ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించండి | Sakshi
Sakshi News home page

ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించండి

Published Fri, Mar 29 2024 12:30 AM

సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ గౌతమ్‌ - Sakshi

● జిల్లాలో 151 కేంద్రాల ఏర్పాటుకు ప్రణాళిక ● అధికారులతో సమీక్షలో కలెక్టర్‌ గౌతమ్‌

ఖమ్మం సహకారనగర్‌: యాసంగి ధాన్యం కొనుగోళ్లకు వచ్చేనెల 1వ తేదీలోగా కేంద్రాలను ప్రారంభించాలని కలెక్టర్‌ వీ.పీ.గౌతమ్‌ సూచించారు. కలెక్టరేట్‌లో అధికారులతో సమావేశమైన ఆయన మాట్లాడుతూ జిల్లాలో 151 కేంద్రాలు ఏర్పాటుచేయనున్నట్లు తెలిపారు. ఇందులో ఐకేపీ ద్వారా 28, పీఏసీఎస్‌ల ద్వారా 96, డీసీఎంఎస్‌ ద్వారా 27 కేంద్రాలు ఉంటాయని, వచ్చేనెల 1నుండి కేంద్రాలన్నీ అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. ఆయా కేంద్రాలకు 1,71,357 మెట్రిక్‌ టన్నుల ధాన్యం వస్తుందని అంచనా ఉండగా, రైతులకు నీడ, తాగునీటి వసతి కల్పించడంతో పాటు గన్నీ బ్యాగులు, తూకం, తేమ యంత్రాలు, ప్యాడీ క్లీనర్లు సిద్ధం చేయాలని తెలిపారు. ఆపై ధాన్యం రవాణాకు కాంట్రాక్టర్లను ఎంపిక చేయాలని కలెక్టర్‌ పేర్కొన్నారు.

ప్రభుత్వ స్థలాలు పరిరక్షించండి

ప్రభుత్వ స్థలాల పరిరక్షణకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ గౌతమ్‌ సూచించారు. కలెక్టరేట్‌లో గురువారం భూరక్షణా బృందాలతో ప్రభుత్వ స్థలాల పరిరక్షణపై సమీక్షించిన ఆయన మాట్లాడుతూ విలువైన ప్రభుత్వ స్థలాలు అన్యాక్రాంతం కాకుండా పర్యవేక్షించాలని తెలిపారు. ప్రభుత్వ స్థలాల జాబితా ఆధారంగా తీసుకున్న చర్యలపై భూరక్షణా బృందాలు నివేదిక ఇవ్వాలన్నారు. జీఓ 59 ద్వారా క్రమబద్ధీకరణ కోసం అందిన దరఖాస్తుల్లో తిరస్కరణకు గురైన చోట స్థలాలు స్వాధీనం చేసుకోవాలని, వైఎస్సార్‌ కాలనీ, పువ్వాడ ఉదయ్‌నగర్‌లోని ఖాళీ ప్లాట్లతో పాటు టేకులపల్లి డబల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల సముదాయంలో లబ్ధిదారులు నివాసం లేని గృహాలను గుర్తించాలని సూచించారు. ఈ సమావేశాల్లో అదనపు కలెక్టర్‌ డి.మధుసూదన్‌నాయక్‌, బి.సత్యప్రసాద్‌, డి.మధుసూదన్‌నాయక్‌, కేఎంసీ కమిషనర్‌ ఆదర్శ్‌ సురభి, అసిస్టెంట్‌ కలెక్టర్లు మయాంక్‌సింగ్‌, యువరాజ్‌తో పాటు వివిధ శాఖల అధికారులు విజయనిర్మల, చందన్‌కుమార్‌, శ్రీలత, అలీం, మురళీధర్‌రావు, సన్యాసయ్య, ఆఫ్రిన్‌, సునీత, జి.గణేష్‌, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

పకడ్బందీగా పోస్టల్‌ బ్యాలెట్‌

ఖమ్మం సహకారనగర్‌: లోక్‌సభ ఎన్నికల సందర్భంగా పోస్టల్‌ బ్యాలెట్‌ ప్రక్రియ పకడ్బందీగా చేపట్టాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ వీ.పీ.గౌతమ్‌ ఆదేశించారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన మాస్టర్‌ ట్రెయినీల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల విధులు నిర్వర్తించే ఉద్యోగులు తప్పనిసరిగా పోస్టల్‌ బ్యాలెట్‌ వినియోగించుకోవాలన్నారు. ఇందుకోసం మే 6వ తేదీలోగా దరఖాస్తు చేసుకునేలా పర్యవేక్షించే బాధ్యత కార్యాలయ అధికారులు తీసుకోవాలన్నారు. ఈసమావేశంలో అదనపు కలెక్టర్లు బి.సత్యప్రసాద్‌, డి.మధుసూదన్‌నాయక్‌, అసిస్టెంట్‌ కలెక్టర్లు మయాంక్‌సింగ్‌, యువరాజ్‌, డీఆర్వో రాజేశ్వరి, ఖమ్మం, కొత్తగూడెం ఆర్‌డీఓలు గణేష్‌, మధు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement