ప్లీజ్‌ ఒక్క క్షణం.. | - | Sakshi
Sakshi News home page

ప్లీజ్‌ ఒక్క క్షణం..

Apr 26 2025 1:27 AM | Updated on Apr 26 2025 1:27 AM

ప్లీజ్‌ ఒక్క క్షణం..

ప్లీజ్‌ ఒక్క క్షణం..

గతేడాది ఖానాపూర్‌కు చెందిన గౌతం కాంబ్లే(28) అనే యువకుడు ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకున్నాడు. తన తల్లి ఆరోగ్య పరిస్థితి బాగాలేక, ఆస్పత్రిలో చూపించేందుకు డబ్బులు లేవని మానసిక వేదనకు గురై క్షణికావేశంలో చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రైవేట్‌ పని చేస్తూ కుటుంబానికి చేదోడువాదోడుగా ఉంటున్న గౌతం మృతితో తల్లిదండ్రులకు తీరని శోకమే మిగిలింది.

రూరల్‌ మండలం ఆకుల కొండూర్‌ గ్రామానికి చెందిన ఆకాశ్‌(24) అనే యువకుడు స్థానికంగా పెట్రోల్‌ బంక్‌లో పనిచేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. ఆకాశ్‌ బెట్టింగ్‌ యాప్‌లకు అలవాటుపడి రూ. ఐదు లక్షల వరకు పోగొట్టుకున్నాడు. తల్లిదండ్రులు ఏమంటారో అనే భయంతో ఈ నెల 2న పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. అతని మృతితో కుటుంబం కోలుకోవడం లేదు.

నిజామాబాద్‌ రూరల్‌: జీవించి సాధించాల్సింది.. కుంగుబాటుకు గురై పలువురు అర్ధంతరంగా తనువు చాలిస్తున్నారు. యుక్తవయసులో ఉన్నవారు సైతం బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. జీవితంలో ఎదురైన సమస్యలకు భయపడి.. నిరాశ, నిస్పృహలతో ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతున్నారు. ఆపై మనోవేదనతో ప్రాణాలు తీసుకుని.. నిండు జీవితాన్ని కోల్పోతున్నారు. కుటుంబ సభ్యులకు తీరని శోకాన్ని మిగుల్చుతున్నారు. అందుకే మనుషులకు శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం ఎంతో ముఖ్యమని మానసిక వైద్యనిపుణులు పేర్కొంటున్నారు. నిత్యజీవితంలో ఎదురైన సమస్యలను సానుకూల దృక్పథంతో పరిష్కరించుకోవాలని, సర్దుబాటుతత్వంతో ముందుకు సాగితే జీవితం ఆనందంగా ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు.

పిల్లలతో ఫ్రెండ్లీగా ఉంటేనే..

యుక్త వయస్సుకు వచ్చిన పిల్లలతో తల్లిదండ్రులు ఫ్రెండ్లీగా ఉండటమే మంచిది. వారిపై ఎక్కువగా కోపం కన్నా ప్రేమ చూపిస్తే చేసిన తప్పును వెంటనే చెబుతారు. దీంతో సమస్య పరిష్కారమవుతుంది. చేసిన తప్పును పదే పదే వారిపై విరుచుకుపడితే మనస్థాపనకు గురై ఆత్మహత్యలకు పాల్పడే అవకాశం ఉంటుంది. దురాలవాట్లకు గురయ్యే పిల్లలపై నిరంతరం పర్యవేక్షణ ఉండటమే మంచిది. కుటుంబం గురించి.. తల్లిదండ్రులు పడుతున్న బాధలను పిల్లలకు తెలియజేస్తేనే వారు చెడు అలవాట్లకు దూరంగా ఉంటారు.

ఆత్మహత్యలు వద్దు.. జీవితమే ముద్దు

సర్దుబాటు తత్వంతో ముందుకు

సాగితేనే జీవితం ఆనందం

జీవితాన్ని నాశనం చేసుకోవద్దు

వేగంగా డబ్బులు సంపాదించాలని ఆశతో యువత చెడు మార్గాల వైపు వెళ్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఆన్‌లైన్‌ గేమ్‌లతో చాలా మంది యువత నష్ట పోతున్నారు. విద్యార్థులు, యువత తల్లిదండ్రులు పడుతున్న బాధను అర్థం చేసుకోవాలి. అందమైన జీవితాన్ని క్షణికావేశంలో నాశనం చేసుకోకూడదు.

– డాక్టర్‌ విశాల్‌, ప్రముఖ సైకాలిజిస్టు

ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లాలి

యుక్త వయస్సు వచ్చిన యువకులు ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లాలి. వారికి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు క్రమశిక్షణతోపాటు మంచి అలవాట్లను నేర్పించాలి. జీవితంలో వచ్చే అటుపోట్లను ఎలా ఎదుర్కోవాలో వివరించాలి. యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి. లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలి.

– ఆనంద్‌సాగర్‌, ఎస్సై–2, రూరల్‌ పీఎస్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement