Cybercrime: ఒంటరిగా ఉన్నారా? భాగస్వామి కోసం ఎదురుచూస్తున్నారా అంటూ వల! 1.85 కోట్లు మీవేనంటూ..

Cybercrime Prevention Tips: SMS Forward Fraud How To Stay Secure - Sakshi

సైబర్‌ టాక్‌

డిజిటల్‌ మాధ్యమం ద్వారా ఖాతాలలోని డబ్బును దొంగిలించడానికి ఎస్సెమ్మెస్‌ ఫార్వర్డింగ్‌ యాప్‌లను ఉపయోగిస్తున్నారు మోసగాళ్లు. ఎస్సెమ్మెస్‌ ల ద్వారా మీ ఖాతాలో లక్షల రూపాయలు బదిలీ అవుతున్నాయనో, ఎలక్ట్రిసిటీ బిల్లు, పాన్‌కార్డ్, క్రెడిట్‌కార్డ్‌ .. వంటివి అప్‌డేట్‌ చేసుకోవడానికి వివరాలను పూరింపమని వచ్చే సంక్షిప్త సందేశాల పట్ల జాగ్రత్త పడటం మంచిది. 

డిజిటల్‌గా చెల్లింపుల వల్ల ప్రయోజనాలు ఉన్నాయి. అయితే ఇది ఆన్‌లైన్‌ మోసానికి మరింత హాని చేస్తుంది. ఆన్‌లైన్‌ చెల్లింపులు, డిజిటల్‌ లావాదేవీలు గత కొన్నేళ్లుగా జీవితాలను సులభతరం చేశాయి. మెజారిటీ కస్టమర్‌లు, చిల్లర దుకాణాలు, బడ్డీకొట్ల వాళ్లు కూడా ఈ చెల్లింపు పద్ధతులను ఇష్టపడుతున్నారు.

స్కామర్‌లు మనదేశంలోని వ్యక్తులను మోసం చేయడానికి ఎస్సెమ్మెస్‌ ఫార్వార్డింగ్‌ యాప్‌లను ఉపయోగిస్తారు. వాటిలో చాలా వరకు స్కామ్‌లు ఫిషింగ్‌ మోసాలకు దారితీస్తున్నాయి. అంతేకాకుండా స్కామర్‌లు అందించిన షార్ట్‌ లింక్‌లను బాధితులు క్లిక్‌ చేసిన తర్వాత మాల్వేర్‌ ఇన్‌స్టాల్‌ అయిన సందర్భాలు అనేకం ఉన్నాయి.

స్కామర్లు ఉపయోగించేవి:
బాధితుడి నమ్మకం, అజ్ఞానం, భయం, దురాశ, అత్యవసరం.. ఇవే మోసగాళ్లకు పెట్టుబడి. 

మోడల్‌ 1 :  డబ్బు క్రెడిట్‌
ఉదాహరణకు: మీ అకౌంట్‌లోకి రూ. 3,3000 క్రెడిట్‌ అవుతుంది. మీ వివరాలను తక్షణమే నమోదు చేయండి. అందుకు వెంటనే తనిఖీ చేయండి... అంటూ ఓ లింక్‌ ఇస్తారు. మీరు అలాంటి మెసేజ్‌ చదివినా కానీ, అక్కడ ఇచ్చిన లింక్‌పై క్లిక్‌ చేయకూడదని గుర్తు పెట్టుకోండి. ఎందుకంటే ఆ లింక్‌ మీ డబ్బును దోచుకోవడానికి ఒక మార్గం కావచ్చు. 

మోడల్‌ 2 :  విద్యుత్‌ బిల్లు
నోటిఫికేషన్‌ ప్రియమైన కస్టమర్, మీ మునుపటి నెల బిల్లు అప్‌డేట్‌ కానందున ఈ రాత్రి 8:30 లకు ఎలక్ట్రిసిటీ ఆఫీస్‌ నుండి మీ ఎలక్ట్రిసిటీ పవర్‌ డిస్‌కనెక్ట్‌ చేయబడుతుంది. దయచేసి వెంటనే అధికారిని సంప్రదించండి 8240471159.. ధన్యవాదాలు అనే మెసేజ్‌ వస్తుంది. 

మోడల్‌ 3 :  పాన్‌కార్డ్‌ అప్‌డేట్‌ 
ప్రియమైన వినియోగదారు మీ యోనో ఎస్‌బిఐ నెట్‌ బ్యాంకింగ్‌ ఖాతా ఈరోజు సస్పెండ్‌ చేయబడుతుంది. దయచేసి మీ పాన్‌ కార్డ్‌ని అప్‌డేట్‌ చేయండి. అందుకు ఇక్కడ లింక్‌ క్లిక్‌ చేయండి http://bit y. wr/wkx822222  అని ఉంటుంది. 

మోడల్‌ 4 :  క్రెడిట్‌ కార్డ్‌ బకాయి
‘‘ప్రియమైన కస్టమర్, దయచేసి మీ కార్డ్‌ బకాయి మొత్తాన్ని చెల్లించండి. మా పోర్టల్‌లో డిజిటల్‌ మోడ్‌లను ఉపయోగించి 0003తో ముగిసే మీ బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డ్‌పై 2786.74 లేదా కనీస మొత్తం రూ. 140/– చెల్లించండి. అందుకు http://nmc. rf /kojkBGGGG. ఇప్పటికే చెల్లించినట్లయితే ఈ సందేశాన్ని మర్చిపోండి. UPI  చెల్లింపు వీడియోను bit. y/2qKYXb88888లో, VPA ID ఈ వీడియోను  bit. ly.2JJQr9KKKKKలో చూడండి’’అనే మెసేజ్‌ ఉంటుంది.

మోడల్‌ 5 :  రొమాన్స్‌ ఫ్రాడ్‌
‘మీరు మీ జీవితంలో ఒంటరిగా ఉన్నారని భావిస్తున్నారా, ఒక మధురమైన కాల్‌ మీ కలలను సాకారం చేయగలదు, స్నేహం డేటింగ్‌ భాగస్వామి మీ కోసం వేచి ఉన్నారు. కాల్‌ చేయండి’ అంటూ నెంబర్‌ ఇస్తారు. 

మోడల్‌ 6 : డిపాజిట్‌ మోసం
‘అనుకోకుండా మీ ఖాతాలో డబ్బు డిపాజిట్‌ చేయబడింది, దయచేసి తిరిగి చెల్లించండి’ అని మెసేజ్‌లో ఉంటుంది. 

మోడల్‌ 7 :  లాటరీ మోసాలు
‘మీ మొబైల్‌ నంబర్‌ లాటరీలో రూ. గెలుచుకున్నమొత్తం 1.85 కోట్లు, అమెరికా నుంచి కారును పంపుతున్నాం, క్లెయిమ్‌ చేయడానికి మీ పేర్లు, మొబైల్‌ నంబర్, చిరునామా.. వివరాలతో ప్రత్యుత్తరం పంపండి’ claim4222837@gmail.comఅని మెసేజ్‌లో ఉంటుంది. గమనించగలరు. 

చిట్కాలు
1. తెలిసిన మూలాల ద్వారా పంపబడినప్పటికీ,www.unshorten.it  ఉపయోగించి సంక్షిప్త URL / లింక్‌లను ధ్రువీకరించండి.
2. క్లిక్‌ చేసే ముందు వెబ్‌లింక్‌ను ఒకటికి రెండుసార్లు తనిఖీ చేయండి. దాని ఫిషింగ్‌ లింక్‌ కాదని నిర్ధారించడానికి  www.isitphishing.org లేదా www.urlvoid.com ఉపయోగించి అన్ని లింక్‌లను ధ్రువీకరించండి.
3. ఇ–మెయిల్‌ ద్వారా సున్నితమైన, వ్యక్తిగత లేదా యాజమాన్య సమాచారాన్ని ఎవరు అడుగుతున్నారో దానితో సంబంధం లేకుండా ఎప్పుడూ పంపకండి.
4. https://dnschecker.org/email-header-analyzer.php ని ఉపయోగించి ఇమెయిల్‌ యొక్క పూర్తి సారాంశాన్ని తనిఖీ చేయండి

5. మీ ఇ–మెయిల్‌ లేదా ఎస్సెమ్మెస్‌ మొత్తం తప్పులతో కూడిన స్పెల్లింగ్స్, సరైన విధంగా లేని వ్యాకరణాన్ని గమనించవచ్చు.
6. వ్యక్తిగత సమాచారం కోసం అడిగే లింక్‌లు / ఫారమ్‌లు (పాస్‌వర్డ్‌లు – బ్యాంక్‌ సమాచారం) ఉంటాయి.
7. సెర్చ్‌ ఇంజిన్‌లలో కస్టమర్‌ కేర్‌ నంబర్‌ల కోసం ఎప్పుడూ వెతకవద్దు. సరైన కస్టమర్‌ కేర్‌ నంబర్‌ కోసం సంబంధిత యాప్‌ లేదా సంబంధిత అప్లికేషన్‌ వెబ్‌సైట్‌కు లాగిన్‌ అవ్వండి.

8. క్యూఆర్‌ కోడ్‌ని స్కాన్‌ చేయడం లేదా OTP, UPIN, బ్యాంక్‌ CVV నంబర్‌లను ఇవ్వడం అంటే మీరు మీ ఖాతా నుండి డబ్బు ట్రాన్స్‌ఫర్‌ చేస్తున్నారని, మీకు రావడం లేదని అర్థం.
9. అన్ని సోషల్‌ మీడియా, బ్యాంకింగ్, ఇ–మెయిల్‌ ఖాతాల కోసం టూ ఫ్యాక్టర్‌ అథెంటికేషన్‌ (2FA)ని ప్రారంభించండి.
10. బ్యాంకింగ్‌ లావాదేవీలు చేస్తున్నప్పుడు లేదా సోషల్, ఇ–మెయిల్‌ ఖాతాలకు లాగిన్‌ చేస్తున్నప్పుడు మీ స్క్రీన్‌ను ఎప్పుడూ షేర్‌ చేయవద్దు.   
-ఇన్‌పుట్స్‌: అనీల్‌ రాచమల్ల, డిజిటల్‌ వెల్‌బీయింగ్‌ ఎక్స్‌పర్ట్, ఎండ్‌ నౌ ఫౌండేషన్‌

చదవండి: Cyber Crime: కేవైసీ అప్‌డేట్‌ చేస్తున్నారా?! పొరపాటున ఇలా చేశారో.. అం‍తే ఇక!
Cyber Crime Prevention Tips: ఇన్‌స్టాగ్రామ్‌లో బ్లూటిక్‌ ఉందా?! ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా అంతే సంగతులు

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top