement