
మహాశివరాత్రి పూజల కోసం దేవాలయానికి వెళ్ళిన ఒక దళిత మహిళను మధ్యప్రదేశ్‌లో ఆధిపత్య కులాల జనం అడ్డుకున్నారు. ఇలాంటి వార్తల్లోకొచ్చే ఘటనలతో పాటు, రానివి ఎన్నో దేశంలో చోటుచేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో కులానికి కాలం చెల్లిందని మోహన్ భాగవత్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అయ్యాయి. హిందూ ధార్మిక పీఠాధిపతులు వీటిని సహించలేక పోయారు. హిందూ ధార్మిక వ్యవస్థలో బ్రాహ్మణ పూజారి వర్గం ఆధిపత్యం ఎట్లా కొనసాగుతోందో దీనితో మనకు అర్థం కాగలదు. ఆర్‌ఎస్‌ఎస్ లాంటి సంస్థలకు కులనిర్మూలన మీద చిత్తశుద్ధి ఉంటే, ఈ బెదిరింపులకు భయపడకూడదు. అంబేడ్కర్ చెప్పినట్టు కుల నిర్మూలనకు పూనుకోకుండా, హిందూమతం పురోగమించడం అసాధ్యం.
మధ్యప్రదేశ్ లోని కర్‌గోవ్ గ్రామంలో మహాశివరాత్రి రోజు పూజలు చేయడానికి దేవాలయానికి వెళ్ళిన బలాయి కులానికి చెందిన దళిత మహిళను గ్రామంలోని ఆధిపత్య కులాల జనం అడ్డుకున్నారు. దళితులు దానిని ప్రతిఘటించడంతో రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. దాదాపు పన్నెండు మంది గాయపడ్డారు. ఇరువర్గాలు తలపడ
టంతో పోలీసులు జోక్యం చేసుకొని పరిస్థితిని అదుపులోకి తీసు కొచ్చారు.
మరో గ్రామమైన ఛోటా కర్సవాడలో కూడా ఇలాంటి సంఘటనే జరిగింది. పోలీసులు రెండు వర్గాల మీద కేసులు నమోదు చేశారు. ఇది కొన్ని జాతీయ దినపత్రికల్లో అచ్చయినందు వల్ల మనకు తెలిసింది. అసలు వార్తల్లోకి రాని ఎన్ని గ్రామాల్లో ఇటు వంటి సంఘటనలు జరిగాయో తెలియదు. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. చాలా గ్రామాల్లో దళితులు గ్రామంలోని దేవా లయంలోకి వెళ్ళడానికి ఇష్టపడరు. ఒకవేళ పోవడానికి ప్రయత్నిస్తే ఇటువంటి సంఘటనలు జరుగుతాయని భయపడి ఊరుకుంటారు. ఇటీవల జరిగిన ఎన్నో సంఘటనలు దీన్ని రుజువు చేస్తాయి.
ఈ నేపథ్యంలో ఇటీవల హిందూ ప్రముఖుల మధ్య జరిగిన వివాదం గురించి చెప్పాల్సి ఉంది. ఈ నెల 6వ తేదీన ముంబయిలో సంత్ రవిదాసు జయంతి ఉత్సవాల సందర్భంగా రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) సర్ సంఘ్ చాలక్ మెహన్ భాగవత్ చేసిన వ్యాఖ్యలు వివాదాన్ని రేపాయి. ‘‘కులవ్యవస్థకు కాలం చెల్లింది. కుల వ్యవస్థను భగవంతుడు సృష్టించాడనడం అబద్ధం. కొంతమంది పండితులు తప్పుదోవ పట్టించారు. దీనిని మనం పక్కన పెట్టాలి’’ అంటూ ఆ సభలో వ్యాఖ్యానించారు.
సంత్ రవి దాస్ ఈ దేశంలోని కులవ్యవస్థను నిరసించిన తాత్వికులలో ఒకరు. రవిదాస్ బోధనలు ఎంతో మందిని ప్రభావితం చేశాయి. దానినే మోహన్ భాగవత్ పునరుద్ఘాటించారు. అది నిజానికి కొంతలో కొంత సత్యం. కానీ హిందూ ధార్మిక పీఠాధిపతులు దానిని సహించలేక పోయారు. వెంటనే భాగవత్ మీద విరుచుకుపడ్డారు. పూరీ శంకరాచార్య నిశ్చలా నంద సరస్వతి ఈ వ్యాఖ్యలను ఖండించడమే కాకుండా, కుల వ్యవస్థను సంపూర్ణంగా సమర్థించారు. అంతే కాకుండా, పండితులైన బ్రాహ్మణులను, వారి చర్యలను కొనియాడారు.
‘‘బ్రాహ్మణులు ప్రపంచంలోనే అత్యంత మేధోశక్తి కలిగినవాళ్ళు. కుల వ్యవస్థ ఈ దేశానికి మేలు చేసింది. విద్య, వైద్యం, రక్షణ రంగాల్లో ప్రపంచానికి మార్గదర్శనం చేసింది’’ అంటూ ఆర్‌ఎస్‌ఎస్‌ను తీవ్రంగా విమర్శించారు. ఆర్‌ఎస్‌ఎస్ నాయకులు కూడా సంపూర్ణంగా భాగ వత్‌ను సమర్థించలేకపోయారు. పండితులంటే బ్రాహ్మణులు కారనీ, అది కులాన్ని దృష్టిలో పెట్టుకొని అనలేదనీ వివరణ ఇచ్చారు. పూరీ శంకరాచార్యకు సంజాయిషీ ఇచ్చుకునే వరకు వెళ్ళారు.
కులవ్యవస్థను నిర్మూలించాలనే లక్ష్యంలో పనిచేయాలనుకుంటున్నామని ఒక వైపు ప్రకటిస్తున్న ఆర్‌ఎస్‌ఎస్, రెండోవైపు పీఠాధి పతుల విమర్శలకు భయపడిపోయింది. దాదాపు పది సంవత్సరాల క్రితం 2014 మార్చ్ 7న భాగవత్‌ను నాగపూర్ ఆర్‌ఎస్‌ఎస్ కేంద్ర కార్యాలయంలో కలిశాం. నాతో పాటు సీనియర్ జర్నలిస్టు రామచంద్రమూర్తి కూడా ఉన్నారు. సబ్ ప్లాన్ అమలు విషయంలో చట్టం చేయాలని అన్ని పార్టీలను, సంస్థలను కలిసే ప్రక్రియలో భాగంగా ఆయన్ని కూడా కలిశాం. అప్పుడు కులం, అంటరానితనం, హిందూ మతంలో సమస్యలపై దాదాపు మూడు గంటలపాటు చర్చ జరిగింది.
‘‘అందరూ హిందువులని మీరు భావిస్తే అంటరానితనం, కులవివక్ష కొనసాగకుండా ఎందుకు మీరు కార్యక్రమాలు తీవ్రతరం చేయరు?’’ అని అడిగినప్పుడు, ‘‘ఇది నెమ్మదిగా జరగాలి. చాలామంది హిందూ ధార్మికకర్తలు ఇప్పటికీ కులవ్యవస్థను సమర్థిస్తున్నారు’’ అంటూ సమాధానం ఇచ్చారు. హిందూ ధార్మిక వ్యవస్థలో బ్రాహ్మణ పూజారి వర్గం ఆధిపత్యం ఎట్లా కొనసాగుతోందో దీనితో మనకు అర్థం కాగలదు.
ఈ వ్యాసం మొదట్లో పేర్కొన్న మధ్యప్రదేశ్ సంఘటనలకు కారణం, హిందూ పూజారి వర్గం ఆధిపత్య స్వభావం. కులవ్యవస్థ నశిస్తే పూజారి వ్యవస్థ, దానితో పాటు బ్రాహ్మణిజపు ఆధిపత్యం కుప్పకూలిపోతుందని వారి భయం. ఇక్కడనే మనం అసలు సమస్యకు వద్దాం. కులవ్యవస్థను సమర్థిస్తున్నవాళ్ళ గురించి చర్చ అనవసరం. కులం పోవాలనీ, కులవ్యవస్థకు కాలం చెల్లిందనీ మాట్లాడుతున్నవాళ్ళకు కూడా, ముఖ్యంగా ఆర్‌ఎస్‌ఎస్ లాంటి సంస్థ లకు కులనిర్మూలన మీద చిత్తశుద్ధిలేదు. హిందువులంతా ఒక్కటేననీ, కులం లేదనీ భావిస్తే, శంకరాచార్య బెదిరింపులకు భయపడే వాళ్ళుకాదు.
అందుకే కులవ్యవస్థకు పునాది ఏమిటి? ఎవరు దీనిని పెంచి పోషించారు? అనే ప్రశ్నలు వేసుకోవాలి. దానికి తగ్గట్టుగా కార్యా చరణకు పూనుకోవాలి. దీనికి ఇప్పుడు పెద్దగా శ్రమపడాల్సిన అవసరం లేదు. బాబాసాహెబ్ అంబేడ్కర్ అందుకు తన జీవితాన్ని ధారపోశారు. కులం పుట్టుక నుంచి కుల నిర్మూలన వరకు శాస్త్రీయ పరిశోధన చేసి మన ముందు సమగ్రమైన పరిష్కారాలను ఉంచారు. కులవ్యవస్థకు, కులాల పుట్టుకకు బ్రాహ్మణ పూజారి వర్గమే మొదటగా బీజాలు వేసిందనీ, దానిని పెంచి పోషించిందనీ ఎన్నో దృష్టాంతాలతో రుజువు చేశారు.
1916 మే 9న కొలంబియా విశ్వవిద్యాలయంలో జరిగిన సెమి నార్‌లో ‘‘భారత దేశంలో కులాల పుట్టుక, పనితీరు, అభివృద్ధి’’ అనే అంశంపై సశాస్త్రీయంగా ప్రసంగించారు. అప్పటివరకు కులం విషయంలో పరిశోధన చేసిన సెనార్ట్ నెస్‌ఫీల్డ్, సర్ హెచ్.హెచ్. రిస్‌లీ, డాక్టర్ కేడ్కర్‌ల అభిప్రాయాలను పూర్వపక్షం చేశారు. ‘‘కులం ఏకైక లక్షణం అంతర్ వివాహం. కులం మూలకారణం అదే అని నా ఉద్దేశం’’ అంటూ కులం పుట్టుకకు అంతర్ వివాహమే ప్రధాన కారణం అని చెప్పారు. కులం అనేది మొదటగా బ్రాహ్మణవర్గం తన గుంపును ఒక్క దగ్గర చేర్చి కంచె వేసుకున్నదనీ, దాని తర్వాత మిగతా వర్గాలు కంచెలు వేసు కున్నాయనీ అన్నారు. అందుకు గాను అనేక శాస్త్రాలను రూపొందించారనీ, అందులో బ్రాహ్మణవర్గం ఆధిపత్యాన్ని నిలబెట్టడానికి ఎన్నో కథలను సృష్టించారనీ అభిప్రాయపడ్డారు.
కులం పుట్టుక మీద ఆధారపడ్డ కులనిర్మూలన గ్రంథాన్ని రాసి, దేశానికి ఒక బృహత్తరమైన కార్యాచరణను రూపొందించారు అంబే డ్కర్. ఒక వేళ హిందూమతం తనను తాను సంస్కరించుకోవా లనుకుంటే రెండు మూడు ప్రతిపాదనలు చేశారు. హిందువులందరు ఒక్కటేనని చెప్పినప్పుడు, పూజారి వ్యవస్థను బ్రాహ్మణుల నుంచి విముక్తం చేసి, ఏ కులంవారైనా అర్హతను బట్టి పూజారులుగా నియమితులు కావాలన్నారు. కులవ్యవస్థను సమర్థిస్తున్న హిందూ గ్రంథాలలోని అంశాలను తొలగించాలని కూడా ప్రతిపాదించారు. నిజానికి ఈ రోజు హిందూ మతంగా చెప్పుకొంటున్న ఒక వ్యవస్థ, వేదాల కాలంలో ఉన్నట్టుగా లేదు. వేదాల కాలంలో యజ్ఞయాగాలలో ఉన్న ఆహారం, పద్ధతులన్నీ, బౌద్ధం తిరుగుబాటులో మార్చుకొని శాకాహారులుగా మారారు. ఇది వాస్తవం. అదే రీతిలో ఎన్నో జాతులను, కులాలను తమలో కలుపుకొన్నారు. గతంలో ఎస్సీ, ఎస్టీల ఇండ్లలోనికే వెళ్ళి పూజలు, పెళ్ళిళ్ళు చేయని పూజారులు ఇప్పుడు వెళుతున్నారు. ఇది ఒక మార్పే. అయితే ఇది సరిపోదు. బాబాసాహెబ్ చెప్పినట్టు కుల నిర్మూలనకు పూనుకోకుండా, హిందూమతం పురోగమించడం అసాధ్యం. -వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు-మల్లేపల్లి లక్ష‍్మయ్య