ఎస్‌ఐఆర్‌పై అమెరికా ఎంపీ ఆరోపణలు.. కౌంటరిచ్చిన భారత్‌ | Indian envoy rejects US lawmakers ‘purging 130 million from voter rolls’ remark | Sakshi
Sakshi News home page

ఎస్‌ఐఆర్‌పై అమెరికా ఎంపీ ఆరోపణలు.. కౌంటరిచ్చిన భారత్‌

Oct 16 2026 2:35 AM | Updated on Oct 16 2026 2:35 AM

Indian envoy rejects US lawmakers ‘purging 130 million from voter rolls’ remark

భారత్‌లో ఓటర్ల జాబితా సవరణ(SIR)పై అమెరికా ఎంపీ ప్రమిలా జయపాల్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. తాజాగా ఆమె వ్యాఖ్యలపై భారత్ ఘాటుగా స్పందించింది. భారత అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని అమెరికాలోని భారత రాయబారి వినయ్ మోహన్ క్వాత్రా అన్నారు.

"భారత్ ఒక  శక్తివంతమైన ప్రజాస్వామ్య దేశం. మా దేశంలో స్వతంత్ర రాజ్యాంగ వ్యవస్థలు సమర్థవంతంగా పనిచేస్తున్నాయి. స్వేచ్ఛగా, నిష్పాక్షికంగా ఎన్నికలు నిర్వహించిన సుదీర్ఘ చరిత్ర భారత్‌కు ఉంది. ఎంపీకి ఉన్న అపోహలను తొలగించడానికి మేము సిద్దంగా ఉన్నామని" వినయ్ మోహన్ ఎక్స్‌వేదికగా పేర్కొన్నారు.

ప్రమిలా జయపాల్ ఏమన్నారంటే?
కాగా వాషింగ్టన్ స్టేట్ నుంచి గెలిచిన భారత సంతతి ఎంపీ ప్రమిలా జయపాల్ బుధవారం నాటి తన పోస్టులో భారత్‌లోని ఎన్నికల సవరణలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓటర్ల జాబితా నుంచి దాదాపు 13 కోట్ల మంది పేర్లను తొలగించే చర్యలు జరుగుతుండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోందని పేర్కొన్నారు.  

అమెరికాలో డోనాల్డ్ ట్రంప్ యంత్రాంగం పౌరుల ఓటు హక్కులను దెబ్బతీసేందుకు వాడుతున్న వ్యూహాల తరహాలోనే భారత్‌లోని చర్యలు కనిపిస్తున్నాయని ఆరోపించారు.   ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరి ఓటు హక్కును పరిరక్షించడమే ముఖ్యమని, భారత్‌లో జరుగుతున్న 'ప్రజాస్వామ్య వ్యతిరేక ప్రయత్నాలను' అడ్డుకోవడానికి అక్కడ జరుగుతున్న శాంతియుత నిరసనలకు మద్దతు తెలుపుతున్నట్లు వ్యాఖ్యానించారు.

ఏమిటీ ఎస్‌ఐఆర్‌ వివాదం?
భారత ఎన్నికల సంఘం  దేశవ్యాప్తంగా నిర్వహించిన ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ఈ వివాదానికి కేంద్ర బిందువుగా మారింది. మరణించిన ఓటర్లు, రెండు చోట్ల నమోదు ఉన్నవారు, శాశ్వతంగా ఇళ్లు మారిన వారిని గుర్తించి ఓటర్ల జాబితాను నవీకరించేందుకే ఎస్‌ఐఆర్‌  నిర్వహించినట్లు ఈసీ స్పష్టం చేసింది. ​కానీ  ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ అధికార విపక్షాల ఓటర్లను లక్ష్యంగా చేసుకుని 13 కోట్లకు పైగా పేర్లను తొలగించారంటూ ప్రతిపక్ష పార్టీలు ఆందోళన చేస్తున్నాయి.

మరోవైపు అమెరికాలో రాబోయే నవంబర్ మధ్యంతర ఎన్నికల నేపథ్యంలో అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం కూడా ఓటర్ల అర్హతలను తనిఖీ చేసే చర్యలను తీవ్రతరం చేసింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement