ఎట్టకేలకు.. | Sakshi
Sakshi News home page

ఎట్టకేలకు..

Published Wed, Mar 27 2024 12:55 AM

ఆర్డీఎస్‌ డీ–27లో పూడిక తొలగింపు - Sakshi

ఆర్డీఎస్‌ కెనాల్‌ ఆధునీకరణ పెండింగ్‌ పనులు షురూ

త్వరగా పనులు పూర్తిచేయాలి..

వానాకాలం పంటలకు ఆర్డీఎస్‌ నీటిని విడుదల చేయకముందే కెనాల్‌ ఆధునీకరణ పనులను పూర్తిచేయాలి. కొన్నేళ్లుగా నీటిని విడుదల చేసే కొద్ది రోజుల ముందు ఆర్డీఎస్‌ పనులు ప్రారంభించడం.. నీళ్లు వచ్చాక మధ్యలోనే నిలిపివేయడం జరుగుతుంది. దీంతో సాగునీరు దిగువకు రాక, పంటలు నష్టపోతున్నాం. ఈసారైనా పనులను త్వరగా పూర్తిచేసి, డీ–40 వరకు సాగునీరందించాలి.

– మహమ్మద్‌ సిరాజ్‌, రైతు,అమరవాయి, మానవపాడు మండలం

చివరి ఆయకట్టు వరకునీరందించాలి..

దశాబ్దాల కాలంగా చివరి ఆయకట్టుకు సాగునీరు అందడంలేదు. గతంలో ఎంత ప్రయత్నించినా ఆర్డీఎస్‌ ప్రధాన కాల్వలో డీ–23 వరకే సాగునీరు పారేది. ఐదేళ్ల కిందట తుమ్మిళ్ల ఎత్తిపోతలను ప్రారంభించడంతో డీ–33 వరకు నీళ్లు పారుతున్నాయి. నాకు డీ–36 కింద మూడెకరాల భూమి ఉంది. ఏనాడూ ఆర్డీఎస్‌ నీరందలేదు. ఈఏడాదైనా పూర్తిస్థాయిలో నీరందించి, చివరి ఆయకట్టు రైతులను ఆదుకోవాలి.

– లోకారెడ్డి, రైతు, ఉండవెల్లి

మే చివరి నాటికి పనులు పూర్తిచేస్తాం..

ఆర్డీఎస్‌ కెనాల్‌ ఆధునీకరణ పనులను మే చివరి నాటికి పూర్తిచేస్తాం. ఇటీవల పూడిక తొలగింపు పనులను కాంట్రాక్టర్‌ ప్రారంభించారు. నాలుగు రోజుల్లో సీసీ, స్ట్రక్చర్‌, ప్యారాఫీట్‌, డ్రాప్‌ల మరమ్మతులు, డెలివరీ సిస్టమ్‌ వద్ద సీసీ రివిట్‌మెంట్‌ తదితర పనులు ప్రారంభిస్తాం. ఈఏడాది చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నాం.

– విజయకుమార్‌రెడ్డి, ఈఈ, ఆర్డీఎస్‌

శాంతినగర్‌: ఆర్డీఎస్‌ ఆధునీకరణ పెండింగ్‌ పనులు ఎట్టకేలకు ప్రారంభమయ్యాయి. ఆర్డీఎస్‌ కెనాల్‌ను ఆధునీకరించి, చివరి ఆయకట్టుకు సాగునీరందించాలన్న లక్ష్యంతో గతేడాది ప్రభుత్వం రూ.11.25 కోట్లు మంజూరు చేసింది. పనులు చేపట్టిన కాంట్రాక్టర్‌.. కెనాల్‌లో నీటిని విడుదల చేసే సమయం వరకు రూ.3కోట్ల పనులను మాత్రమే పూర్తిచేశారు. డిస్ట్రిబ్యూటరీలలో పూడిక, ముళ్లపొదల తొలగింపు, ఎర్రమట్టితో బండ్‌ ఏర్పాటు తదితర పనులు చేపట్టారు. ఆ తర్వాత కెనాల్‌కు నీటిని విడుదల చేయడంతో మధ్యలోనే పనులు నిలిచిపోయాయి. దీంతో డీ–33 వరకు మాత్రమే సాగునీరు పారింది.

చివరి ఆయకట్టుకు అందని సాగునీరు..

ఆర్డీఎస్‌ ప్రధాన కాల్వ ఆధునీకరణకు 16 ఏళ్ల కిందట అప్పటి సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి రూ. 100 కోట్లు కేటాయించగా.. కర్ణాటక ప్రాంతంలోని డిస్ట్రిబ్యూటరీ 12 వరకు మాత్రమే పూర్తిస్థాయిలో లైనింగ్‌, సీసీబెడ్‌ పనులు చేపట్టారు. తెలంగాణ ప్రాంతంలో కొంతమేర మాత్రమే పనులను పూర్తిచేశారు. దీంతో కెనాల్‌ అధ్వాన్నంగా మారి, సాగునీరు ముందుకు కదలని పరిస్థితి నెలకొంది. అంతేగాక నీటి పారుదలశాఖ అధికారుల పర్యవేక్షణ కొరవడటంతో కెనాల్‌లో అక్రమంగా రంధ్రాలు, మోటార్లను ఏర్పాటుచేసి.. సాగునీటిని నాన్‌ ఆయకట్టుకు తరలించడంతో అసలు రైతులు నష్టాలను చవిచూశారు. కెనాల్‌ ఆధునీకరణ పూర్తిస్థాయిలో పూర్తి కాకపోవడం, అధికారుల పర్యవేక్షణ కొరవడటంతో అలంపూర్‌ మండలంలో చివరన ఉన్న 7 డిస్ట్రిబ్యూటరీలకు సాగునీరు అందడంలేదు.

తుమ్మిళ్ల లిఫ్ట్‌ ప్రారంభించినా..

ఆర్డీఎస్‌ రైతాంగాన్ని ఆదుకునేందుకు గత ప్రభుత్వం రూ.387 కోట్లతో తుమ్మిళ్ల లిఫ్ట్‌ ప్రారంభించింది. తుంగభద్ర నదిలో భారీ మోటార్లు ఏర్పాటుచేసి.. లిఫ్ట్‌ ద్వారా ఆర్డీఎస్‌ కెనాల్‌కు నీటిని పంపింగ్‌ చేస్తూ వచ్చారు. తుమ్మిళ్ల వద్ద రెండు మోటార్లు ఉండగా.. ఒక మోటారు ద్వారా వచ్చే నీటికే ఆర్డీఎస్‌ ప్రధాన కాల్వ కోతకు గురైంది. దీంతో రెండవ మోటారు నిరుపయోగంగా మారింది. రెండు మోటార్ల ద్వారా నీటిని వాడుకోడానికి అవకాశం ఉన్నా.. కెనాల్‌ పటిష్టంగా లేకపోవడంతో ఒక మోటార్‌ నీటితోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

రిజర్వాయర్లు ఏర్పాటు చేయకపోవడంతో..

తుమ్మిళ్ల లిఫ్ట్‌ నిర్మాణంతో పాటు మల్లమ్మకుంట, జూలెకల్‌, వల్లూరు వద్ద రిజర్వాయర్ల నిర్మాణానికి గత ప్రభుత్వం రూ.857 కోట్లు మంజూరుచేసింది. మొదటి విడతగా రూ.387 కోట్లు విడుదల చేయగా.. తుమ్మిళ్ల లిఫ్ట్‌, పైప్‌లైన్‌ పనులను చేపట్టి, తనగల సమీపంలోని డీ–22 వద్ద ఆర్డీఎస్‌ ప్రధాన కాల్వకు అనుసంధానం చేశారు. రెండవ విడతలో మూడు రిజర్వాయర్ల నిర్మాణానికి నిధులు మంజూరుచేయలేదు. 6 నెలల కిందట మల్లమ్మకుంట రిజర్వాయర్‌ నిర్మాణానికి అవసరమైన భూసేకరణకు రూ.40 కోట్లు మంజూరు చేయగా.. భూసేకరణ ప్రక్రియ ముందుకు సాగడంలేదు.

చేపట్టాల్సిన పనులు..

ఆర్డీఎస్‌ కెనాల్‌ ఆధునీకరణకు మంజూరుచేసిన నిధుల్లో మిగిలిన రూ.8.25 కోట్లతో పలు పనులను పూర్తిచేయాల్సి ఉంది. డీ–26లో 3 కి.మీ. డీ–27లో 5 కి.మీ. మేర (109 కి.మీ.నుంచి 116 కి.మీ. వరకు) పూడిక తొలగించడంతో పాటు ఇరువైపులా కట్ట పటిష్టత (బ్యాంకింగ్‌), డెలివరీ సిస్టమ్‌ వద్ద సీసీ రివిట్‌మెంట్‌, డీ–22 వద్ద మట్టికట్ట అడుగుమేర ఎత్తు పెంచడం, డ్రాప్‌ల మరమ్మతు, రక్షణ గో డల ఎత్తు పెంచడం, ప్యారా ఫీట్‌, వాల్స్‌ (స్ట్రక్చర్‌) పనులను మే చివరి నాటికి పూర్తిచేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. కాగా, వానా కాలం పంటలకు నీటిని విడుదల చేసేలోపు కెనాల్‌ ఆధునీకరణ పనులను పూర్తిచేయాలని రైతులు కోరుతున్నారు. అదేవిధంగా కెనాల్‌లో అక్రమంగా ఏర్పాటుచేసిన రంధ్రాలు, మోటార్లను తొలగించాలని వడ్డేపల్లి, అయిజ, మానవపాడు, ఉండవెల్లి, అలంపూర్‌ మండలాల రైతులు విజ్ఞప్తి చేశారు.

నెరవేరని లక్ష్యం..

ఆర్డీఎస్‌ ఆయకట్టు కింద 142 కిలోమీటర్ల మేర 40 డిస్ట్రిబ్యూటరీలు ఉన్నాయి. మొత్తం 87,500 ఎకరాల సాగు లక్ష్యంగా కెనాల్‌కు రూపకల్పన చేశారు. కెనాల్‌ ప్రారంభం నుంచి అక్రమ ఆయకట్టు, నీటి వృథా, కాల్వకు గండి కొట్టడం, 124 కిలోమీటర్ల మేర మోటార్లు ఏర్పాటు చేయడంతో చివరి ఆయకట్టు వరకు నీరందడంలేదు. గతేడాది చివరి ఆయకట్టు వరకు నీరందించాలని ప్రజాప్రతినిధులు, అధికారులు చేసిన కృషి ఫలించలేదు. డీ–33 వరకు మాత్రమే నీటిని అందించగలిగారు.

గతేడాది రూ.11.25 కోట్లు మంజూరు

రూ.3 కోట్ల పనులు మాత్రమే పూర్తి

మిగిలిన నిర్మాణాలను మే చివరి నాటికి పూర్తిచేసేలా అధికారుల చర్యలు

కెనాల్‌కు నీటిని విడుదల చేయకముందే పనులు పూర్తిచేయాలని రైతుల వేడుకోలు

1/4

2/4

3/4

4/4

Advertisement
Advertisement