మహదేశ్వరునికి రూ. 3 కోట్ల ఆదాయం | Sakshi
Sakshi News home page

మహదేశ్వరునికి రూ. 3 కోట్ల ఆదాయం

Published Thu, Mar 28 2024 12:35 AM

-

మైసూరు: చామరాజనగర జిల్లా హనూరు తాలూకాలోని ప్రసిద్ధ యాత్ర స్థలం మలేమహదేశ్వర బెట్ట దేవస్థానం నెలవారీ హుండీల లెక్కింపును చేపట్టారు. 25 రోజుల్లో మొత్తం రూ. 3.13 కోట్ల నగదును కానుకగా భక్తులు సమర్పించుకున్నారు. బెట్ట ప్రాధికార కార్యదర్శి ఏఈ రఘు, వందలాది మంది సిబ్బంది హుండీల లెక్కింపు నిర్వహించారు. మహాశివరాత్రి, వరుస సెలవు దినాలు కావడంతో శ్రీక్షేత్రానికి లక్షలాది మంది భక్తులు తరలివచ్చి హుండీలో కానుకలు వేశారు. హుండీలో రూ. 3,13,00,913 నగదు, 47 గ్రాముల బంగారం, 2.3 కేజీల వెండి సొత్తు లభించాయి. రద్దయిన రూ. 2 వేల నోట్లు కొన్ని, బంగ్లాదేశ్‌, నేపాల్‌, మలేసియా దేశాలకు చెందిన ఏడు నోట్లు ఉన్నాయి.

బీజేపీ సభల్లో దొంగల జోరు

నేతల పర్సులు చోరీ

మైసూరు: బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు బీవై విజయేంద్ర బుధవారం నిర్వహించిన సభల్లో దొంగలు చెలరేగిపోయారు. సామాన్య కార్యకర్తలే కాదు నాయకుల పర్సులను సైతం కొట్టేశారు. సుమారు రూ. 5 లక్షలకు పైగా నగదు దొంగల పాలైనట్లు తెలిసింది. మడికెరి, కుశాలనగరలో పార్టీ సమావేశాలు జరిగాయి. ఇందులో గుట్టుగా జేబుదొంగలు చొరబడ్డారు. మాజీ ఎమ్మెల్యేలు అప్పచ్చు రంజన్‌, కేజీ బోపయ్య పర్సులను ఎత్తుకెళ్లారు. అప్పచ్చు పర్సులో రూ. 25 వేల నగదు, బోపయ్య పర్సులో రూ. 17 వేల నగదు ఉంది. ఇంకా అనేకమంది పర్సులను, డబ్బును కాజేశారు. మైసూరు బీజేపీ అభ్యర్థి యదువీర్‌తో సెల్ఫీ తీసుకునేందుకు కార్యకర్తలు ఎగబడ్డారు, ఈ సమయంలో పలువురి పర్సులు మాయమయ్యాయి. తరువాత జేబులు చూసుకుని లబోదిబోమన్నారు.

ఎమ్మెల్సీ తేజస్విని రాజీనామా

శివాజీనగర: లోకసభ టికెట్‌ ఆకాంక్షి అయిన బీజేపీ ఎమ్మెల్సీ తేజస్వినిగౌడ రాజీనామా చేశారు. రాజీనామాను ఆమోదించినట్లు పరిషత్‌ సభాపతి బసవరాజ హొరట్టి తెలిపారు. ఆమె పదవీకాలం ఈ జూన్‌ వరకు ఉంది. గతంలో మాజీ ప్రధాని దేవేగౌడను ఓటమిపాలు చేసిన పేరు తేజస్వినికి ఉంది. పాత్రికేయురాలైన ఆమె రెండు దశాబ్దాల క్రితం రాజకీయాల్లోకి ప్రవేశించారు. త్వరలోనే ఆమె కాంగ్రెస్‌లోకి చేరనున్నట్లు తెలిసింది.

Advertisement
Advertisement