హిమపుత్రికగా హేమమాలిని | Actress Hema Malini performs her ballet Durga in Hyderabad | Sakshi
Sakshi News home page

హిమపుత్రికగా హేమమాలిని

Oct 15 2026 12:28 AM | Updated on Oct 15 2026 12:28 AM

Actress Hema Malini performs her ballet Durga in Hyderabad

లెజెండ్‌

వయసు అనేది కేవలం ఒక సంఖ్య. 77 ఏళ్ల హేమమాలిని అదే నిరూపిస్తున్నారు. దసరా నవరాత్రుల తొలిరోజు,  హైదరాబాద్‌లోని వేదికపై హేమమాలిని మాతా పార్వతిగా, ఆ తర్వాత దుర్గాదేవిగా మారి ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు.

‘నా అత్యంత ప్రజాదరణ పొందిన బ్యాలే ‘దుర్గ’ను నవరాత్రి మొదటి రోజున ప్రదర్శించడం చాలా గొప్ప అనుభూతి ఇచ్చింది. నేను నిజంగా ధన్యురాలిని’... హేమమాలిని తన సోషల్‌ మీడియాలో రాసుకున్న మాటలివి.

మొన్నటి శనివారం హైదరాబాద్‌లో ‘అగర్వాల్‌ సమాజ్‌’ వారి ‘నవరాత్రి వేడుకల్లో’ ఆమె తన అత్యంత ప్రసిద్ధ నృత్యనాటిక ‘దుర్గ’ను ప్రదర్శించాక ఆమె రాసుకున్న పదాలివి.

హేమమాలిని వయసు 77. నటిగా, రాజకీయవేత్తగా, తల్లిగా ఎన్నో బాధ్యతలు ఉన్నాయి. అదీగాక నాట్యానికి చాలా శక్తి, ఓర్పు కావాలి. అయినప్పటి హేమమాలిని ఎప్పుడూ తన మొదటి ప్రాధాన్యం అయిన నృత్యాన్ని ఒదులుకోలేదు. కొనసాగిస్తూనే ఉన్నారు. అలా కొనసాగడమే ఆరోగ్యం అని సూచిస్తున్నారు. వయసు ఎంతైనా ఇష్టమైన పని చేయడమే జీవితాన్ని అందంగా మార్చగలదు అంటున్నారామె.

శాంతం నుంచి ఉగ్రానికి
‘దుర్గ’ బ్యాలే ముఖ్యాంశం దుర్గాదేవి శక్తిని చూపించింది. అందుకే ‘దుర్గ’లో హేమమాలిని ముందు శాంత స్వరూపిణి పార్వతిగా కనిపించి, తర్వాత మహిషాసురుడిని సంహరించే ఉగ్రరూప దుర్గగా మారతారు. రెండు సందర్భాలలో ఆమె నృత్యమే కాదు ఆహార్యం కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. గులాబీ రంగు చీర, భారీ ఆభరణాలు, కిరీటం, పూలమాలలతో దుర్గగా; మరో ఘట్టంలో ఆకుపచ్చ చీర, చేతిలో త్రిశూలంతో పార్వతిగా ఆమె నృత్యం చేశారు. ఈ ప్రదర్శన చూసిన నెటిజన్లు ‘బ్యూటిఫుల్లీ డివైన్‌’ అని కొనియాడుతున్నారు. ‘ఈ బ్యాలే దివ్య స్త్రీ శక్తికి నివాళి’ అంటారు హేమ.

అందానికి మురిసిపోలేదు
‘నా అందం, రూపాలను నేనెప్పుడూ తలకెక్కించుకోలేదు.  నా ఉచ్ఛ దశలో కూడా అద్దంలో చూసుకుని అరే, ఏమిటీ అందం... అని ఆశ్చర్యపోలేదు. ఇటీవలే నా పాత సినిమాలు చూస్తూ తెరపై ఉన్న ఆ అందమైన అమ్మాయి ఎవరు? అని ముచ్చటపడుతున్నాను’ అన్నారామె. మహిళలు ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలో చెప్పారు హేమమాలిని. ‘క్రమశిక్షణతో కూడిన జీవనశైలి ముఖ్యం. 

సరైన సమయానికి తినడం, నిద ప్రోవడం. అర్ధరాత్రి వరకు మెలకువగా ఉండకపోవడం పాటించగలగాలి. అన్నీ తినండి, కానీ మితంగా తినండి. అన్నిటి కంటే ముఖ్యంగా సానుకూల ఆలోచనలు కలిగి ఉండండి. ప్రతికూల వ్యక్తులతో సహవాసం చేయకండి’ అన్నారామె. 77 ఏళ్ల వయసులోనూ భక్తితో, క్రమశిక్షణతో వేదికపై తన తేజస్సును ప్రదర్శిస్తున్న హేమమాలిని నిజమైన లెజెండ్‌. ప్రతి మహిళకు స్ఫూర్తి. 
 

నృత్యమే మొదటి ప్రేమ 
హేమమాలిని కేవలం ‘డ్రీమ్‌ గర్ల్‌’ కాదు. ఆమె భరతనాట్య కళాకారిణి. తన తండ్రి సూచనతో కెరీర్‌ ప్రారంభంలోనే బ్యాలేల వైపు మళ్లారు. తను స్థాపించిన నాట్యవిహార్‌ కళా కేంద్రం నుంచి ‘మీరా’ను తొలి బ్యాలేగా తీర్చిదిద్దారు. తర్వాత రామాయణ గాథను బ్యాలేగా మలిచారు. కూచిపూడి, మోహినీయాట్టంలో శిక్షణ పొందిన హేమమాలిని ఒడిస్సీలో శిక్షణ పొందిన తన కుమార్తెలు ఈషా, అహనాతో కలిసి ‘పరంపర’ అనే నృత్య ప్రదర్శన ఇచ్చారు. 

నృత్య రూపకాల్లో నరసింహుడు, రాముడి పాత్రలు కూడా పోషించిన హేమమాలిని 2024లో అయోధ్య రామమందిర ప్రారంభోత్సవంలో సీతగా నటించారు. రెండేళ్లక్రితం మధురలో నవరాత్రి సందర్భంగా రెండు గంటల పాటు దుర్గ రూపాలను పోషించి ప్రేక్షకులను మెప్పించారు.  ఇలా ఎలా చేయగలరు అనంటే సాధన ద్వారానే అంటారామె. ముంబైలోని తన సొంత ఇల్లు ‘అద్వితీయ’లోని విశాలమైన హాల్‌లో ప్రత్యేక ఫ్లోరింగ్‌ ఉంది. ఆ హాల్‌లో దాదాపు 30 మంది కలిసి సాధన చేసే సదుపాయం ఉంది. అక్కడే ఆమె తన విద్యార్థులతో ప్రాక్టీసు కొనసాగిస్తుంటారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement