
సంక్రాంతి బాక్సాఫీస్ బరిలో నిలిచారు రవితేజ. ఆయన హీరోగా కిశోర్ తిరుమల దర్శకత్వంలో ఓ కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మూవీ తెరకెక్కనుంది. ఎస్‌ఎల్‌వీ సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమా ముహూర్తపు వేడుకతో గురువారం ప్రారంభమైంది.
ఈ నెల 16న రెగ్యులర్ షూటింగ్‌ని హైదరాబాద్‌లో ప్రారంభిస్తామని, రవితేజ కెరీర్‌లోని ఈ 76వ సినిమాను వచ్చే సంక్రాంతి పండగ సందర్భంగా విడుదల చేస్తామని మేకర్స్ తెలిపారు. అలాగే ఫ్లయిట్‌లో రవితేజ స్టైలిష్‌గా కూర్చుని, ఒక చేతిలో ‘సీ ఇట్ సే ఇన్ స్పానిష్’ పుస్తకం పట్టుకున్నపోస్టర్‌ని విడుదల చేశారు. ‘‘రవితేజగారి సిగ్నేచర్ స్టైల్, ఎనర్జీ ఈ సినిమాలోనూ కనిపిస్తాయి. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే కథతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాం’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ సినిమాకు సంగీతం: భీమ్స్ సిసిరోలియో.