వైభవంగా ధ్వజారోహణం | Sakshi
Sakshi News home page

వైభవంగా ధ్వజారోహణం

Published Mon, Mar 25 2024 12:55 AM

అలివేలుమంగమ్మ ఆలయంలో ధ్వజారోహణం నిర్వహిస్తున్న చైర్మన్‌ మధుసూదన్‌కుమార్‌  - Sakshi

మహబూబ్‌నగర్‌ రూరల్‌: మన్యంకొండ శ్రీఅలివేలు మంగతాయారు బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం ధ్వజారోహణం కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముందుగా దేవస్థానం సమీపంలో ఉన్న పుట్ట వద్ద ప్రత్యేక పూజలు చేసి ఆ మట్టిని తీసుకువచ్చి దేవస్థానం పక్కనున్న మండపంలో సంప్రదాయబద్ధంగా పురోహితుల వేదమంత్రాల మధ్య హోమం జరిపించారు. అనంతరం దేవస్థానం ముందున్న ధ్వజస్తంభానికి ప్రత్యేక పూజలు చేసి ధ్వజారోహణ, అలాగే అమ్మవారి సన్నిధిలో దేవతాహ్వానం, బలిహరణం, ఎదుర్కోలు తదితర పూజలు చేశారు.

ఘనంగా తిరుచ్చిసేవ..

ఉత్సవాల్లో భాగంగా దేవస్థానంలో ఆదివారం రాత్రి తిరుచ్చి సేవ నిర్వహించారు. శోభాయమానంగా అలంకరించిన అమ్మవారిని గర్భగుడి నుంచి దేవస్థానం ముందున్న మంటపం వరకు ఊరేగింపుగా తీసుకొచ్చారు. సన్నాయి వాయిద్యాలు, పురోహితుల వేదమంత్రాల మధ్య సేవ ముందుకు కదిలింది. భక్తుల హరినామస్మరణతో సేవా ప్రాంతం మారుమోగింది. వివిధ రకాల పూలు, బంగారు ఆభరణాల అలంకరణలో అమ్మవారు సేవలో దేవస్థానం పరిసరాల్లో ఊరేగుతూ భక్తకోటికి దర్శనమిచ్చారు. కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్‌ అళహరి మధుసూదన్‌కుమార్‌, ఈఓ శ్రీనివాసరాజు, సూపరింటెండెంట్‌ నిత్యానందచారి, ఉత్సవ కమిటీ సభ్యులు, అర్చకులు పాల్గొన్నారు.

● మన్యంకొండ శ్రీఅలివేలు మంగతాయారు ఉత్సవాల్లో భాగంగా సోమవారం ప్రధాన ఘట్టమైన తిరుకల్యాణ మహోత్సవం నిర్వహించనున్నారు. ప్రతి ఏడాది హోలి పండుగ రోజు ఉత్సవాన్ని అత్యంత ఘనంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. అందులో భాగంగానే ఈ ఏడాది కూడా దేవస్థానం వద్ద తిరుకల్యాణ మహోత్సవానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కార్యక్రమానికి ఉమ్మడి జిల్లా నలుమూలల నుంచి వేలాది మంది భక్తులు తరలిరానున్నారు.

అలంకరణలో అమ్మవారు
1/1

అలంకరణలో అమ్మవారు

Advertisement
Advertisement