విజయ్‌ ఆంటోనీ 'మార్గన్‌' రివ్యూ.. క్రైమ్‌ థ్రిల్లర్‌తో మెప్పించాడా? | Vijay Antony Maargan Movie Review And RATING | Sakshi
Sakshi News home page

Maargan Movie Review: విజయ్‌ ఆంటోనీ 'మార్గన్‌' రివ్యూ.. క్రైమ్‌ థ్రిల్లర్‌తో మెప్పించాడా?

Jun 27 2025 7:16 PM | Updated on Jun 27 2025 7:48 PM

Vijay Antony Maargan Movie Review And RATING

కోలీవుడ్‌ మల్టీ టాలెంటెడ్‌ హీరో విజయ్ ఆంటోని కొత్త సినిమా 'మార్గన్‌' జూన్‌ 27న విడుదలైంది. చిత్రపరిశ్రమలో విజయ్‌ ఆటోనికి ప్రత్యేకమైన ఫ్యాన్‌ బేస్‌ ఉంది. ఆయన హీరో మాత్రమే కాదు..  దర్శకుడిగా, నిర్మాతగా, మ్యూజిక్ డైరెక్టర్‌గా, ఎడిటర్‌గా ఇలా మల్టీ టాలెంట్‌ను ప్రదర్శిస్తూ ఉంటారు. అయితే, ఈ సారి నిర్మాతగా, హీరోగా, మ్యూజిక్ డైరెక్టర్‌గా ‘మార్గన్’ అనే చిత్రంతో తమిళ, తెలుగు భాషల్లో ఒకేసారి  ఆడియెన్స్ ముందుకు వచ్చారు. ఈ మూవీకి లియో జాన్ పాల్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం.

కథ
నగరంలో రమ్య అనే యువతి దారుణ హత్యకు గురవుతుంది.  ఓ ఇంజక్షన్ ద్వారా ఆమెను హత్య చేస్తారు. ఆమె శరీరమంతా కాలిపోయినట్లుగా నలుపు రంగులోకి మారి ఉన్న ఆమె మృతదేహాన్ని ఓ చెత్త కుప్పలో కనుగొంటారు. సంచలనంగా మారిన ఆ కేసును చేధించేందుకు  పోలీస్ ఆఫీసర్‌ ధృవ (విజయ్ ఆంటోనీ) రంగలోకి దిగుతాడు. సుమారు పదేళ్ల క్రితం తన కూతురు కూడా ఇదే రీతిలో హత్యకు గురికావడంతో ఈ కేసును ఎలాగైనా పూర్తి చేయాలని ధృవ  వ్యక్తిగతంగా తీసుకుంటాడు. తన కూతురిలా ఇంకెవ్వరూ బలి కావొద్దని అనుకుంటాడు. హత్యకు సంబంధించిన చిన్న చిన్న ఆధారాల సాయంతో డి.అరవింద్‌ (అజయ్‌ దిశాన్‌) అనే కుర్రాడిని అదుపులోకి తీసుకొని విచారణ ప్రారంభిస్తాడు. 

కానీ, అరవింద్ వింత ప్రవర్తన, అతీంద్రయ శక్తికి ధృవ ఆశ్చర్యపోతాడు. ఈ క్రమంలో అమ్మాయిల హత్యలకు సంబంధించి కొన్ని అనూహ్యమైన విషయాలను ధృవ తెలుసుకుంటాడు. ఈ హత్యలకు ఆరవింద్‌కు సంబంధం ఉందా.  ధృవ కూతురిని చంపింది ఎవరు..? ఈ కేసును పరిష్కరించే క్రమంలో అఖిల, శ్రుతి (బ్రిగిడా), రమ్య (దీప్శిఖ), వెన్నెల, మేఘల పాత్ర ఏంటి..? ఫైనల్‌గా హంతకుడు ఎలా దొరికాడు..? అనేది తెలియాలంటే మార్గాన్‌ సినిమా చూడాల్సిందే.

ఎలా ఉందంటే..
మార్గన్ కథ మనం గతంలో చూసిన క్రైమ్‌ థ్రిల్లర్‌ స్టోరీలానే ఉంటుంది. అంతా ఒకే ఫార్మాట్‌లోనే సాగుతుంది. హత్యల చేస్తున్న వ్యక్తి అందరిముందు శ్వేచ్ఛగా తిరుగుతూనే ఉంటాడు. కానీ, అతనే హత్య చేశాడని చివరివరకు రివీల్‌ కాదు. ఇదే పంతాలో మార్గన్‌ స్టోరీ ఉంది. రమ్య హత్య ఎపిసోడ్‌తో కథలో ఎంతమేకు సీరియస్‌నెస్ ఉందో దర్శకుడు క్లారిటీ ఇచ్చేశాడు. యువతి  హత్య కేసును చేధించేందుకు వచ్చిన ధృవ వెంటనే అరవింద్‌ను అదుపులోకి తీసుకుని విచారించడంతో ఇంత సులువుగా ఇన్వెస్టిగేషన్ మొదలు అయిందా అనే ఫీలింగ్‌ వస్తుంది.

