జోరుగా పీడీఎస్‌ బియ్యం దందా | Sakshi
Sakshi News home page

జోరుగా పీడీఎస్‌ బియ్యం దందా

Published Tue, Apr 16 2024 1:55 AM

దేవరకొండ మండలం ఇద్దంపల్లి వద్ద పట్టుబడిన 50 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం  - Sakshi

చింతపల్లి: నల్లగొండ–నాగర్‌కర్నూల్‌ జిల్లాల సరిహద్దుల్లో రేషన్‌(పీడీఎస్‌) బియ్యం దందా యథేచ్ఛగా సాగుతోంది. రాత్రి, పగలు అనే తేడా లేకుండా అక్రమార్కులు దేవరకొండ నియోజకవర్గ పరిసర ప్రాంతాల నుంచి పీడీఎస్‌ బియ్యాన్ని తరలిస్తున్నారు. పేదలు కడుపు నిండా భోజనం చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం రాయితీపై ఉచితంగా అందజేస్తున్న రేషన్‌ బియ్యం అక్రమార్కులకు ఆదాయ వనరుగా మారింది. పోలీసు అధికారులు అడపాదడపా తనిఖీలు చేస్తున్నప్పటికీ రెవెన్యూ అధికారులు కనీసం అటువైపు కన్నెత్తి చూడడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. తాజాగా శనివారం చింతపల్లి మండల కేంద్రంలో 25 క్వింటాళ్ల రేషన్‌ బియ్యం, దేవరకొండ మండలం ఇద్దంపల్లి వద్ద 50 క్వింటాళ్లు, డిండి మండలం చెర్కుపల్లి వద్ద 25 క్వింటాళ్ల రేషన్‌ బియ్యం పట్టుబడింది. దేవరకొండ నియోజకవర్గ పరిధిలోని దేవరకొండ, చింతపల్లి, డిండి, చందంపేట మండలాలు నాగర్‌కర్నూల్‌ జిల్లాకు సరిహద్దున ఉండడంతో ఇక్కడ రేషన్‌ బియ్యాన్ని సేకరించి దళారులు కల్వకుర్తి, చారగొండ మండల కేంద్రాల్లోని రైస్‌ మిల్లులకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు.

డీలర్ల నుంచి సేకరణ

గతంలో లబ్ధిదారులు రేషన్‌ దుకాణాల్లో రాయితీపై కొనుగోలు చేసిన బియ్యాన్ని దళారులకు విక్రయించేవారు. అధికారుల నిఘా పెరగడంతో ఇది చాలా వరకు తగ్గింది. ఇదే అదునుగా భావించిన కొంతమంది రేషన్‌ డీలర్లు బియ్యం పంపిణీ చేసేటప్పుడు లబ్ధిదారుల నుంచి వేలిముద్రలు తీసుకుని కిలోకు రూ.8 వరకు చెల్లిస్తున్నారు. డీలర్ల నుంచి దళారులు రేషన్‌ బియ్యాన్ని గుట్టుచప్పుడు కాకుండా మారుమూల ప్రాంతాలు, మండల సరిహద్దు ప్రాంతాల్లో లారీ, డీసీఎం, టాటా ఏస్‌ వాహనాల్లో లోడ్‌ చేసి నాగర్‌కర్నూల్‌ జిల్లా కల్వకుర్తికి అక్రమంగా రవాణా చేస్తున్నారు. దళారులు ఈ విధంగా సేకరించిన రేషన్‌ బియ్యాన్ని కిలోకు రూ.13 నుంచి రూ.16 వరకు విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. దళారులకు నాయకుల అండదండలు ఉండడంతో ప్రతి నెల అక్రమ రవాణా సాగిస్తున్నట్లు సమాచారం.

మన బియ్యం మనకే..

రేషన్‌ దుకాణాల్లో, గ్రామాల్లో దళారుల సేకరించిన రేషన్‌ బియ్యాన్ని కల్వకుర్తిలోని ఓ ప్రాంతంలో రీసైక్లింగ్‌ చేసి కర్నూల్‌ బియ్యం పేరుతో బ్యాగుల్లో ప్యాక్‌ చేసి తిరిగి నియోజకవర్గ పరిసర ప్రాంతాల్లోని కిరాణ దుకాణాల్లో విక్రయిస్తున్నారు.

పట్టించుకోని రెవెన్యూ అధికారులు..

మండల సరిహద్దు ప్రాంతాల్లో రేషన్‌ బియ్యం నిల్వలు ఉన్నట్లు ప్రజలు సమాచారం అందిస్తున్నా రెవెన్యూ అధకారులు పట్టించుకోవడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. ఇటీవల కాలంలో వంద టన్నులకు పైగా పీడీఎస్‌ బియ్యం పట్టుబడడంతో దేవరకొండ నియోజకవర్గంలో ఈ దందా జోరుగా సాగుతున్నట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ దందా 4వ తేదీ నుంచి 15వ తేదీ వరకు జోరుగా సాగుతున్నట్లు సమాచారం.

యథేచ్ఛగా సాగుతున్న రవాణా

డీలర్ల నుంచే సేకరిస్తున్న వ్యాపారులు

రెవెన్యూ అధికారులు

పట్టించుకోవడంలేదని ఆరోపణలు

Advertisement
Advertisement