ఫిర్యాదులే.. చర్యలేవీ..? | Sakshi
Sakshi News home page

ఫిర్యాదులే.. చర్యలేవీ..?

Published Tue, Mar 26 2024 1:00 AM

జగిత్యాల మున్సిపాలిటీ కార్యాలయం
 - Sakshi

జగిత్యాల: జగిత్యాల మున్సిపాలిటీలో పనిచేస్తున్న అధికారుల రూటే వేరు అన్నట్లు తయారైంది. బల్దియాలోని ప్రతి విభాగం అధికారులపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నా చర్యలు తీసుకోకపోవడం పలు అనుమానాలు దారితీస్తోంది. ఇటీవల రెవెన్యూ విభాగంలో పనిచేస్తున్న ఓ అధికారి అమ్యామ్యాలు ఇస్తేనే పనిచేస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తడంతో అతడిని సరెండర్‌ చేయాలని కౌన్సిలర్లు సంతకాలు చేసిమరీ కలెక్టర్‌, అదనపు కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లారు. అయినా ఇప్పటివరకు అతడిపై కనీస చర్యలు తీసుకోలేదు. దాదాపు అన్ని పార్టీల కౌన్సిలర్లు సరెండర్‌ చేయాలని సంతకాలు చేసి కోరినప్పటికీ ఎలాంటి చర్యలూ తీసుకోకపోవడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల శానిటేషన్‌ విభాగంలో మరమ్మతు పేరిట దోపిడీ జరుగుతోందని, విచారణ చేపట్టాలని కౌన్సిలర్లు అదనపు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. అయినా ఇంతవరకు చర్యలు తీసుకోలేదు. ఏడాదిలోనే మరమ్మతు పేరిట రూ.30లక్షలు ఖర్చు చేశారని ఆరోపిస్తూ ఫిర్యాదులు వెల్లువెత్తాయి. కౌన్సిలర్లు ఫిర్యాదు చేయడం, ఉన్నతాధికారులు కిందిస్థాయి అధికారులకు విచారణ చేయమని ఆదేశించడమే తప్ప ముందడుగు పడింది లేదు.

ఆ శాఖల్లో అవినీతిమయం

పరిపాలనలో రెవెన్యూ విభాగానిదే అత్యంత ముఖ్యమైంది. ప్రజలకు ఈ శాఖతో అనేక సంబంధాలుంటాయి. ముఖ్యంగా అసెస్మెంట్‌, ఇంటినంబర్ల మార్పు, మ్యూటేషన్లు ఇలా అనేకం ప్రజలతో ముడిపడి ఉంటాయి. ఇందులో రెవెన్యూ విభాగంలో కొందరు అధికారులు అవినీతిదందాకు తెరలేపినట్లు ఆరోపణలున్నాయి. ప్రతి పనికీ ఓ రేటు అన్నట్లు పెట్టుకుని దరఖాస్తు చేసుకున్న వారి నుంచి అందినకాడికి దోచుకుంటున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఏకంగా ఓ కౌన్సిలర్‌కు చెందిన పని అన్ని సక్రమంగా ఉన్నప్పటికీ ఆ విభాగం అధికారులు చేయకపోవడంతో ఆ విభాగంలోని అధికారిని సరెండర్‌ చేయాలని ఒత్తిడి తీసుకొచ్చారు. అయినప్పటికీ ఫలితం లేదు. ఏడాదిలోనే శానిటేషన్‌ విభాగంలోని వాహనాలకు మరమ్మతు పేరిట రూ.30లక్షలు ఖర్చు కావడంతో తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాక ఇటీవల కొనుగోలు చేసిన బీరువాలకు కూడా అధిక బిల్లులు వేశారన్న ఆరోపణలున్నాయి. ఈ విభాగానికి చెందిన అధికారులకు సైతం చర్యలు తీసుకోవాలంటూ స్థానిక సంస్థల అధికారులకు ఫిర్యాదు చేశారు కౌన్సిలర్లు.

ప్రజాప్రతినిధుల ఒత్తిడా..? సిబ్బంది లేరా..?

ప్రతి విభాగంపై ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో కౌన్సిలర్లు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తున్నా చర్యలు తీసుకోకపోవడం ప్రజాప్రతినిధుల ఒత్తిడా..? సిబ్బంది లేకనా..? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం పార్లమెంట్‌ ఎన్నికల సమయంలో అధికారులను బదిలీ చేయడం ద్వారా ఇబ్బందులు వస్తాయన్న ఉద్దేశంతోనే తప్పించడం లేదని మున్సిపాలిటికీ చెందిన ఓ అధికారి తెలిపారు. ఆ శాఖల్లో పనిచేస్తున్న అధికారులు ప్రమోషన్‌పై వెళ్లిపోతారనే ఉద్దేశంతోనే వారిపై చర్యలు తీసుకోవడం లేదనే ప్రచారం కూడా ఉంది.

అస్తవ్యస్తంగా మున్సిపాలిటీ పాలన

జగిత్యాల మున్సిపాలిటీ ఏడాదిపాటు చైర్‌పర్సన్‌ లేకుండానే కాలం వెళ్లదీసింది. ఇటీవల కొత్త పాలకవర్గం కొలువుదీరింది. ఇన్ని ఆరోపణలు వెల్లువెత్తడం పాలకవర్గానికి తలనొప్పిగానే మారింది. ముఖ్యంగా టౌన్‌లో పారిశుధ్యం ఎంతో ముఖ్యం. అందులో అనేక అవినీతి జరుగుతోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రతి కౌన్సిల్‌ సమావేశంలోనూ కౌన్సిలర్లు ఇదే అంశాన్ని లేవనెత్తుతున్నారు. కార్మికుల కోసం గతంలో చీపుర్లు, పరికరాల కొనుగోళ్లలో అవకతవకలు జరిగాయని ఆరోపణలు వచ్చాయి. అంతేకాక మరమ్మతు చేయించడంలో పైఅధికారులు లేకపోవడంతో ఆ విభాగం అధికారులది ఇష్టారాజ్యంగా మారిందని కౌన్సిలర్లు ఆరోపిస్తూ వస్తున్నారు. అలాగే రెవెన్యూ విభాగంపై రెండుసార్లు అదనపు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. టౌన్‌లో అనేక అక్రమ కట్టడాలు జరుగుతున్నాయని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కొన్ని చోట్ల ఇష్టానుసారంగా అనుమతులు ఇస్తున్నారని ఇటీవల ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి మున్సిపాలిటీని గాడిలో పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రజలు చర్చించుకుంటున్నారు. అవినీతి ఆరోపణలు.. ఫిర్యాదులపై చైర్‌పర్సన్‌ అడువాల జ్యోతి స్పందిస్తూ.. మున్సిపాలిటీపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి ప్రక్షాళన చేస్తామన్నారు.

జగిత్యాల బల్దియాలో అధికారుల రూటే వేరు

ఆరోపణలు వచ్చినా ఎవరూ స్పందించని వైనం

శానిటేషన్‌, రెవెన్యూ విభాగాలపైనే అధికం

Advertisement
Advertisement