అంతరాత్మను తట్టి లేపే కథనం

Sakshi Guest Column Story By Karan Thaper

ఈ కథనం 75 సంవత్సరాల తర్వాత కూడా మన అంతరాత్మను తట్టిలేపుతుంది. 1947 మండువేసవి కాలంలో ఇది జరిగింది. దేశవిభజన తీసుకొచ్చిన ఉన్మాద హత్యల కారణంగా భావోద్వేగాలు తీవ్రస్థాయిలో ఉన్నరోజులవి. అలాంటి సమయంలో ఇంట్లో పనిచేస్తున్న ఒక మనిషిని, కేవలం తన మతం కారణంగా మృత్యువు  ముంగిట నిల్చున్నప్పుడు ఎంతో సమయస్ఫూర్తితో ఒక మహిళ కాపాడిన కథనం ఇది. ఆ సంఘటనను దాటేసిన చాలా రోజులకు అది నవ్వులాట కథనంగా మారిపోవచ్చుగాక! కానీ ఆ క్షణంలో ముచ్చెమటలు పట్టించిన రోజు ఎవరి జీవితంలోనూ రాకూడదు.

మా ‘మమ్మీ’ (అమ్మ; బిమ్లా థాపర్‌) ఈరోజు బతికి ఉంటే ఆమెకు 106 సంవ త్సరాలు ఉండేవి. తన 98 సంవత్సరాల వయసులో 2015లో చనిపోయింది. ఆమె జయంతి అని ఆమె గురించి నేను రాయడం లేదు. చాలా విభిన్నమైన కారణం రీత్యా నేను ఈ కథనం రాస్తున్నాను. ఆమె జీవితంలో తప్పకుండా గుర్తుంచుకోవలసిన కథ ఉంది. అది కాలం ఎంతగా మారిపోయిందో చెప్పే శక్తిమంతమైన చిత్రణ. 75 సంవత్సరాల తర్వాత కూడా అది మన అంతరాత్మను తట్టిలేపుతుందని నేను భావిస్తున్నాను.

1947 మండువేసవి కాలంలో ఇది జరిగింది. ఆ సమయంలో ఆర్మీ బ్రిగేడియర్‌ అయిన మా నాన్న (జనరల్‌ ప్రాణ్‌నాథ్‌ థాపర్‌) మిలిటరీ ఆపరషన్స్, ఇంటెలిజెన్స్ విభాగం డైరెక్టర్‌గా బాధ్యతల్లో ఉండేవారు. ఆ రోజుల్లో ఆ స్థాయి ఉద్యోగం విలాసవంతమైనబంగ్లాను తీసుకొచ్చేది. అయితే ఆ ఇల్లు సొగసు ఏమిటంటే– దేశవిభజన తీసుకొచ్చిన ఉన్మాద హత్యల కారణంగా పేరుకుపోయిన హంతక భావోద్వేగాలతో పోల్చిచూసినప్పుడు, దానికి పూర్తి విరుద్ధంగా ఎకరాల పొడవునా గుల్‌మహర్‌ చెట్లతో చుట్టి ఉండే అలంకరించిన పచ్చిక బయళ్లతో కూడి ఉండేది. సిక్కు ‘జత్తాలు’ అని పిలువబడే వాళ్లు.. ముస్లింలపై ప్రతీకారం తీర్చుకోవడానికి ఢిల్లీ వీధుల్లో వీరంగమాడేవారు. అవి నిజంగానే మంచిరోజులు కావు.

అప్పట్లో నా తల్లితండ్రుల వద్ద ఒక ముస్లిం బేరర్‌ ఉండేవాడు. అనేక సంవత్సరాలుగా అతను వారితో ఉంటూ వచ్చాడు. అతడి పేరు ఫజల్‌ కరీమ్‌. ఆనాటి పరిస్థితులను చూసి ఫజల్‌ కరీమ్‌ భీతిల్లిపోవడం అర్థం చేసుకోదగినదే. మా కాంపౌండులో ఒక చివరన ఉండే క్వార్టర్లలో కంటే మా ఇంటిలోనే అతడు ఉండేలా అమ్మ ఏర్పాటు చేసింది. అతడి మతం గురించిన వివరాలను దాచి ఉంచాలని ప్రతి ఒక్కరినీ అమ్మ హెచ్చరించింది. ఫజల్‌ ఒక ముస్లిం అని ఎవరికీ చెప్పేవారం కాదు.

ఒకరోజు మధ్యాహ్నం తర్వాత, అంటే భోంచేసి అందరూ విశ్రాంతి తీసుకునే వేళ, ఎవరో మా ఇంటి తలుపు తట్టారు. అమ్మ స్వయంగా వెళ్లి తలుపు తీసింది. చేతుల్లో ఆయుధాలు, కళ్లలో ఆగ్రహం ప్రదర్శిస్తున్న కొంతమంది మగవాళ్లు ఇంటి వరండాలో నిలబడి ఉండటం చూసింది. ‘‘బీబీజీ! ఈ ఇంట్లో ఒక ముస్లింను మీరు దాచి ఉంచుతున్నట్లు మేము నమ్ముతున్నాము. అతడిని మాకు అప్పగించండి’’ అని వారు డిమాండ్‌ చేశారు. తామేం మాట్లాడుతున్నదీ వారికి బాగా తెలుసు అన్నట్టుగా వారి మాటల ధ్వని ఉంది. ఆ మనిషిని ఎలాగైనా పట్టు కోవాలన్న పట్టుదల వారిలో కనబడింది.

ఇలాంటిదేదో జరుగుతుందని ఫజల్‌ కరీమ్‌ ఎప్పుడూ భయ పడేవాడు. ఇప్పుడు ఆ క్షణం రానేవచ్చింది. అప్పుడు అమ్మకు 30 సంవత్సరాల వయస్సు మాత్రమే. ఇలాంటి పరిస్థితి ఆమె ఊహించినది కాదు. కానీ ఆమె సహజాత గుణం ఆ సమస్యకు పరిష్కారం కనుగొంది. ‘‘అవును. మా దగ్గర ఒక ముస్లిం బేరర్‌ ఉండేవాడు. కానీ అతడు వెళ్లిపోయి చాలా కాలమైంది’’ అని అమ్మ అబద్ధమాడింది.

అయితే తన మాటలను వాళ్లు నమ్మరని గ్రహించిన అమ్మ ఇలాచెప్పింది: ‘‘కావాలంటే మీరే వెనుక ఉన్న క్వార్టర్లలో వెళ్లి చూసుకోండి. మీకు తోడుగా మా మనిషిని ఒకరిని పంపుతాను.’’ ఇంటి ముందు తలుపు వెనకాల దాక్కుని ఉన్న ఫజల్‌ కరీమ్‌ ఈ సంభాషణ వింటూ భయంతో వణికిపోయాడు. తాను ఎవరికీ కనిపించకుండా ఉన్నప్పటికీ, ఆ క్షణంలో అతడి మనసులో ఎలాంటి భావాలు కలుగుతున్నాయో మనం ఊహించుకోవచ్చు. ఉన్నట్లుండి అమ్మ కరీం కేసి చూస్తూ, అతడిని ‘‘చున్నీ లాల్‌’’ అని పిలిచింది.

అప్పటికప్పుడే అతడి పేరును అమ్మ అలా మార్చేసింది. ‘‘ఫజల్‌ కరీమ్‌ తన ఇంటికి వెళ్లిపోయాడంటే వీళ్లు నమ్మడం లేదు. నువ్వు వాళ్లను క్వార్టర్ల వద్దకు తీసుకెళితే, వాళ్లే స్వయంగా చూస్తారు కదా!’’ వారితో వెళుతూ ఫజల్‌ తప్పకుండా వణికిపోయి ఉంటాడు. ఆ సమయంలో అతడు ఏం మాట్లాడి ఉంటాడు, లేదా అతడు ఎలా
స్పందించి ఉంటాడు అని నాకు ఎవరూ చెప్పలేదు. కానీ చున్నీ లాల్‌ వాళ్లతో వెళ్లాడు.

అతడితో కలిసి క్వార్టర్‌ వద్దకు వెళుతున్న ఆ క్రూరమైన, ఆగ్రహోదగ్రులైన మనుషులు తమ ముందు జరుగుతున్న ఈ నాటకం గురించి కనీసం ఊహించి ఉండరు. ఒకరి తర్వాత ఒకరుగా వారు క్వార్టర్లను తనిఖీ చేశారు. తర్వాత వారు మళ్లీ మా ఇంటివద్దకు వచ్చి అమ్మకు సలామ్‌ చెప్పి వెళ్లిపోయారు. అది చున్నీ లాల్‌కు మృత్యువు దాదాపుగా దగ్గరిదాకా వచ్చిన క్షణం. కానీ అతడు సురక్షితంగా తప్పించుకున్నాడు.

ఈ కథలో మలుపు ఏమిటంటే, అప్పటినుంచీ అతడి పేరు చున్నీ లాల్‌గా మారిపోయింది. 1960ల ప్రారంభం వరకు అతడు మా అమ్మానాన్నల వద్దే ఉండిపోయాడు. అయితే నాన్న అఫ్గానిస్తాన్‌ రాయబారిగా నియమితులు కావడంతో అతడు తన గ్రామానికి వెళ్లిపోయాడు. అయితే నా సోదరీమణులకు, నాకు ఎప్పుడూ అతడు చున్నీ లాల్‌గానే తెలుసు. నిజానికి, అతడు కూడా తనను అలాగే చెప్పుకొనేవాడు. తర్వాత ఫక్కున నవ్వేసి, తన పేరు ఎలా మారిపోయిందనే కథను చెప్పేవాడు. తనలో భయాలు తొలగి పోయాక, అది అతడికి ప్రీతిపాత్రమైన కథగా మారిపోయింది.

ఈ కథ నుంచి నేను నీతిని వెలికి తీయాలనుకోవడం లేదు. నేనలా చేసి ఉంటే అది అహంకారం, గర్వం కలయికలా ఉండేది. దానికి బదులుగా ఎల్‌.పి.హార్ట్‌లీ రాసిన నవల ‘ద గో–బిట్వీన్‌’లోని ప్రారంభ వాక్యాలను గుర్తు తెచ్చుకుని ఈ కథనాన్ని ముగించనివ్వండి. ‘గతం అనేది ఒక పరాయి దేశం. వాళ్లు అక్కడ పనులను భిన్నంగా చేస్తారు.’ మనలో కొందరం ఇంకా గతంలోనే జీవించడానికి ప్రాధాన్యం ఇవ్వడానికి ఇదే కారణమా?-కరణ్ థాపర్- వ్యాసకర్త సీనియర్‌ జర్నలిస్ట్‌ 

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top