ప్రమాదవశాత్తు కాలువలో పడి వ్యక్తి మృతి | Sakshi
Sakshi News home page

ప్రమాదవశాత్తు కాలువలో పడి వ్యక్తి మృతి

Published Sun, May 19 2024 10:00 AM

ప్రమాదవశాత్తు కాలువలో పడి వ్యక్తి మృతి

లక్ష్మణచాంద: ప్రమాదవశాత్తు మాటు కాలువలో జారిపడి వ్యక్తి మృతి చెందినట్లు ఎస్సై శ్రీకాంత్‌ తెలిపారు. మండలంలోని ఒడ్డెపెల్లి గ్రామానికి చెందిన పల్లపు చిన్న రాజన్న(52) శనివారం రాచాపూర్‌ శివారులో కల్లు తాగడానికి వచ్చి కాలకృత్యాలకు వెళ్లి తిరిగి వస్తుండగా జారిపడి మృతి చెందాడు. మృతునికి భార్య లక్ష్మి, ఇద్దరు కుమారులు, కూతురు ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు.

మద్యానికి బానిసై ఒకరి ఆత్మహత్య

భైంసాటౌన్‌: పట్టణంలోని కోర్వగల్లికి చెందిన జింక సతీష్‌ (35) శుక్రవారం రాత్రి ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్సై ఎండీ గౌసుద్దీన్‌ కథనం ప్రకారం.. బోథ్‌కు చెందిన సతీష్‌ ఉపాధి నిమిత్తం మూడునెలల కిందట భైంసా పట్టణానికి కుటుంబంతో సహా వలస వచ్చాడు. ఈ క్రమంలో మద్యానికి బానిస కావడంతో శుక్రవారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతునికి ఇద్దరు పిల్లలున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

హత్య కేసులో ఇద్దరి అరెస్టు

ఆసిఫాబాద్‌రూరల్‌: ప్రియుడితో కలిసి భర్తను హత్యచేసిన భార్య కళావతి, అక్కలపెల్లి రవీందర్‌ను శనివారం అరెస్టు చేసినట్లు సీఐ సతీష్‌ తెలిపారు. మండలంలోని రహపల్లి గ్రామంలో ఈనెల 16న రాత్రి జరిగిన సంఘటన. అక్కలపెల్లి రవీందర్‌తో వివాహేతర సంబంధం పెటుకున్న కళావతి ప్రియుడితో కలిసి భర్త చున్కాకర్‌ రవీందర్‌ను హత్యచేసి ఆత్మహత్య చేసుకున్నట్లుగా ఇంట్లో దూలానికి వేలాడదీశారు. నిందితులిద్దరిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ ఒక ప్రకటనలో తెలిపారు.

మిస్సింగ్‌ కేసు నమోదు

నెన్నెల: మైలారం గ్రామానికి చెందిన యు వతి (18) నాలుగు రోజులుగా కనిపించడం లేదని ఎస్సై ప్రసాద్‌ తెలిపారు. ఈ నెల 14న బెల్లంపల్లికి బట్టలు కొనుగోలు చేసేందుకు వెళ్లిన యువతి తిరిగి ఇంటికి రాలేదు. ఫోన్‌ కూడా స్విచ్‌ఆఫ్‌ రావడంతో కుటుంబ సభ్యులు బంధువులు, తెలిసిన వారి ఇళ్లల్లో వెతికినప్పటికీ ఆచూకీ లభించకపోవడంతో యువతి తండ్రి వెంక అభి శనివారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు మిస్సింగ్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నామని ఎస్సై తెలిపారు.

Advertisement
 
Advertisement
 
Advertisement