ఆన్‌లైన్‌ జూదం.. జీవితాలు ఆగం | - | Sakshi
Sakshi News home page

ఆన్‌లైన్‌ జూదం.. జీవితాలు ఆగం

Jul 2 2025 6:51 AM | Updated on Jul 2 2025 7:22 AM

ఆన్‌ల

ఆన్‌లైన్‌ జూదం.. జీవితాలు ఆగం

● యువత జీవితాలపై మాయాజాలం ● గేమింగ్‌ ముసుగులో రమ్మీ ఉచ్చు.. ● టైమ్‌ పాస్‌తో మొదలై అప్పుల ఊబిలోకి ● ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్న యువత

మంచిర్యాలక్రైం: జిల్లాలో ఆన్‌లైన్‌ రమ్మీ గేమింగ్‌ యాప్‌ల సంస్కృతి పెరుగుతోంది. యువత జీవితా లపై బలమైన దాడి చేస్తున్నాయి. గేమింగ్‌ ముసుగులో ఆన్‌లైన్‌ జూదపు బానిసత్వం విస్తృతంగా వ్యాపిస్తోంది. ఫలితంగా అనేక మంది ఈ ఉచ్చులో చిక్కుకుని అప్పులు మూట గట్టుకుంటున్నారు. వాటిని తీర్చలేక చివరికి ప్రాణాలు తీసుకుంటున్నారు. ప్రధానంగా ప్రముఖ పట్టణ ప్రాంతాలతో పాటు పల్లెల్లో సైతం ఆన్‌లైన్‌ జూదం పెరిగింది. రమ్మీ కల్చర్‌, ఏ23 రమ్మీ, వెల్త్‌ రమ్మీ, జంగిల్‌ రమ్మీ వంటి యాప్‌లు టాప్‌–డౌన్‌లేడెడ్‌గా ఉన్నాయి. టెలిగ్రామ్‌ చానల్స్‌ ద్వారా 100 శాతం గెలుపు ట్రిక్స్‌ మీకు మద్దతు అందించే రమ్మీ టీచర్స్‌ తదితర పేర్లతో ఇన్‌ఫ్లూయెన్సర్లు మోసం చేస్తూనే ఉన్నారు.

అందరూ టార్గెటే...

యూత్‌ నుంచి గృహిణుల వరకు అన్నివర్గాలను ఈ రమ్మీ యాప్‌లు టార్గెట్‌ చేస్తూ విస్తరిస్తున్నాయి. బీటెక్‌, డిగ్రీ, ఇంటర్‌ విద్యార్థులు.. ఇలా అనేకమంది ఆకర్షితులవుతున్నారు. ముఖ్యంగా ప్రధాన పట్టణాల పరిధి విద్యాసంస్థల్లో చదివేవారు, ప్రభుత్వ, ప్రైవేటు అధ్యాపకులు, ఉద్యోగులు ఆర్థిక ఒత్తిడిలో ఉన్నవారు. టైమ్‌పాస్‌గా మొదలు పెట్టి ఆతర్వాత ఆర్థిక నష్టాల్లో కూరుకుపోతున్నారు. వారం రోజుల క్రితం జిల్లాలోని ఓ ప్రభుత్వ శాఖలో పనిచేసే చిరుద్యోగి ఆన్‌లైన్‌ రమ్మీ గేమ్‌ ఆడి సుమారు రూ.40లక్షల వరకు పోగొట్టుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

మోసం ఎలా జరుగుతోందంటే...

మొదటి మూడు గేములు గెలిచేలా ఈ యాప్‌లను రూపొందించి నమ్మకం కలిగిస్తారు. ఆ తర్వాత చివరికి ‘ఆటోబాట్‌’ వాడడం వల్ల యూజర్‌ గెలిచే అవకాశం కనీస స్థాయికి దిగిపోతోంది. యూజర్‌ నెగ్గడం పక్కన పెడితే... ఒక వేళ గెలిచినా ఆ డబ్బును దక్కించులేక పోతున్నారు. అంతేకాకుండా గెలుచుకున్న డబ్బును విత్‌ డ్రా చేసుకోవడంలో ఆలస్యం జరిగితే పూర్తిగా నిలిపివేస్తున్నట్లు పలువురు బాధితులు పేర్కొంటున్నారు. గేమ్‌లోకి స్నేహితులను లాగితే ఒకరికి రూ.100 బోనస్‌ అంటూ రెఫరల్‌ మాయాజాలంతో పాటు అనేక రకాలుగా వల వేస్తున్నట్లు తెలుస్తోంది.

హెల్ప్‌డెస్క్‌ ఉన్నా ఫలితం శూన్యం

తెలంగాణ వ్యాప్తంగా సైబర్‌ సెల్‌ గేమింగ్‌ యాప్‌ మోసాలపై, సైబర్‌ మోసాలపై పోలీస్‌ శాఖ స్పెషల్‌ హెల్ప్‌లైన్‌ 1930 ప్రారంభించింది. కానీ గేమింగ్‌ యాప్‌లపై పోలీస్‌ శాఖ అవగాహన కార్యక్రమాలు నిర్వహించడంలో విఫలమయ్యారనే ఆరోపణలు ఉన్నాయి. అయితే ఆన్‌లైన్‌ యాప్‌లు విదేశి సంస్థల ఆధీనంలో ఉండడం వల్ల వాటిపై నేరుగా చర్య తీసుకోవడం కష్టంగా ఉందని పోలీస్‌ వర్గాలు చెబుతున్నాయి. దీంతో గేమ్‌ యాప్‌లు వినియోగించే వారు ఎక్కువవుతున్నారని ఓ పోలీస్‌ అధికారి ఆవేదన వ్యక్తం చేయడం గమనార్హం.

భవిష్యత్‌ నాశనం చేసుకోవద్దు

ప్రభుత్వం నిషేధించిన ఆన్‌లైన్‌ గేమ్స్‌ ఆడటం చట్టరీత్యా నేరం. నిర్వాహకులు, ఆడిన వారిపై చర్యలు ఉంటాయి. యువత ఆన్‌లైన్‌ గేమ్స్‌ ఆడటం సరికాదు. తల్లిదండ్రులు తమ పిల్లలు ఏం చేస్తున్నారో గమనిస్తూ ఉండాలి. ఆన్‌లైన్‌ ఆటలకు బానిస కావొద్దు. బంగారు భవిష్యత్‌ను నాశనం చేసుకోవద్దు.

– ఎగ్గడి భాస్కర్‌, డీసీపీ, మంచిర్యాల

ఆన్‌లైన్‌ జూదం.. జీవితాలు ఆగం 1
1/1

ఆన్‌లైన్‌ జూదం.. జీవితాలు ఆగం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement