● పిందే సమయంలోనే పండుబారుతున్న కాయ ● వాతావరణ ప్రభావమంటున్న అధికారులు | Sakshi
Sakshi News home page

● పిందే సమయంలోనే పండుబారుతున్న కాయ ● వాతావరణ ప్రభావమంటున్న అధికారులు

Published Thu, Mar 28 2024 12:45 AM

- - Sakshi

సారంగాపూర్‌: వాతావరణంలోని మార్పుల కారణంగా ఈ ఏడాది కూడా నష్టాలు మిగిల్చేలా ఉందని మామిడి రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఫిబ్రవరి, మార్చిలో వాతావరణంలో మార్పులు రావడం, మబ్బులు పట్టడం, చెదురుమదురుగా చిరుజల్లులు కురవడంతో తోటలపై తీవ్ర ప్రతికూలతను చూపి, కాయ పెరిగే సమయానికి నేల రాలుతుండడంతో దిగుబడి గణనీయంగా పడిపోతోందని రైతులు ఆవేదన చెందుతున్నారు.

రెండు మండలాల్లో మామిడి సాగు

సారంగాపూర్‌ మండలంలో 420 ఎకరాల్లో, బీర్‌పూర్‌లో 78 ఎకరాల్లో మామిడితోటలు సాగవుతున్నాయి. దిగుబడి పెంచడానికి రైతులు తోటలకు ఇప్పటికే సేంద్రియ, రసాయనిక ఎరువులు, మూడు పర్యాయాలు వివిధ పురుగుల మందులను స్ప్రే చేసారు. తద్వారా రైతుకు పెట్టుబడి తడిసి మోపెడయ్యాయి. మార్చి చివరి వారంలో మామిడి కాయలు కనీసం 200 గ్రాముల బరువును దాటిపోవాలి. కానీ కాయ సైజు ఏమాత్రం పెరగకపోగా.. ఉన్న కాతనే రాలిపోతోంది. మూడు నెలలుగా మామిడిని తేనెమంచు, బూడిద తెగులు, మసి తెగులు, తామర పురుగులు ఆశించాయి. దీంతో పూత మాడిపోయి రాలిపోయింది. కాయలు పిందే దశలో ఆకుపచ్చ రంగు నుంచి పసుపు రంగులోకి మారాయి. పంటకు ఎన్ని నీటితడులు అందించినా కాత నిలవడం లేదు. అధికారుల సూచనలతో ప్రతి రైతు ఇప్పటికే మూడుసార్లు వివిధ రకాల పురుగుల మందులను స్ప్రే చేశారు. అయినా కాత ఆగకపోవడంతో రైతులకు ఈ ఏడాది భారీ నష్టం వస్తుందని రైతులు పేర్కొంటున్నారు.

గతేడాది వడగళ్లతో నష్టం

గతేడాది తెగుళ్ల కంటే ఎక్కువ ఏప్రిల్‌లో కాయ తెంపే సమయంలో భారీ వడగళ్లు.. ఈదురుగాలులతో కూడిన వర్షాలకు కాత నేల రాలిపోయింది. అప్పటి ప్రభుత్వం ఎకరాకు రూ.10 వేలు అందిస్తామని ప్రకటించినా అది అందలేదు.

మామిడి పంటకు పురుగుల మందును స్ప్రేచేస్తున్న రైతులు

నేల రాలిన పిందే
1/1

నేల రాలిన పిందే

Advertisement
Advertisement