అంతా మీ చేతుల్లోనే.. | Sakshi
Sakshi News home page

అంతా మీ చేతుల్లోనే..

Published Tue, Apr 16 2024 1:20 AM

-

సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌/నారాయణపేట: ‘కాంగ్రెస్‌ కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలి. అందరూ ఏకమయ్యారు. ఎమ్మెల్యే ఎన్నికల కంటే కష్టపడాలి. లోక్‌సభ ఎన్నికలు జరిగిన మరుక్షణం స్థానిక సంస్థల ఎన్నికలు వస్తాయి. మీరు ఊళ్లలో పట్టు సడలిస్తే.. రేపు ఎవరో ఒకరు మోపు అయి వార్డు మెంబర్‌, సర్పంచ్‌, ఎంపీటీసీ, ఎంపీపీ, జెడ్పీటీసీలుగా వస్తారు. అప్పు మీకు తలనొప్పి.. ఖర్చు మోపైడెతది. ఎంపీ ఎన్నికలు అయిన వెంటనే స్థానిక ఎన్నికలు పెట్టి.. మిమ్మల్ని గెలిపించుకుంటాం. పార్టీ కోసం పని చేసే వారిని గుర్తు పెట్టుకుంటాం. మీ త్యాగాలు గుర్తుపెట్టుకుని అవకాశాలు కల్పించడమే కాదు.. గెలిపించుకుని తీరుతాం. మీ శ్రమ ఉరికే పోదు.’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌ శ్రేణుల్లో జోష్‌ నింపారు. నారాయణపేట జిల్లా వేదికగా సోమవారం ఆయన పార్లమెంట్‌ ఎన్నికల ప్రచార శంఖారావం పూరించారు. ఈ మేరకు క్రీడా మైదానంలో నిర్వహించిన జనజాతర సభలో ప్రజలనుద్దేశించి మాట్లాడారు. గ్రామాల్లో ఇందిరమ్మ కమిటీలను ఏర్పాటు చేసి పేదలను ఆదుకునే బాధ్యతను మీ చేతుల్లోనే పెడతామని.. నాగర్‌కర్నూల్‌, మహబూబ్‌నగర్‌ పార్లమెంట్‌ స్థానాలు గెలవాలని పిలుపునిచ్చారు. ‘నా పాలమూరులో తప్పు జరిగితే జాతీయ స్థాయిలో చెప్పుకునే పరిస్థితే ఉండదు.. మీరు అండగా ఉండి ఆశీర్వదిస్తే 14 అసెంబ్లీ స్థానాల్లో 12 గెలిచాం. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చామన్నారు. ‘నేను మీ బిడ్డను.. మీరు పెట్టిన చెట్టు వృక్షమైంది.. దాన్ని నరికేందుకు ఢిల్లీ నుంచి ఒకరు, ఫామ్‌హౌస్‌ నుంచి ఒకరు వస్తున్నారు. అంతా మీ చేతుల్లోనే ఉంది. మహబూబ్‌నగర్‌ పార్లమెంట్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి చల్లా వంశీచంద్‌రెడ్డిని లక్ష మెజార్టీతో గెలిపించాలి’ అని విజ్ఞప్తి చేశారు.

కాంగ్రెస్‌ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలి

నారాయణపేట జనజాతర సభలోముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి

విపక్షాలపై ఫైర్‌.. సెంటిమెంట్‌ అస్త్రం

Advertisement
Advertisement