రామ్‌లీలాలో కాక్రోచ్‌ దహనం! | Cockroach Effigy to Be Burnt Alongside Ravana in Delhi's Ramlila Viral | Sakshi
Sakshi News home page

రామ్‌లీలాలో కాక్రోచ్‌ దహనం!

Oct 16 2026 2:02 PM | Updated on Oct 16 2026 2:16 PM

Cockroach Effigy to Be Burnt Alongside Ravana in Delhi's Ramlila Viral

విజయదశమి సంబురాల్లో భాగంగా రామ్‌లీలా మైదానంలో నిర్వహించే రావణ దహనం ఎంతో ప్రత్యేకం. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా రావణుడి దిష్టిబొమ్మను దహనం చేస్తారు. అయితే ఈసారి రావణుడితో పాటు ఓ భారీ బొద్దింక దిష్టిబొమ్మను కూడా దహనం చేయాలని నిర్వాహకులు నిర్ణయించారన్న ప్రచారం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. 

దేశ రాజధాని ఢిల్లీలో కాక్రోచ్‌ జనతా పార్టీ (సీజేపీ) నిరసనలు కొనసాగుతున్న వేళ.. రామలీలాలో ఈసారి 30 అడుగుల భారీ బొద్దింక దిష్టిబొమ్మను దహనం చేయనున్నారు. రావణుడు, కుంభకర్ణుడు, మేఘనాథుడి దిష్టిబొమ్మలతో పాటు దీనినీ దహనం చేసేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఈ నిర్ణయం వెనుక రాజకీయ ఉద్దేశాలేమీ లేవని అంటున్నారు. బొద్దింక అపరిశుభ్రతకు చిహ్నమని, స్వచ్ఛత సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యమని నిర్వాహకులు చెబుతున్నారు.

స్వచ్ఛత ప్రచారంలో భాగంగానే..
పిటాంపురాలో ఏటా రామలీలాను నిర్వహించే శ్రీ కేశవ్‌ రామ్‌లీలా కమిటీ ఈ వినూత్న నిర్ణయం తీసుకుంది. స్వచ్ఛ భారత్‌, స్వచ్ఛ ఢిల్లీ కార్యక్రమాల్లో భాగంగానే బొద్దింక దిష్టిబొమ్మను దహనం చేయనున్నట్లు కమిటీ తెలిపింది. కమిటీ అధ్యక్షుడు, బీజేపీ ఎమ్మెల్యే అశోక్‌ గోయల్‌ మాట్లాడుతూ.. ఈ నిర్ణయానికి రాజకీయాలతో సంబంధం లేదని స్పష్టం చేశారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా ఈ కార్యక్రమం ఉంటుందని పేర్కొన్నారు. రావణుడి సైన్యంలోని అసురుల్లోనూ బొద్దింకను చూపించనున్నట్లు వెల్లడించారు.

సీజేపీ నిరసనల నేపథ్యంలో ఆసక్తికర పరిణామం
ఢిల్లీలో సీజేపీ నిరసనలు చేపడుతున్న సమయంలోనే భారీ బొద్దింక దిష్టిబొమ్మను దహనం చేయాలనే నిర్ణయం చర్చనీయాంశంగా మారింది. ప్రధాన ఎన్నికల కమిషనర్‌ (సీఈసీ) జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలని సీజేపీ, ప్రతిపక్ష పార్టీలు, విద్యార్థి సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌) ప్రక్రియలో అక్రమాలు జరిగాయన్నది వారి ప్రధాన ఆరోపణ. గతంలో కేంద్ర మాజీ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు వ్యతిరేకంగా నిరసనలు చేపట్టిన సీజేపీ.. ఇప్పుడు ఎన్నికల ప్రక్రియపై ఆందోళనలకు మద్దతుగా నిలుస్తోంది. సీజేపీ నిరసనల నేపథ్యంలో ఢిల్లీలో భద్రతను కట్టుదిట్టం చేశారు. కనాట్‌ ప్లేస్‌, జంతర్‌ మంతర్‌ పరిసరాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పారామిలటరీ బలగాల బృందాలను కూడా మోహరించారు. 

బొద్దింకే సీజేపీ నిరసనలకు చిహ్నం!
నిరుద్యోగ యువతను బొద్దింకలతో పోలుస్తూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యపై ఆన్‌లైన్‌లో తీవ్ర విమర్శలు రావడంతో వ్యంగ్య నిరసన ఉద్యమంగా సీజేపీ ఏర్పడింది. ఆ వ్యాఖ్యలోని బొద్దింక ప్రతీకను తమ నిరసనలకు చిహ్నంగా మార్చుకున్న ఆ సంస్థ.. నిరుద్యోగం, పరీక్షల్లో అక్రమాలు, ప్రభుత్వ జవాబుదారీతనం వంటి అంశాలపై ప్రచారం చేస్తోంది. ఈ నేపథ్యంలో రామలీలాలో భారీ బొద్దింక దిష్టిబొమ్మ దహనం చేయాలన్న నిర్ణయం మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది.

ఇదీ చదవండి: మోదీ అగ్రెసివ్‌ వీడియో.. ఇప్పుడెందుకు?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement