ట్యాపింగ్‌పై ప్రభుత్వానివి అసత్య ఆరోపణలు | Sakshi
Sakshi News home page

ట్యాపింగ్‌పై ప్రభుత్వానివి అసత్య ఆరోపణలు

Published Mon, Apr 15 2024 1:50 AM

బీఆర్‌ఎస్‌ సన్నాహక సమావేశంలో 
మాట్లాడుతున్న మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి
 - Sakshi

మిర్యాలగూడ: గత ప్రభుత్వం ఫోన్‌ ట్యాపింగ్‌కు పాల్పడిందని ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వం అసత్య ఆరోపణలు చేస్తోందని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్‌రెడ్డి ఆరోపించారు. ఆదివారం మిర్యాలగూడ పట్టణంలోని నందిపాడు టీఎన్‌ఆర్‌ గార్డెన్స్‌లో మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు అధ్యక్షతన నిర్వహించిన బీఆర్‌ఎస్‌ నియోజకవర్గ స్థాయి సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. ట్యాపింగ్‌ వ్యవహారంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు ఉందన్నారు. బీఆర్‌ఎస్‌పై ఆరోపణలు మాని ప్రజా సంక్షేమంపై దృష్టి పెట్టాలన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రతి రైస్‌ మిల్లు నుంచి రూ.2కోట్ల నుంచి రూ.3కోట్ల వరకు బెదిరించి వసూలు చేసి ఢిల్లీకి పంపిస్తోందని ఆరోపించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి గత ప్రభుత్వంపై, కేసీఆర్‌పై విమర్శలు చేస్తున్నారని, కేంద్ర ప్రభుత్వం సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌కు రంగులు వేసిందే తప్పా తెలంగాణ రాష్ట్రానికి చేసిందేమీ లేదని అన్నారు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నాగార్జునసాగర్‌ రిజర్వాయర్‌లో నీరు 505 అడుగుల డెడ్‌ స్టోరేజీ ఉన్నప్పటికీ వరి సాగుకు నీరు అందించి ఆదుకుందని గుర్గు చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అనేక హామీలిచ్చి అధికారంలోకి వచ్చిందని.. ఇప్పుడు వాటిని తుంగలో తొక్కిందన్నారు. సీఎం రేవంత్‌రెడ్డికి మాజీ సీఎం కేసీఆర్‌ను, మాజీ మంత్రి కేటీఆర్‌ను విమర్శించే పనిలో ఉన్నారే తప్ప ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి సారించడం లేదన్నారు. వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల్లో ప్రజలు బీఆర్‌ఎస్‌ పార్టీ ఎంపీ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డికి ఓటు వేసి బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలకు తగిన బుద్ధి చెప్తారన్నారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు బడగుల లింగయ్యయాదవ్‌, ఎమ్మెల్సీ ఎంసీ.కోటిరెడ్డి, ఎంపీ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు నల్లమోతు భాస్కర్‌రావు, కంచర్ల భూపాల్‌రెడ్డి, రమావత్‌ రవీంద్రకుమార్‌, తిప్పన విజయసింహారెడ్డి, రైతుబంధు సమితి జిల్లా మాజీ అధ్యక్షుడు చింతరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, నామిరెడ్డి యాదగిరిరెడ్డి, డీసీఎంఎస్‌ చైర్మన్‌ దుర్గంపూడి నారాయణరెడ్డి, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, పీఏసీఎస్‌ చైర్మన్లు, ఆయా మండలాల అధ్యక్షులు, తదితరులు పాల్గొన్నారు.

ఫ మాజీ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి

Advertisement
Advertisement