రెగ్యులర్ ఫార్మాట్‌లో సాగే సస్పెన్స్, క్రైమ్, థ్రిల్లర్ కాదని సినిమా ప్రమోషన్స్‌లో మేకర్స్‌ చెప్పారు. కానీ, సినిమా చూస్తే మాత్రం అలా అనిపించకపోవచ్చు. ఇందులో ఎక్కువ టైం తీసుకోకుండా నేరుగా పాయింట్‌లోకి వెళ్లాడు. సోది అనేది లేకుండా డైరెక్ట్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అవుతుంది. అయితే ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఆడియెన్స్‌ అనుమాన పడేలా అరవింద్ క్యారెక్టర్‌ను చూపిస్తారు. ఇంటర్వెల్ వరకు అందరూ కూడా అరవింద్ మీదే ఫోకస్ పెడతారు. అప్పటిదాకా నగరంలో జరిగిన హత్యలతో అరవింద్‌కు సంబంధం ఉన్నట్లు సినిమా చూసే వారికి అనిపిస్తుంది. మళ్లీ కాదేమో అనిపిస్తుంది. ఇలా ఇంటర్వెల్‌కు వచ్చేసరికి దీనిపై అటు హీరోకీ ఇటు ప్రేక్షకులకూ ఓ స్పష్టత వచ్చేస్తుంది. అక్కడి నుంచి సెకండాఫ్‌ మరింత ఆసక్తిని రెట్టింపు చేస్తుంది.

సెకండాఫ్‌లో హీరో ఇన్వెస్టిగేషన్‌ ప్రాసెస్‌ వేగం అందుకుంటుంది. కానీ, కథలో వేగం తగ్గుతుంది. కానీ ఇలాంటి జానర్‌లో వచ్చే చిత్రాలకు ఓ ఫార్మూలా ఉంటుంది. ఎవరి మీద అయితే అనుమానపడతామో.. వాళ్లు అసలు హంతకులు కాదు. ఎవరిని అయితే మనం పట్టించుకోకుండా లైట్ తీసుకుంటామో వాళ్లే చివరకు షాకింగ్‌గా సర్ ప్రైజ్ ఇస్తారు. అలా ఇందులోనూ ట్విస్ట్ ఇస్తారు. దాదాపు హంతకులు ఎవరన్నది ఆడియెన్స్ ఊహించలేరు. ఫస్ట్ హాఫ్ అంతా అరవింద్ పాత్ర చుట్టూనే కథ తిరుగుతుంది. ఇక సెకండాఫ్‌లో ఆ పాత్ర చేసే విన్యాసాలు, ఇన్వెస్టిగేషన్‌లో చేసే సహాయం బాగుంటుంది.  క్లైమాక్స్‌ సమయంలో దర్శకుడు కాస్త సాగదీశాడేమో అనిపిస్తుంది. సైకో కిల్లర్‌ ఎవరన్నది ప్రేక్షకులకు క్లారిటీ వచ్చినా.. అతను అలా చేయడానికి  కారణం ఏమంత కొత్తగా అనిపించదు. అయితే, రెండు గంటల సేపు ఎంగేజింగ్‌గా తీయడంతో జాన్ పాల్ సక్సెస్ అయ్యాడని చెప్పుకోవచ్చు. నిడివి తక్కువగా ఉండటం కలిసి వచ్చే అంశం.

ఎవరెలా చేశారంటే..
'మార్గన్‌' సినిమాకు విజయ్ ఆంటోనీ ప్రధాన బలం. ఈ చిత్రానికి తెరపై, తెర వెనుక హీరో అని చెప్పుకోవచ్చు. ప్రొడక్షన్ వ్యాల్యూస్, మ్యూజిక్ డిపార్ట్మెంట్ ఇలా అన్నింటినీ హ్యాండిల్ చేశారు. పోలీస్‌ పాత్రకు తగ్గట్లు  సీరియస్‌గా ఒకే లుక్‌లో ఆయన కనిపించారు. ఆర్ఆర్ అయితే ఇంటెన్స్‌గా అనిపిస్తుంది. అజయ్‌ దిశాన్‌ పాత్ర కథకు చాలా కొత్తగా ఉంటుంది. సినిమా ఆరంభంలో సైకో కిల్లర్‌లా అదరగొట్టిన ఆయన సెకండాఫ్‌ వచ్చేసరికి  సూపర్‌ హీరోలా అలరించాడు.  తన యాక్టింగ్‌తో అందరినీ సర్ ప్రైజ్ చేశాడని చెప్పవచ్చు. ఇతను విలనా..? సపోర్టింగ్ యాక్టరా..? హీరోనా..? అన్న రేంజ్‌లో పర్ఫామెన్స్ ఇస్తాడు. బ్రిగిడ పాత్రకు అంత స్కోప్ దక్కలేదు.  వెన్నెల, మేఘ పాత్రధారి నటన బాగుంటుంది. మిగిలిన ఇతర పాత్రల్లో అందరూ తమ పరిధి మేరకు మెప్పించారు. ఓటీటీలో రెగ్యులర్‌గా ఇలాంటి క్రైమ్, సస్పెన్స్, థ్రిల్లర్ చూసే వాళ్లకి మార్గన్ గొప్ప చిత్రంగా అనిపించకపోవచ్చు. కానీ మార్గన్ మూవీ ఆడియెన్స్‌ని నిరాశ పర్చకపోవచ్చు. దర్శకుడు కథను ముగించిన తీరు అందరికీ సంతృప్తినివ్వదని చెప్పవచ్చు. 

Rating:
Advertisement
 
Advertisement
Advertisement