హైదరాబాద్‌లో మిస్‌వరల్డ్‌ పోటీలు.. బ్యూటీక్వీన్స్‌పై టాలీవుడ్‌ ప్రముఖుల కన్ను | Miss World Event In Hyderabad Now Tollywood Makers Big Plan | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లో మిస్‌వరల్డ్‌ పోటీలు.. బ్యూటీక్వీన్స్‌పై టాలీవుడ్‌ ప్రముఖుల కన్ను

May 4 2025 2:08 PM | Updated on May 7 2025 4:33 PM

Miss World Event In Hyderabad Now Tollywood Makers Big Plan

మూడవసారి మన భారతదేశం అతిపెద్ద అందాల పోటీకి ఆతిధ్యం ఇవ్వనుంది. అది కూడా తెలుగు రాష్ట్రాలకు తలమానికమైన హైదరాబాద్‌ నగరంలో ఈ ప్రపంచ స్థాయి బ్యూటీ కాంటెస్ట్‌ జరుగనుంది. ప్రస్తుతం ఈ కార్యక్రమంపైనే  విశ్వవ్యాప్త గ్లామర్‌ రంగం దృష్టి పెట్టింది. ఇప్పటికే ఈ గ్లోబల్‌ ఈవెంట్‌ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్‌ రూపురేఖలే మార్చే స్థాయిలో ఏర్పాట్లు షురూ చేసింది. మరో 3 రోజుల్లో ప్రపంచవ్యాప్త అందాలన్నీ రాశులు పోసినట్లుగా హైదరాబాద్‌ నగరంలో కొలువుదీరనున్నాయి. ఒకటీ రెండు రోజులు కాదు ఏకంగా నెల రోజుల పాటు నగరంలోనే తిష్టవేయనున్నాయి. దాదాపుగా 120 దేశాలకు చెందిన అందగత్తెలు ఈ పోటీలో తమ దేశాల తరపున బ్యూటీ ఫైట్‌కి సై అంటున్నారు. 

ఈ నేపధ్యంలో హాలీవుడ్, బాలీవుడ్‌ సహా అన్ని వుడ్‌లూ తమ కెమెరాకు తగ్గ ఫుడ్‌ కోసం వేటను షురూ చేసేశాయి. బాలీవుడ్‌కు చెందిన పలు ప్రముఖ నిర్మాణ సంస్థలు ఈ పోటీల్లో పాల్గొంటున్న సుందరీ మణుల గ్లామర్, ఇతరత్రా టాలెంట్స్‌ను సమీక్షించి వారిపై నివేదికలు అందించేందుకు తగినంత మందీ మార్బలాన్ని పురమాయించినట్టు సమాచారం. తద్వారా వారిలో తమ భవిష్యత్తు తారలను ఎంచుకునే అవకాశాలను అన్వేషిస్తున్నారట. అదే విధంగా అంతర్జాతీయ చిత్రాలను అందించడంలో బాలీవుడ్‌ సినిమాలతో పోటీపడుతున్న టాలీవుడ్‌ సైతం ఇదే బాట పట్టినట్టు తెలుస్తోంది. తెలుగునాట రూ.వందల కోట్లతో సినిమాలు తీయడం ప్రస్తుతం సర్వసాధారణమైపోయింది.  కొత్త కొత్త మార్కెట్లను పసిగట్టడం వాటిలోకి దూసుకువెళ్లడం కూడా  కనిపిస్తోంది. 

ఏతావాతా తెలుగు సినిమాలు ఇప్పుడు దక్షిణాదిని దాటేసి ఉత్తరాదిని చుట్టేసి, అమెరికా. చైనాలను కూడా కలిపేసుకుని... జపాన్, జర్మీనీ, బంగ్లాదేశ్‌ అంటూ హద్దులన్నీ చెరిపేసి.. కాదేదేశమూ కలెక్షన్లకు అనర్హం అన్నట్టుగా దూసుకెళ్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. అందుకే ఈ మిస్‌ వరల్డ్‌ పోటీలు టాలీవుడ్‌కి కూడా ముఖ్యమైన టాపిక్‌గా మారాయి.  టైటిల్‌ విన్నర్‌ని అలా ఉంచితే... వీరిలో విభిన్న రకాల టైటిల్స్‌ను గెలుచుకునే అందగత్తెలు కూడా ఉంటారు. అలాగే అత్యంత అందమైన అమ్మాయి మాత్రమే మిస్‌ వరల్డ్‌ కావాలి అని రూలేం లేదు. టైటిల్‌ గెలుపులో అందంతో పాటు మరెన్నో అంశాలు ప్రాధాన్యత దక్కించుకుంటాయి. కాబట్టి టైటిల్‌ వేటలో వెనుకబడినా అందంలో అద్భుతం అనిపించే వారూ మరికొందరు కనిపిస్తారు. 

అలాంటి గ్లామరస్‌ బ్యూటీస్‌తో ఒప్పందాలు కుదుర్చుకుంటే తమ  ఇంటర్నేషనల్‌ మూవీస్‌కి ప్లస్‌ అవుతారని కొందరు టాలీవుడ్‌ పెద్దలు భావిస్తున్నారట. మరోవైపు ఇప్పటికే టాలీవుడ్‌  టాక్‌ ఆఫ్‌ ది వరల్డ్‌ అయిపోయింది దాంతో... పలువురు విదేశీ గ్లామర్‌ క్వీన్స్‌ సైతం సినిమా ఆకాంక్షల్ని వెంటబెట్టుకుని మన దేశానికి రావడంలో వింతేమీ ఉండదు. కాబట్టి... వారూ తమ టీమ్‌తో కలిసి తమ వంతు ప్రయత్నాలు చేయరని చెప్పలేం. మొత్తం మీద... తొలిసారి తెలుగు నాట జరుగుతున్న ఈ మిస్‌ వరల్డ్‌ పోటీలో టైటిల్‌ విజేతలు మాత్రమే కాదు వెండి తెరపై టైటిల్స్‌లో చోటు చేసుకునే విన్నర్స్‌ కూడా తేలనున్నారు.  ఎవరో  తెలియాలంటే.. మరో నెల రోజులు ఆగాల్సిందే.

Advertisement
 
Advertisement
Advertisement