సర్కారు బడులకు వెలుగులు | Sakshi
Sakshi News home page

సర్కారు బడులకు వెలుగులు

Published Sun, Apr 14 2024 1:30 AM

వట్టెం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల  - Sakshi

నాగర్‌కర్నూల్‌: ప్రభుత్వ పాఠశాలలకు త్వరలోనే విద్యుత్‌ బిల్లుల భారం తగ్గనుంది. ప్రస్తుతం పాఠశాలల నిర్వహణకు వచ్చే నిధుల్లో ఎక్కువ శాతం కరెంటు బిల్లులకే సరిపోతున్నాయి. ఈనేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలలకు ఉచితంగా విద్యుత్‌ అందించాలనే డిమాండ్‌ ఉన్నప్పటికీ.. గతంలో ఈ అంశాన్ని ఏ ప్రభుత్వం పరిశీలించలేదు. ఇటీవల ఉపాధ్యాయ సంఘాలు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో సమావేశమై ఈ అంశాన్ని తెరపైకి తెచ్చారు. దీంతో ప్రభుత్వ బడులకు ఉచితంగా విద్యుత్‌ అందించాలని.. అందుకు సంబంధించిన మార్గదర్శకాలను సిద్ధం చేయాలని సంబంధిత అధికారులను ప్రభుత్వం ఆదేశించింది.

జిల్లాలో 825 పాఠశాలలు..

జిల్లాలో మొత్తం 825 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా.. అందులో 131 ఉన్నత, 128 ప్రాథమికోన్నత, 566 ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి. గతంతో పోలిస్తే ప్రస్తుతం డిజిటల్‌ క్లాసుల నిర్వహణ, ప్రాజెక్టర్‌ వాడకం, కంప్యూటర్‌ ల్యాబ్‌ల వినియోగం వంటి వాటితో కరెంటు బిల్లులు విపరీతంగా పెరిగిపోయాయి. మరికొన్ని పాఠశాలల్లో విద్యార్థుల తాగునీటి కోసం బోరుమోటార్లను వినియోగిస్తున్నారు. ప్రాథమిక పాఠశాలల పరిస్థితి అటుంచితే.. ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలకు సంబంధించి రూ.వెయ్యి నుంచి రూ. 5వేల వరకు కరెంటు బిల్లులు వస్తున్నట్లు ప్రధానోపాధ్యాయులు చెబుతున్నారు. ఈబిల్లులను చెల్లించేందుకు నానా తంటాలు పడాల్సి వస్తోంది. ఉచిత విద్యుత్‌ అమలుచేస్తే, జిల్లాలోని 825 ప్రభుత్వ పాఠశాలలకు మేలు చేకూరనుంది.

రూ.1.27 కోట్ల విద్యుత్‌ బిల్లులు పెండింగ్‌..

పాఠశాలల వారీగా పెండింగ్‌లో ఉన్న విద్యుత్‌ బిల్లుల వివరాలను ఇప్పటికే సంబంధిత అధికారులు సేకరించారు. జిల్లావ్యాప్తంగా రూ. 1.27 కోట్ల విద్యుత్‌ బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని సమాచారం. అయితే పాఠశాలలకు ఉచిత విద్యుత్‌ సౌకర్యం కల్పనపై ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు రావాల్సి ఉంది. కాగా, పాఠశాలలకు ఉచితంగా విద్యుత్‌ అందిస్తే.. పెండింగ్‌ బిల్లుల పరిస్థితి ఏంటనే దానిపై స్పష్టత కరువైంది. ఈనెలలో పాఠశాలలకు వేసవి సెలవులు ప్రారంభం కానుండటం.. పాఠశాలలు పునఃప్రారంభమయ్యే నాటికి మార్గదర్శకాలను సిద్ధంచేసి, ఉచిత విద్యుత్‌ అందించే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఉచితంగా విద్యుత్‌ అందించాలని ప్రభుత్వ నిర్ణయం

పాఠశాలలకు తప్పనున్న

కరెంటు కష్టాలు

ఇప్పటికే పెండింగ్‌ బిల్లుల

వివరాల సేకరణ

మార్గదర్శకాలు రావాల్సి ఉంది..

ప్రభుత్వ పాఠశాలలకు ఉచితంగా విద్యుత్‌ అందించాలని నిర్ణయం తీసుకోవడం హర్షించదగ్గ విషయం. ఈపథకం అమలుకు సంబంఽధించి ఇంకా మార్గదర్శకాలు రాలేదు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జిల్లాలో పాఠశాలల వారీగా పెండింగ్‌ బిల్లుల వివరాలను అందజేశాం. తదుపరి ఆదేశాలు వస్తే, వాటిని అమలుచేస్తాం.

– గోవిందరాజులు, డీఈఓ

1/1

Advertisement
Advertisement