సార్వత్రిక సమరం.. కసరత్తు ముమ్మరం | Sakshi
Sakshi News home page

సార్వత్రిక సమరం.. కసరత్తు ముమ్మరం

Published Tue, May 7 2024 4:50 AM

సార్వత్రిక సమరం.. కసరత్తు ముమ్మరం

కరీంనగర్‌ అర్బన్‌: సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌కు అధికార యంత్రాంగం ముమ్మరంగా కసరత్తు చేస్తోంది. ఇటీవల నామినేషన్ల సమర్పణ, ఉపసంహరణ క్రతువు ముగియటంతో కరీంనగర్‌ లోక్‌సభ బరిలో నిలిచే అభ్యర్థుల జాబితా ఖరారైంది. ఇప్పటికే శాసనసభ నియోజకవర్గాల వారీగా అధికారులు ఈవీఎంలను కేటాయించారు. అభ్యర్థులు అధిక సంఖ్యలో పోటీ చేస్తుండటంతో అదనంగా ఈవీఎంలను తెప్పించారు. సదరు యంత్రాలను రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఫస్ట్‌ లెవల్‌ చెకింగ్‌తో పాటు రెండో విడత ర్యాండమైజేషన్‌ ద్వారా శాసనసభ నియోజకవర్గాల వారిగా ఏర్పాటు చేసిన స్ట్రాంగ్‌ రూంలకు తరలించారు. మరోవైపు పోలింగ్‌ సిబ్బంది, సూక్ష్మపరిశీలకులకు శిక్షణ కార్యక్రమాలను పూర్తిచేసిన అధికారులు ఈనెల 13న జరిగే పోలింగ్‌కు సమాయత్తమవుతున్నారు.

టెక్నికల్‌ ఎక్స్‌పర్ట్స్‌ నియామకం

పోలింగ్‌ ప్రక్రియకు అంతరాయం కలగకుండా అధికారులు శాసనసభ నియోజకవర్గాల వారీగా అదనపు ఈవీఎంలను కేటాయించారు. వీటిని పోలింగ్‌ రోజు ఆయా సెగ్మెంట్లలో విధులు నిర్వర్తించే సెక్టోరల్‌ అధికారులకు అప్పగించనున్నారు. ఈవీఎంలలో సాంకేతిక సమస్య తలెత్తితే వేరే వాటిని సెక్టోరల్‌ అధికారులు అమర్చుతారు. ఇలా ఒక్కొ సెక్టోరల్‌ అధికారికి 2–3 ఈవీఎంలను అధికారులు అప్పగిస్తారు. ఒక్కొ శాసనసభ నియోజకవర్గానికి ముగ్గురు చొప్పున సాంకేతిక నిపుణుల ను ఈసీ నియమించింది. ఈవీఎంలలో సమస్యలు తలెత్తితే సాంకేతిక నిపుణులు వెంటనే సరిచేస్తారు.

ముగిసిన రెండో విడత ర్యాండమైజేషన్‌

ఇప్పటికే మొదటి విడత ర్యాండమైజేషన్‌ పూర్తి చేయగా అదనంగా అవసరమైన ఈవీఎంలకు కలిపి రెండో విడత ర్యాండమైజేషన్‌ ముగించిన అధికారులు వాటిని పటిష్ట భద్రత మధ్య శాసనసభ నియోజకవర్గ కేంద్రాల్లోని స్ట్రాంగ్‌ రూంలకు తరలించారు. పోలింగ్‌కు ఒకరోజు ముందు పోలింగ్‌ కేంద్రాలకు ఈవీఎంల ను కేటాయించనున్నారు. అభ్యర్థుల జాబితా ప్రకారం ఇటీవల బ్యాలెట్‌ పేపర్‌ ముద్రించారు. ప్ర స్తుతం ఈ పేపర్‌ను బ్యాలెట్‌ యూ నిట్లలో పొందుపరుస్తున్నారు.

కరీంనగర్‌కు రెండు బ్యాలెట్‌ యూనిట్లు

కరీంనగర్‌ లోక్‌సభ బరిలో 28 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. ఒక్కో బ్యాలెట్‌ యూనిట్‌లో నోటాతో కలిపి 16 బటన్లుంటాయి. ఈ లెక్కన కరీంనగర్‌ లోక్‌సభ స్థానంలోని ప్రతి పోలింగ్‌ కేంద్రానికి రెండు బ్యాలెట్‌ యూనిట్లు వినియోగించనున్నారు. వీటితో పాటు ప్రతి పోలింగ్‌ కేంద్రానికి ఒక కంట్రోల్‌ యూనిట్‌, వీవీ ప్యాట్‌ అవసరం. నామినేషన్ల సమయంలోనే అధికారులు ఈవీఎంలను సిద్ధం చేసి మొదటి విడత ర్యాండమైజేషన్‌ ప్రక్రియను ముగించారు. అభ్యర్థుల సంఖ్యకనుగుణంగా యంత్రాలను కేటాయించారు. పోలింగ్‌ రోజు సాంకేతిక సమస్యలు తలెత్తినా అంతరాయం కలగకుండా 25 శాతం బ్యాలెట్‌, కంట్రోల్‌ యూనిట్లు, 40 శాతం వీవీప్యాట్లను అదనంగా అందుబాటులో ఉంచారు.

నియోజకవర్గం పోలింగ్‌కేంద్రాలు బీయూ సీయూ వీవీ ప్యాట్‌

కరీంనగర్‌ 395 990 493 553

చొప్పదండి 327 820 408 457

మానకొండూర్‌ 316 794 395 442

హుజూరాబాద్‌ 305 780 368 420

రెండో ర్యాండమైజేషన్‌, కమిషనింగ్‌ ప్రక్రియ పూర్తి

స్ట్రాంగ్‌ రూంలకు ఈవీఎంలు

Advertisement

తప్పక చదవండి

Advertisement