సాక్షి,న్యూఢిల్లీ: ఆందోళనతో జంతర్ మంతర్ హీటెక్కింది. ఓటర్ల జాబితా ప్రక్షాళన ప్రక్రియ (ఎస్ఐఆర్)లో నిబంధనలు ఉల్లంఘించారంటూ ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) నేతలు పిలుపునిచ్చారు. దీంతో జంతర్ మంతర్‌లో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి.
ఈ క్రమంలో అప్రమత్తమైన ఢిల్లీ పోలీసులు సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కేతో పాటు సౌరవ్ దాస్, అశుతోష్ రంకా తదితరులను శనివారం నాడే ఢిల్లీలో విమానం దిగుతుండగా అదుపులోకి తీసుకున్నారు. అప్పటి నుంచి వారు పోలీసుల అదుపులోనే ఉన్నారు. నేడు (ఆదివారం) ఈ ముగ్గురు నేతలను ఢిల్లీ కంటోన్మెంట్‌లోని ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరచనున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.
వెనక్కి తగ్గేది లేదన్న సీజేపీ..
నాయకుల అరెస్టులతో నిరసనలు ఆగిపోవని సీజేపీ మరో నేత అజింక్య షిండే స్పష్టం చేశారు. నేతల గైర్హాజరీలోనూ ఆందోళనకారులు నేడు మరోసారి జంతర్ మంతర్ వైపు భారీ మార్చ్ నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ తన పదవికి రాజీనామా చేసే వరకు ఈ పోరాటం ఆపేది లేదని ఆయన తేల్చిచెప్పారు. అయినప్పటికీ సీజేపీ ముఖ్యనేతలు, వందల మంది కార్యకర్తల్ని పోలీసులు అరెస్టు చేశారు.
రెండో రోజు కొనసాగుతున్న ఉద్రిక్తతలు..
ఎస్ఐఆర్ వివాదంపై జరుగుతున్న ఈ నిరసనలు రెండో రోజుకు చేరాయి. ఎన్నికల సంఘం నిబంధనలను ఉల్లంఘించిందంటూ ఆందోళనకు దిగిన రాజకీయ నాయకులు, వందలాది మంది నిరసనకారులను నిన్న పోలీసులు అదుపులోకి తీసుకుని, ఆ తర్వాత రాత్రికి విడుదల చేశారు. జంతర్ మంతర్ వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఢిల్లీ పోలీసులు జాతీయ రాజధాని చుట్టూ భారీ భద్రతా వలయాన్ని ఏర్పాటు చేశారు. పోలీసుల ఆంక్షలతో నిరసనకారులు నగరం వ్యాప్తంగా వేర్వేరు చిన్న గుంపులుగా విడిపోయి ఆందోళనలు కొనసాగిస్తున్నారు.
ఇదీ చదవండి : జంతర్ మంతర్ 2.0: ఢిల్లీలో హైటెన్షన్


