– నరేశ్ విజయకృష్ణ
‘‘క్రేజీ కళ్యాణం’ సినిమా వినోదం, భావోద్వేగాలతో సాగే మంచి కుటుంబ కథా చిత్రం. ఇలాంటి చిత్రాన్ని నిర్మించాలంటే ఎంతో ప్యాషనేట్ ప్రొడ్యూసర్ కావాలి. ఈ సినిమా బడ్జెట్ అనుకున్నదానికంటే ఎక్కువ అయినప్పటికీ ఎక్కడా రాజీ పడకుండా నిర్మించారు బూసం జగన్ మోహన్ రెడ్డి. ఆయనలాంటి నిర్మాతలు ఇండస్ట్రీకి రావాల్సిన అవసరం ఉంది’’ అని నటుడు నరేశ్ విజయకృష్ణ తెలిపారు. అనుపమ పరమేశ్వరన్, తరుణ్ భాస్కర్, నరేశ్ విజయకృష్ణ, అఖిల్ ఉడ్డెమారి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘క్రేజీ కళ్యాణం’.
భద్రప్ప గాజుల దర్శకత్వంలో యారో సినిమాస్ బ్యానర్‌పై బూసం జగన్ మోహన్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 16న రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా నరేశ్ విజయకృష్ణ మాట్లాడుతూ–‘‘నిజాయతీగా ఒక ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ చేస్తే తప్పకుండా ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. ‘సింగీతం, మా ఇంటి బంగారం, ఇరుముడి’ లాంటి సినిమాలే ఇందుకు నిదర్శనం. అదే క్రమంలో మా ‘క్రేజీ కళ్యాణం’ సినిమా ఉంటుంది. ఈ చిత్రంలో 6 నిమిషాల లెంగ్తీ సీన్‌ని సింగిల్ టేక్‌లో చేశాను. అందుకే ఈ సినిమాలో తొలిసారి నా పేరు ముందు ‘నవరసరాయ’ అనే బిరుదును వాడుతున్నాం’’ అని పేర్కొన్నారు.


