హామీలను తప్పించుకునేందుకు డ్రామాలు | Sakshi
Sakshi News home page

హామీలను తప్పించుకునేందుకు డ్రామాలు

Published Sun, Apr 14 2024 2:40 AM

- - Sakshi

నకిరేకల్‌ : కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హమీలను అమలు చేయకుండా తప్పించుకునేందుకు.. ఫోన్‌ ట్యాంపింగ్‌ పేరుతో బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ను బదనాం చేస్తోందని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్‌రెడ్డి విమర్శించారు. బీఆర్‌ఎస్‌ భువనగిరి ఎంపీ అభ్యర్థి క్యామా మల్లేష్‌ గెలుపును కాంక్షిస్తూ శనివారం నకిరేకల్‌లో నిర్వహించిన ఆ పార్టీ నియోజకవర్గస్థాయి సమావేశంలో జగదీష్‌రెడ్డి మాట్లాడారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రతి రోజు కేసులు, ఫేక్‌ న్యూస్‌లు, తిట్ల పురాణాలు తప్ప ప్రజలకోసం చేసింది ఏమీ లేదన్నారు. రాష్ట్రం అంతా కరువతో రైతులు అరిగోస పడుతున్నారని.. గడిచిన వంద రోజుల్లో 200 మంది రైతులు చనిపోయారని గుర్తు చేశారు. మంత్రి కోమటిరెడ్డి ఎటు పోయిండు.. మిర్యాలగూడలో ఆయన ఫోన్‌ చేస్తే ధాన్యం ధర మరింత తగ్గిందని ఎద్దేవా చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి.. ఇద్దరూ కలిసి ఎంపీ ఎన్నికల్లో డమ్మీ అభ్యర్థులను పెట్టుకుని బీఆర్‌ఎస్‌పై కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. బీఆర్‌ఎస్‌ పార్టీ గెలిస్తేనే ప్రజలకు ఉపయోగం ఉంటుందన్నారు. ఎంపీ అభ్యర్థి క్యామా మల్లేష్‌ మాట్లాడుతూ కాంగ్రెస్‌ హమీలను చూసి ప్రజలు క్షనికావేశంతో అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఓటు వేసి గెలిపించారని.. మరోసారి ప్రజలు క్షణికావేశానికి లోనవకుండా బీఆర్‌ఎస్‌కు ఓటు వేసి గెలిపించాలని కోరారు. నకిరేకల్‌ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మాజీ ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్‌, జెడ్పీ చైర్మన్లు బండ నరేందర్‌రెడ్డి, సందీప్‌రెడ్డి, ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్యగౌడ్‌, రాష్ట్ర నాయకులు డాక్టర్‌ చెరుకు సుధాకర్‌, చింతల సోమన్న, నలగాటి ప్రసన్నరాజ్‌, మల్లికార్జున్‌రెడ్డి, మున్సిపల్‌ చైర్మన్‌ రాచకొండ శ్రీనివాస్‌గౌడ్‌, జెడ్పీటీసీలు మాద ధనలక్ష్మీనగేష్‌, తలారి బలరాం పాల్గొన్నారు.

ఫ మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్‌రెడ్డి

Advertisement
Advertisement